Nalini sriharan
-
Rajiv Case: కేంద్రం బాటలో సుప్రీంకు కాంగ్రెస్!
న్యూఢిల్లీ: రాజీవ్ దోషుల విడుదలను భావోద్వేగ రాజకీయ సమస్యగా మల్చుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయా?. మాజీ ప్రధాని హత్య కేసులో నిందితుల ముందస్తు విడుదలను పునపరిశీలించాంటూ.. కేంద్రం ఇదివరకే సుప్రీం కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఇప్పుడు.. సుప్రీం ఆదేశాలు వెలువడిన పదిరోజుల తర్వాత.. రాజీవ్ సొంత పార్టీ కాంగ్రెస్ కూడా రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో కేంద్రం ఓ అడుగు ముందు ఉండడంపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా విమర్శలు చెలరేగినట్లు సమాచారం. దీంతో ఈ వారంలోనే సుప్రీం ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ధృవీకరించింది కూడా. దోషులను రాజీవ్ కుటుంబం క్షమించినా.. తాము క్షమించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం ఆదేశాలు వెలువడిన వెంటనే స్పందించిన కాంగ్రెస్ కీలక నేతలు.. ప్రెస్‌మీట్ నిర్వహించి మరీ విడుదల ఆదేశాలను దురదృష్టకరమని పేర్కొన్నారు. అంతేకాదు.. న్యాయస్థానం ఆదేశాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో కేంద్రం ముందుగా స్పందించి.. విడుదల ఆదేశాలపై సుప్రీంకు వెళ్లింది. గత శుక్రవారం కేంద్రం దోషుల విడుదల ఆదేశాలను పునపరిశీలించాలని ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించబోతోంది కాంగ్రెస్. నవంబర్ 11వ తేదీన రాజీవ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మిలిగిన ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళిని శ్రీహారన్, ఆర్పీ రవింద్రన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్ హత్య కేసు టైం లైన్ 1991 మే 21: రాజీవ్ హత్య. ఈ కేసులో ఏడుగురి అరెస్టు. నళిని ఆ సమయంలో గర్భవతి. జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 1991 జూన్ 11: పెరారివాళన్‌ను అరెస్టు చేసిన సిట్. టాడా చట్టం కింద కేసు. 1991: బెంగళూరులో పేలుడు సూత్రధారి శివరాసన్ తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. దాంతో మరో ఆరుగురితో కలిసి శివరామన్ ఆత్మహత్య. 1992: రాజీవ్ హత్యలో ఎల్టీటీఈ పాత్ర ఉందని తేల్చిన సిట్. 1990లోనే జాఫ్నా అడవుల్లో ఇందుకు ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పథక రచన చేసినట్టు వెల్లడి. 1998: మురుగన్, సంథాను, పెరారివళన్, నళిని సహా మొత్తం 26 దోషులకు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 1999: నలుగురు నిందితుల అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మురుగన్, శంతను, పెరారివాళన్, నళినిలకు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. ముగ్గురికి జీవితకాల శిక్ష విధిస్తూ మిగతా 19 మందిని వదిలేసింది. నళిని, మురుగన్, శంతను, పెరారివాళన్ క్షమాభిక్ష అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. 2001: శంతను, మురుగన్, పెరారివాళన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు. ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్ హైకోర్టు సెప్టెంబర్ 9న స్టే విధించింది. దాన్ని జీవితకాల శిక్షకు తగ్గించాలన్న తీర్మానానికి నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆమోదం తెలిపారు. 2011: రాజీవ్‌ను హత్య చేసినందుకు భారత్‌కు ఎల్టీటీఈ క్షమాపణ. 2014: రాజీవ్ భార్య సోనియా గాంధీ అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షగా తగ్గించిన సుప్రీంకోర్టు. 2018: మొత్తం ఏడుగురు నిందితులనూ విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ సిఫార్సు. 2019: నళినికి తొలిసారి పెరోల్. 2021: నళిని, రవిచంద్రన్‌లకు పెరోల్. 2022: సుప్రీంకోర్ట్ తీర్పుతో మే 18న పెరారివాళన్ జైలు నుంచి విడుదలయ్యాడు. 2022 సెప్టెంబర్: నళిని, రవిచంద్రన్ విడుదలకు సుప్రీంకోర్ట్ ఆదేశం. నవంబర్ 2022: మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్ తీర్పు. -
