నళినికి 12 గంటల పెరోల్- తండ్రి అంత్యక్రియలకు హాజరు
తాను నిర్దోషినని పునరుద్ఘాటన
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్‌కు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం 12 గంటల పెరోల్ మంజూరైంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇచ్చిన పెరోల్‌పై ఆమె వేలూరు జైలు నుంచి చెన్నైకి చేరుకుని తండ్రి శంకర నారాయణ్(91) అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత మళ్లీ జైలు వెళ్లారు. తాను నిర్దోషిని అని, రాజీవ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెన్నైలో మీడియాతో అన్నారు.
ఈ కేసులో తనతోపాటు శిక్ష అనుభవిస్తున్న మిగతావారి విడుదల కోసం తమిళనాడు సీఎం జయలలిత చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు తన విడుదలకు సహకరించాలని కోరారు. 2004లో తన సోదరి పెళ్లికి పెరోల్‌పై విడుదలైన నళిని ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడడం ఇదే తొలిసారి. రాజీవ్ హత్య కేసులో ఆమెకు 1998లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించగా, 2000లో నాటి తమిళనాడు గవర్నర్ ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. తాను 24ఏళ్లకు పైగా జైల్లో ఉన్నాను కనుక ముందస్తుగా విడుదల చేయాలని ఆమె గత ఏడాది మద్రాస్ హైకోర్టును కోరారు.
రాజీవ్ హత్య కేసులో నిందితురాలికి పెరోల్
Published Thu, Feb 25 2016 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement
Advertisement