నకిలీ..మకిలీ! | Nakilimakili! | Sakshi
Sakshi News home page

నకిలీ..మకిలీ!

Published Tue, Jan 13 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

Nakilimakili!

రేపల్లె: నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలకు నగరం మండలం కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. జిల్లాలో తొలిసారి 2006లో ఇక్కడ నకిలీ పాస్‌పుస్తకాలు వెలుగుచూశాయి. తిరిగి 2012లో ఇదే మండలానికి చెందిన సుమారు 73 మంది నకిలీ పాస్ పుస్తకాలపై చెరుకుపల్లి మండలం ఆరుంబాక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రుణాలు పొందినట్టు బయటపడింది. ఈ రెండు సంఘటనల్లో ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో నకిలీల తయారీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
 
తాజాగా, నకిలీ పాస్‌పుస్తకాల తయారీ ముఠా కంప్యూటర్ అడంగల్‌లో భూ యజమానుల పేర్లు మార్చి అసలు భూమి  లేనివారి పేర్లు నమోదుకు తెరతీసింది. ఈ విధానంలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈసీలు పొంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(సొసైటీలు), వాణిజ్య, జాతీయ బ్యాంకుల్లో అతి సులువుగా రుణాలు పొందుతున్నారు. దీని కోసం కొందరు రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో సొమ్ము ముట్టజెప్పి తమ పని కానిస్తున్నారు.
 
నకిలీ పాస్ పుస్తకాల ముఠా సభ్యులు రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ఈసీ పొందగానే రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పి కంప్యూటర్ అడంగల్‌లో ఇంతకు ముందు నమోదు చేయించిన దొంగ పేర్లను తొలగిస్తున్నారు. తీరా అసలు రైతులు ఈసీ కోసం వెళుతుంటే, ఆ సర్వే నంబర్లతో గతంలోనే ఈసీ జారీ చేసినట్లు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు.
 
ఇలాంటి సంఘటనలకు ఉదాహరణలు పరిశీలిస్తే... నగరం మండలం సర్వే నంబర్ 166/1లో మొత్తం 3.91 ఎకరాల భూమి ఉంది. ఇందులో అసలు రైతులు కారంకి రాంబాబుకు 1.85 ఎకరాలు, వాక వెంకటేశ్వరికి 1.80 ఎకరాలు, ఇతరులకు 0.26 ఎకరాలు ఉంది. అయితే వీరితో పాటు భూమి లేని లుక్కా శ్రీచంద్రకళ భర్త గుడారంకయ్యకు 1.84 ఎకరాలు ఉన్నట్లు ఈసీ విడుదల చేశారు. ఇదే సర్వే నంబరుకు సంబంధించి జనవరి 10వ తేదీన మీ సేవ కార్యాలయం నుంచి తీసుకున్న అడంగల్ కాపీలో చంద్రకళ  పేరు లేదు.
 
మరో సంఘటనలో... నగరం మండలం ఏలేటిపాలెం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 158లో పిన్నిబోయిన లక్ష్మీకాంతమ్మకు 2.3 ఎకరాలు, పిన్నిపోయిన వెంకటచింతారావుకు 2 ఎకరాలు, పిన్నిబోయిన వెంకటేశ్వరరావుకు 1ఎకరం, ఉగ్గం శ్రీనివాసరావుకు 1.50 ఎకరాలు, పిన్నిబోయిన కృష్ణమూర్తికి 2 ఎకరాలు, మరకా యానాదికి 2.1 ఎకరాలు, మరకా సాంబయ్యకు 2 ఎకరాలు ఉన్నట్లు గతంలో జారీ చేసిన ఈసీలో ఉంది. ఇదే నంబర్‌లో ప్రస్తుతం అడంగల్ కాపీ కోసం దరఖాస్తు చేసుకుంటే కంప్యూటర్‌లో తహశీల్దార్ వెరిఫికేషన్ అని చూపుతోంది. వాస్తవానికి ఈ సర్వేనంబర్‌లో పిన్నిబోయిన వెంకట చింతారావు, పిన్నిబోయిన లక్ష్మీకాంతం, వెంకటేశ్వరరావులకు పొలం లేనప్పటికీ ఉన్నట్లు రావటం అసలు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
 
ఇలా నకిలీ ఈసీలు సృష్టించి నగరం, పూడివాడ, మంత్రిపాలెం, ఉల్లిపాలెం, పెదపల్లి  సొసైటీల్లో రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం.
 
పాస్‌పుస్తకాలు స్వాధీనం..
నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి 2012లో చెరుకుపల్లి ఎస్‌బీఐలో రుణాలు పొందిన కేసును ఇప్పటికీ పోలీసులు విచారణ చేస్తున్నారు. నగరం మండలం పూడివాడ గ్రామానికి చెందిన వారు ఆ జాబితాలో ఎక్కువగా ఉండటంతో పోలీసులు గ్రామ రెవెన్యూ అధికారి ఇంట్లో సోదాలు జరిపి 26 పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకుని తహశీల్దార్‌కు అందించారు. ఇవి నకిలీ పుస్తకాలా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఏలేటిపాలెంలోని సర్వేనంబర్ 158లో నకిలీ రైతుల పేర్లు తొలగించే ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది.
 
నిజాలు తేలుస్తాం...
సర్వే నంబరు 166/1లో మొత్తం విస్తీర్ణం 3.91 ఎకరాలు. ఇందులో లుక్కా శ్రీచంద్రకళకు ఎలాంటి భూమి లేదు. అయితే ఆమె పేరుతో ఈసీ ఎలా వచ్చిందో తెలియదు. పూర్తి విచారణ చేసి నిజాలు తేలుస్తాం. అదేవిధంగా  పిన్నిబోయిన వెంకట చింతారావు, పిన్నిబోయిన లక్ష్మీకాంతం, పిన్నిబోయిన వెంకటేశ్వరరావు, పిన్నిబోయిన కృష్ణారావు పేర్లును పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
 -  శ్రీనివాసరావు, తహశీల్దారు, నగరం

Advertisement

పోల్

Advertisement