సంతోషంగా లేను! నాభర్తను విడుదల చేయండి: నళిని శ్రీహరన్
Rajiv Gandhi assassination case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు నిందితులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ హత్య కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకరైన నళిన్ శ్రీహరన్ తమిళనాడు వెల్లురూ జైలు నుంచి గతవారమే విడుదలయ్యారు. అలాగే ఆమెతోపాటు దోషులుగా ఉన్న రాబర్ట్ పయస్, రవిచంద్రన్, శ్రీహరన్, జయకుమార్, శంతనను కూడా విడుదల చేయాలని సుప్రీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆమెతో పాటు ఉన్న నలుగురు శ్రీలంక పౌరులు చట్టవిరుద్ధంగా భారత్‌లో ఉన్నందున్న జైలు నుంచి అధికారికంగా విడుదలైన తర్వాత కూడా తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శరణార్థి శిభిరంలో ఉంచారు. అందువల్ల నళిని తన భర్తను కలవలేకపోయింది. దీంతో ఆమె శ్రీలంక పౌరులను విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులలో ఒకరైన నళిని మాట్లాడుతూ....తాను తన భర్తను కలవలేదని, అందువల్ల తాను విడుదలైనందుకు సంతోషంగా లేనని ఆవేదనగా చెప్పారు. దయచేసి వీలైనంత త్వరగా తన భర్తను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తాము కటకటాల వెనుక ఉన్నప్పుడూ కూడా చాలామంది తమ విడుదలను వ్యతిరేకిస్తూ... మరణ శిక్షపడాలని భావించారని వాపోయారు. తాను ఆ సమయంలో రెండు నెలల గర్భవతిని అని చెప్పారు. తమది కాంగ్రెస్ కుటుంబ అని రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడూ తమ కుటుంబం బాధతో భోజనం కూడా చేయలేదన్నారు. రాజీవ్ గాంధీ హత్యలో తన పేరు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..తనకు ఈ నింద నుంచి విముక్తి కావాలి అని విలపించారు. (చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసు: మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా: నళిని శ్రీహరన్) -
ప్రియాంక, రాహుల్‌ను కలుస్తా..
సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి జనావాసంలోకి వచ్చిన నళిని ఆదివారం చెన్నై ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తమ విడుదల కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు చెప్పారు. అవకాశం ఇస్తే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు జీవితం నుంచి నళినితో పాటు ఇతర నిందితులకు విముక్తి కలిగిన విషయం తెలిసిందే. నళిని, రవిచంద్రన్ జైలు నుంచి విడుదలై ఇళ్లకు చేరుకున్నారు. అయితే నళిని భర్త మురుగన్, జయకుమార్, శాంతను, రాబర్డ్ శ్రీలంక వాసులు కావడంతో వీరిని మాత్రం తిరుచ్చిలోని ఈలం తమిళుల పునరావస కేంద్రంలో ఉంచారు. 30 ఏళ్లు జైలు పక్షిగా ఉండి, ప్రస్తుతం స్వేచ్ఛ లభించడంతో నళిని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం చెన్నైకు చేరుకున్న ఆమె ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, జైలులో తాను అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఎంతో ప్రేమ చూపించారు.. న్యాయవాదులు తన విడుదల కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేసుకున్నారు. అలాగే మాజీ సీఎం పళణి స్వామి, ప్రస్తుత సీఎం స్టాలిన్ తమ విడుదల వ్యవహారంలో ప్రత్యేక చొరవ చూపించారని పేర్కొన్నారు. అంతే కాదు, యావత్ తమిళ ప్రజలందరూ తమ విడుదల కోసం ఎదురు చూశారని, తమ మీద ఎంతో ప్రేమను చూపించారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజలే కాకుండా నాయకులు కూడా తనకు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. అందుకే అందరినీ కలిసి పేరు పేరును ధన్యవాదులు తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భారతీయులమే.. భర్త మురుగన్‌తో తన వివాహం ఇక్కడ రిజిస్ట్రర్ అయ్యిందని, పైగా తాను భారతీయురాలు అని నళిని వెల్లడించింది. తామిద్దరం కలిసి జీవించే అవకాశం కోసం సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు చెప్పారు. అవకాశం ఇచ్చి అత్యవసర వీసా, పాస్‌పోర్టు సమకూర్చిన పక్షంలో ఆగమేఘాలపై లండన్‌లో ఉన్న కుమార్తెను మురుగన్‌తో కలిసి వెళ్లి చూడాలని ఉందని పేర్కొంది. తన కుమార్తె లండన్‌లో గ్రీన్ కార్డ్ హోల్డర్ అని, ఆమెతో తామిద్దరం కలిసి ఉండేందుకు సైతం అవకాశం ఉందన్నారు. శ్రీలంకకు భర్తతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని, వెళ్లాల్సిన అవసరం కూడా తన లేదన్నారు. జైలులో ఉన్న సమయంలో ఎన్నో కలలు కన్నానని, అవన్నీ ప్రస్తుతం నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రియాంక ఏడ్చేశారు.. ప్రియాంక గాంధీ గతంలో తనను జైలులో కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో ఆమె గట్టిగా ఏడ్చేశారని తెలిపారు. తండ్రిని తలచుకుంటూ తీవ్ర ఉద్వేగానికి ఆమె లోనయ్యారని పేర్కొన్నారు. అవకాశం ఇస్తే ప్రియాంకతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఎప్పటికైనా జైలులో అష్టకష్టాలు పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత అమ్మ జయలలిత సమాధి, మిస్సెల్‌మన్ అబ్దుల్ కలాం సమాధులను సందర్శించి నివాళులర్పించాలని ఉందని తెలిపారు. తన భర్తను త్వరితగతిన ఈలం పునారవాస శిబిరం నుంచి బయటకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. -
మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా!: నళిని శ్రీహరన్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళిని తోపాటు మరో ఐదుగురు నిందితులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ గాందీ హత్య కేసులో దోషులలో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడుతూ...."ఆ దారుణం గురించి ఆలోచిస్తూ చాలా ఏళ్లు గడిపాం. మమ్మల్ని క్షమించండి. ఆ ఆత్మహుతి దాడి ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు ఆ విషాదం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను." అని బాధితుల కుటుంబాలకు నళిని పశ్చాత్తాపంతో కూడిన సందేశం ఇచ్చింది. తాను తన భర్తతో కలిసి యూకే వెళ్లి స్థిరపడాలనుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబాన్ని కలుస్తారా అని మీడియా ప్రశ్నించగా...వారు కలుస్తారని అనుకోను, కలిసే సమయం అయిపోయిందని భావిస్తున్నాను అని నళిని అన్నారు. అయితే రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఈ తీర్పుని తమిళనాడులో చాలా మంది స్వాగతించారు. ఖైదీల సత్ప్రవర్తన, ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మేలో విడుదల కావడం, అతడు అరెస్టు అయ్యే సమయానికి 19 ఏళ్లు కావడం, అదీగాక దోషులంతా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. (చదవండి: రాజీవ్ హత్య కేసు: ఎట్టకేలకు నళినికి విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?) -
ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?
రాజీవ్ హత్య కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సిట్ నానా తిప్పలు పడింది. 1991 జూన్ 11న మొదటి అరెస్టు జరిగింది. 1991 నవంబర్ నాటికి నిందితుల వేటను ముగించింది. దొరికిన అన్ని డాక్యుమెంట్లు, వీడియో క్యాసెట్లు, ఫోటోలు, ఫైళ్లు అన్నింటినీ పరిశీలించి LTTE చీఫ్ ప్రభాకరన్ సహా 41 మందిని నిందితులుగా చూపుతూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 1998 జనవరి 28న నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమిళులు ఉండేవారు. ఈలమ్ పేరుతో వేరే దేశాన్ని ఏర్పాటు చేయాలనేది వీరి డిమాండ్. వీరికి తమిళ రాజకీయ పార్టీలు సహా తమిళుల అండ దండలు కూడా ఉండేవి. శ్రీలంక తమిళుల్లో.. కొందరు మితవాదులు, మరికొంతమంది అతివాదులు ఉండేవారు. సింహళీయ తమిళులకు ప్రభుత్వం కొన్ని హక్కులిచ్చి, ప్రజలకు రక్షణ కల్పించాలని మిత వాదులు భావిస్తే ఈలమ్ ఏర్పడి తీరాల్సిందేనని అతివాదులు చెప్పేవారు. ఈలం కోసం హింసా మార్గాలు అనుసరించినా తప్పులేదని భావించేవారు. ఈ క్రమంలోనే.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం LTTE పురుడుపోసుకుంది. 1954లో పుట్టిన వేలుపిళ్లై ప్రభాకరన్ 1976 మే 5న LTTEని ఏర్పాటు చేశాడు. తన 21వ ఏట.. జాఫ్నా మేయర్‌ను హత్య చేసి అలజడి సృష్టించిన ప్రభాకరన్.. తమిళ ఈలం ఏర్పాటు డిమాండ్‌తో లంకలో హింసాత్మక పద్దతులకు పాల్పడ్డాడు. శ్రీలంక నాయకులు కూడా తమిళుల ఓట్ల కోసం నానా రకాల ఎత్తులు వేశారు. ఆ ఆటలో నాటి భారత ప్రభుత్వం కూడా పాలు పంచుకుందనే ఆరోపణలున్నాయి. లంక సర్కార్‌ను ఇరుకునపెట్టడానికి ఇందిరాగాంధీ హయాంలో LTTEని ప్రోత్సహించారని చెబుతారు. టైగర్లకు ఆయుధాలు, నిధులు అందించారని అంటారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు DMK, అన్నాడీఎంకే సహా తమిళ పార్టీలన్నీ ఈ వ్యవహారంలో తలో చేయి వేశాయి. లంక సర్కార్‌పై పోరు ప్రకటించిన ప్రభాకరన్ 1983-86 మధ్య తమిళనాడులో తలదాచుకున్నాడు. ఆ సమయంలో తమిళనాడు సీఎం MGR కాగా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిర మరణం తర్వాత లంక విషయంలో భారత సర్కార్ వైఖరి మారింది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ టైగర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1986 నవంబర్‌లో తమిళ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపులు జరిపి LTTE ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రభాకరన్ నిరాహార దీక్ష చేపట్టాడు. అతనికి మద్ధతుగా DMK సహా తమిళ నేతలు ఆందోళనలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం టైగర్ల ఆయుధాలను తిరిగిచ్చేసింది. ఆ పరిణామం LTTE ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీలంకతో పాటు భారత్‌లోనూ LTTE పలు హింసాత్మక చర్యలకు పాల్పడింది. LTTE దాడులను అరికట్టడానికి రాజీవ్‌గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వంతో రాజీ పడాలంటూ.. ప్రభాకరన్‌కు రాజీవ్ సూచించారు. అవసరమైతే ఈ సంధి వ్యవహారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ, శ్రీలంక ప్రధాని జయవర్దనే మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారత్ నుంచి శాంతి పరిరక్షక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ బలగాలు.. LTTE మూకలను చీల్చి చెండాడాయి. ఇది LTTEకి ఊపిరిసలపనివ్వలేదు. 1991లో భారత్‌లో మళ్లీ ఎన్నికలొచ్చే సరికి LTTE భయపడిపోయింది. రాజీవ్‌గాంధీ మళ్లీ ప్రధాని ఐతే తమ ఆటలు సాగబోవని ఆందోళన చెందింది. రాజీవ్ ఉంటే తమకు ముప్పు తప్పదని భావించిన LTTE అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. రాజీవ్‌గాంధీని చంపాలని ప్రభాకరన్ నిర్ణయం తీసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. 1991 మార్చి ఐదో తేదీన జరిగిన ఓ మీటింగ్ ప్రభాకరన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 1991 మార్చి ఐదో తేదీన LTTE కేంద్ర కమిటీ సభ్యుడు కాశీ ఆనందన్.. శ్రీలంక సమస్య గురించి రాజీవ్‌గాంధీతో రహస్యంగా చర్చలు జరిపాడు. ఐతే కాశీ వచ్చింది రాజీవ్‌ను చంపడానికి. రాజీవ్‌ను ఢిల్లీలోనే హతమార్చే ప్లాన్‌తో LTTE.. కాశీని ఢిల్లీ పంపించింది. అయితే, రాజీవ్‌తో భేటీ తర్వాత కాశీ తన నిర్ణయం మార్చుకున్నాడు. లంక తమిళుల పట్ల రాజీవ్‌కు సానుభూతి ఉందని, అతనితో సత్సంబంధాలు పెట్టుకోవడం LTTEకి మంచిదంటూ ప్రభాకరన్‌కు కాశీ లేఖ రాశాడు. ఇది ప్రభాకరన్‌కు మంట పుట్టించింది. చంపి రమ్మని పంపితే హితోక్తులు చెబుతున్నాడంటూ రగిలిపోయిన ప్రభాకరన్.. అప్పుడే రాజీవ్ హత్యకు ప్రణాళిక రచించాడు. ఎంత పకడ్బంధీగా చేసినా నేరస్థులు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు. ఆ చిన్న పొరపాటే వారిని పోలీసులకు పట్టిస్తుంది. రాజీవ్ హత్య కేసులోనూ అదే జరిగింది. అత్యంత పకడ్బంధీ ప్లాన్‌తో రాజీవ్ హత్య చేశామని చంకలు గుద్దుకున్న LTTEకి కొన్ని రోజుల్లోనే షాక్ తగిలింది. రోజుల వ్యవధిలోనే టైగర్ల కుట్ర బయటపడింది. ఓ రసీదు.. ఓ కెమెరా.. నేరస్థుల ఆనవాళ్లను పట్టించాయి. ఆ దర్యాప్తు క్రమంలోనే రాజీవ్ హత్యకు LTTE ఎలా ప్లాన్ వేసిందో బయటపడింది. రాజీవ్‌ను హత్య చేసే పనిని ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పొట్టు అమ్మన్‌కు అప్పగించింది. అసలు పేరు షణ్ముగలింగం శివశంకర్. 1962లో పుట్టిన అమ్మన్ 1981లో LTTEలో చేరాడు. స్వల్ప కాలంలోనే LTTEలో కీలక నేతగా ఎదిగిన అమ్మన్‌కు ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో బాగా తెలుసంటారు. దాంతో.. ప్రభాకరన్‌కు అమ్మన్పై నమ్మకం ఎక్కువ. అందుకే రాజీవ్‌ను హతమార్చే పనిని అమ్మన్‌కు అప్పగించాడు. ఈ క్రమంలో రాజీవ్‌ను హత్య చేసే పథకం ఊపిరి పోసుకుంది. ప్రభాకరన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పొట్టు అమ్మన్.. 1991 ఏప్రిల్ 28న జాఫ్నాలోని మధకల్లో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే రాజీవ్ హత్యకు దాదాపు మూడు వారాల ముందు ఈ మీటింగ్ జరిగింది. శివరాజన్, ధాను, శుభ, రూసో, కీర్తి, శివరూపన్, విజయానందన్, నెహ్రూ, సుధేంద్రరాజా, అఖిల తదితరులు ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాజీవ్‌ను చంపకపోతే లంకలో తమిళులు శాంతంగా ఉండలేరని, రాజీవ్ బతికి ఉంటే తమకు ముప్పు తప్పదంటూ శివరాజన్, ధాను తదితరులకు నూరి పోశాడు. అలా రాజీవ్ హత్యకు హంతకముఠాను ప్రిపేర్ చేశాడు. శివరాజన్.. రాజీవ్ హంతక ముఠాకు లీడర్ ఇతనే. ఇతని అసలు పేరు భాగ్యచంద్రన్. రాజన్, దురై, అరవింద్, శివరాజ్ ఇలా చాలా మారు పేర్లే ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన శివరాజన్.. 1983లో అతివాద సంస్థలతో పరిచయం పెంచుకొని పేలుడు పదార్థాల తయారీలో గట్టి శిక్షణ తీసుకున్నాడు. 1984లో LTTEలో చేరాడు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణదళానికి సహకరిస్తున్న EPRLF నేత పద్మనాభన్‌ను హత్యచేసింది ఇతనే. దాంతో పొట్టుఅమ్మన్కు శివరాజన్పై గట్టి నమ్మకం ఏర్పడింది. పద్మనాభన్‌ను చంపిన ఏడాదికే.. రాజీవ్‌ను హతమార్చే బాధ్యతను శివరాజన్పై పెట్టాడు. ఆ బాధ్యతను తీసుకున్న శివరాజన్ ముందుగా తన జట్టును తయారు చేసుకున్నాడు. పద్మనాభన్ హత్యలో సహకరించిన సుధేంద్ర రాజాను తీసుకున్నాడు. ఇతనికి రాజా, శాంతన్ అనే మారు పేర్లు ఉన్నాయి. అతనితో పాటు శుభ అనే అమ్మాయి వచ్చింది. ఈమె LTTE షాడో బృందం సభ్యురాలు. ఇక మానవబాంబుగా ధాను ఎంపికైంది. 22 ఏళ్ల ధాను అసలు పేరు కళైవాణి. ముద్దు పేరు అన్బు. బట్టికలోవాలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె తండ్రి సూచనలతో LTTEలోని మహిళా విభాగం కరుంపులిలో చేరింది. ఇక రూసో, విజయానందన్లు హంతకముఠాతో చేయి కలిపారు. వీరితో పాటు మరో ముఖ్య వ్యక్తి శివ రూపన్. ఇతను పొట్టు అమ్మన్‌కు నమ్మకస్తుడైన వ్యక్తిగత వైర్లెస్ ఆపరేటర్. LTTEలో రహస్యాలు తెలిసిన అతి కీలక వ్యక్తుల్లో శివరూపన్ కూడా ఒకడు. ఇక ముఠాలో మరో ఇద్దరు సభ్యులు నెహ్రూ, తంబి అన్న. ఇలా హతమార్చడానికి శివరాజన్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ముఠా తయారైంది. శివరాసన్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలని ధాను, తదితరులకు పొట్టు అమ్మన్ స్పష్టంగా చెప్పాడు. దీంతో శివరాసన్ సూచనల ప్రకారం ఏప్రిల్ 30న హంతక ముఠా శ్రీలంకలోని మధకల్ నుంచి నాటు పడవలో బయల్దేరి మే ఒకటో తేదీన తమిళనాడులోని వేదారణ్యం దగ్గర కొడికరల్ తీరానికి చేరారు. స్మగ్లర్ షణ్ముగం వారిని సురక్షిత స్థావరాలకు తరలించాడు. LTTE రాజకీయ విభాగంలో పని చేస్తూ మద్రాస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాంతన్, డిక్సన్‌లు కూడా వారితో చేరిపోయారు. హంతకముఠా వేదారణ్యంలో అడుగుపెట్టేనాటికి LTTE మద్రాస్‌లో పూర్తి స్కెచ్‌తో రెడీ ఐంది. చెన్నైలో LTTE కార్యకలాపాలకు కేంద్రమైన శుభా న్యూస్ అండ్ ఫోటో ఏజెన్సీస్ యజమాని శుభా సుందరం అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. LTTE సిద్ధాంతవేత్తల్లో ముఖ్యుడైన బేబీ సుబ్రమణీయం అలియాస్ బాల సుబ్రమణ్యంతో పాటు శివరాజన్ సహాయకుడు మురుగన్‌లు కలిసి.. కుట్రదారులను తయారు చేశారు. ముత్తు రాజన్ తదితరులు వారికి సహరించారు. శుభా సుందరం, సుబ్రమణ్యం, మురుగన్‌లు కలిసి ఫోటో గ్రాఫర్ హరిబాబు, అరివు పెరారీ వాలన్, నళిని, ఆమె తమ్ముడు భాగ్యనాధన్లను తమ కుట్రలో పావులుగా చేసుకున్నారు. ధాను మానవబాంబు.. ఆమెకు స్టాండ్ బైగా మరో మానవబాంబు శుభ. ఐతే నళినితో ప్రేమలో పడిన మురుగన్.. ఆమెను కూడా మానవబాంబుగా మార్చాలని ప్రయత్నించాడు. అందుకు రంగం కూడా సిద్ధం చేశాడు. ఐతే స్టాండ్ బై మానవ బాంబుగా శుభ రావడంతో ప్లాన్ మార్చేశాడు. ఇక పెరారీ వాలన్ బెల్టు బాంబును తయారు చేశాడు. అలా రాజీవ్ హత్యకు రంగం సిద్ధమైంది. రాజీవ్‌ను హతమార్చాలని కంకణం కట్టుకున్న LTTE.. అందుకు రిహార్సల్స్ చేసుకుంది. ఏప్రిల్ 21న రాజీవ్‌గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో రిహార్సల్స్ జరిపి చూసుకున్నారు. ఆ తర్వాత మే 7న వీపీ సింగ్ సభలోనూ రిహార్సల్స్ చేసుకున్నారు. ఓ వీఐపీ వద్దకు వెళ్లి మానవబాంబు ప్రయోగించగలమో లేదో చెక్ చేసుకున్నారు. మే 7 నుంచి 20 వరకు హత్యకు సంబంధించి వివిధ రకాల పనులు పూర్తి చేసుకున్నారు. ఇక అనుకున్న రోజు రానే వచ్చింది. మే 20 తేదీ రాత్రి కుట్రదారులు ఎంజాయ్ చేశారు. 1991 మే 21.. జయకుమార్ ఇంట్లో శివరాజన్ రెడీ అయ్యాడు. మానవబాంబు ధాను, శుభాలతో కలసి నళిని ఇంటికి వెళ్లాడు. ఫోటోగ్రాఫర్ హరిబాబు పారిస్ కార్నర్‌కు వెళ్లి పూంపుహార్ అనే షో రూమ్‌లో ఒక చందనమాల కొన్నాడు. ధాను, శుభ, నళిని, హరిబాబు, మురుగన్‌లను తీసుకొని శివరాజన్ శ్రీ పెరంబుదూర్ బయల్దేరాడు. 21 సాయంత్రం ఏడున్నర గంటలకు.. హంతకముఠా శ్రీ పెరంబుదూర్ చేరింది. మే 20న ఒడిశాలో ప్రచారం చేసిన రాజీవ్ 21న ఉదయం ఒడిశాలోని భద్రక్, అంగుల్, పర్లాఖిమిడి, గుణపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించాడు. ధాను ధరించిన బెల్ట్బాంబుకు 2 స్విచ్‌లున్నాయి. ఒకటి సేఫ్టీ స్విచ్ కాగా మరొకటి బాంబ్‌ను పేల్చే స్విచ్. రాజీవ్‌కు పాదాభివందనం చేసే నెపంతో కిందికి వంగిన ధాను.. మొదట సేఫ్టీ స్విచ్ నొక్కి శివ రాజన్‌కు సైగ చేసింది. శివరాజన్ తప్పుకోగానే మరో మాట లేకుండా రెండో స్విచ్ నొక్కేసింది. అంతే 10.25 ప్రాంతంలో అక్కడ మారణహోమం జరిగిపోయింది. కన్నుమూసి కన్ను తెరిచేంతలో కనివినీ ఎరుగని దారుణ హత్య జరిగిపోయింది. హంతకముఠాకు లీడర్‌గా వ్యవహరించిన శివరాజన్ సూసైడ్ చేసుకున్నాడు. అతనికి సహకరించిన స్మగ్లర్ షణ్ముగం.. సిట్ విచారణ జరుగుతుండగానే విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడు. మిగత వాళ్లు పోలీసులకు దొరికిపోయారు. -
రాజీవ్ గాంధీ హత్యకు ఇంత ప్లాన్ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!
శ్రీ పెరంబుదూర్.. ప్రస్తుత చెన్నై ఒకప్పటి మద్రాస్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన ప్రాంతం ఇదే. ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలైన శ్రీమతి మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆమె తరఫున ప్రచారం చేయడానికి రాజీవ్‌గాంధీ ఒప్పుకున్నారు. దీంతో పెరంబుదూర్‌లోని ఒక మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు రాజీవ్ వచ్చేవరకు ప్రజలను ఉత్సాహపరిచేందుకు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే దారుణం తెలియని ప్రజలు రాజీవ్‌ను చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి RK రాఘవన్ సభాస్థలి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను చూస్తున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు రాఘవన్‌కు సంతృప్తి కలిగించలేదు. రాజీవ్ నడిచే ఎర్ర తివాచీకి ఇరు వైపులా కట్టిన బారికేడ్లు గట్టిగా లేవన్నారు. ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను మరకతం అసిస్టెంట్ AJ దాస్‌కు అప్పగించారు. రాజీవ్ వద్దకు ఎవరిని అనుమతించాలనే జాబితాను ఆయనే చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లతా కణ్నన్.. తన కూతురి కోకిలను ఆ లిస్ట్‌లో చేర్చాలంటూ దాస్‌పై ఒత్తిడి తెచ్చారు. లతా కణ్నన్ మరకతం కూతురు లతా ప్రియకుమార్ దగ్గర పని చేస్తుండేది. ఐతే లతా కణ్నన్ ఎంత బతిమాలినా దాస్ ఒప్పుకోలేదు. చివరకు లతా ప్రియాకుమార్ చెప్పడంతో రాజీవ్‌కు అభివాదం చేసే 24మందిలో కోకిలను చేర్చడానికి ఒప్పుకున్నాడు. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ వైజాగ్ నుంచి బయల్దేరడానికి రెడీ అవుతున్నారు. ఐతే విమానంలో లోపం ఏర్పడినట్లు కెప్టెన్ చందోక్ గుర్తించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడం లేదని కనుక్కున్నారు. స్వతహాగా పైలట్ ఐన రాజీవ్.. తాను కూడా ఓ చేయి వేసి లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇక ప్రయాణం లేదని అనుకుంటూ రాజీవ్ హోటల్‌కు వెళ్లిపోయారు. పరిస్థితి అలాగే ఉంటే రాజీవ్ బతికే ఉండే వారేమో కానీ కాసేపటికే ఫ్లైట్ రిపేర్ అయిందంటూ సమాచారం రావడంతో రాజీవ్ విమానం వద్దకు వచ్చేశారు. సాయంత్రం 6.30కి రాజీవ్ స్వయంగా ఫ్లైట్ నడుపుతూ రాత్రి 8.20 నిమిషాలకు మద్రాస్‌లోని మీనంబాకం ఎయిర్‌పోర్ట్‌కు చేరారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి, పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో కలసి రాజీవ్ బయల్దేరారు. న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు కారులో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దారిలో పోరూరు, పూనమల్లిల్లో ప్రసంగించారు. అలా పెరంబుదూర్ వైపు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరంబుదూర్ చేరుకున్నారు. రాజీవ్ రావడంతో సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. ముందుగా సభా స్థలి దగ్గర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసిన రాజీవ్ అక్కడి నుంచి సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వేదికవైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న రాజీవ్‌ను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీపడ్డారు. ఇదే సమయంలో లతా కణ్నన్ తన కూతురుతో సహా స్టేజి దగ్గరకు చేరింది. ఐతే ఊహించని విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి.. గంధపు దండ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చేసింది. స్థానిక ఫోటోగ్రాఫర్ హరిబాబుతో కలిసి వచ్చిన ఆ యువతి మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభలతో కలసి మహిళా విభాగంలో కూర్చుంది. లతా కణ్నన్, ఆ పక్కనే ఆమె కూతురు కోకిల, వారికి కాస్త దూరంగా విలేఖరిలా ఉన్న ఓ యువకుడు, అతనికి దగ్గర్లో ఫోటోగ్రాఫర్ హరిబాబు.. వారికి సమీపంలో గంధపు దండ చేతిలో పట్టుకున్న కళ్లద్దాల యువతి.. ఆమెకు కొద్ది దూరంలో మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభ. ఇదీ సభా స్థలి వద్ద పరిస్థితి. ఒక్కో క్షణం భారంగా గడుస్తోంది. రాజీవ్‌ను మింగేయడానికి మృత్యువు నెమ్మదిగా ముందుకొస్తోంది. ఇవేమీ తెలియని రాజీవ్... చకచకా నడుస్తున్నారు. ఆయన వెంట మరకతం చంద్రశేఖర్ కార్యకర్తలను అదుపు చేస్తూ పరుగులు పెడుతున్నారు. ఆ ఊపులోనే స్టేజి వద్దకు వచ్చిన రాజీవ్ అభిమానుల నుంచి అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తున్నారు. లత కణ్నన్ కూడా తన కూతురు కోకిలని పరిచయం చేసింది. ఇదే అదనుగా కోకిల వెనకాలే నిలుచున్న కళ్లద్దాల యువతి.. రాజీవ్ ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఐతే మహిళా SI అనసూయ ఆమెను ఆపేయడంతో ఆ యువతి నిరాశ చెందింది. కాలం కూడా ఒక్క క్షణం ఊపిరి తీసుకుంది. SI వద్దన్నప్పటికీ రాజీవ్ అంగీకరించడంతో కళ్లద్దాల యువతి రాజీవ్ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండని స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల వంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్జేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మకుపోయింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్‌ను మృత్యువు కాటేసింది. -
ఎట్టకేలకు నళిని విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?
Rajiv Gandhi Case Nalini Sriharan.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న వారు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలవుతున్నారు. దాదాపు 31 సంవత్సరాల జైలు జీవితం అనంతరం దోషిగా ఉన్న నళిని బయటకు వచ్చారు. ఇక, రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీవ్ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ అలియాస్ నళిని మురుగన్ వెల్లూర్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. కాగా, జైలు అధికారులు.. అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన తర్వాత నళినిని విడుదల చేశారు. ఇక, రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినితో పాటు రాబర్ట్ పయస్, రవిచంద్రన్, శ్రీహరన్, జయకుమార్, శంతనును కూడా విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నళిని, రవిచంద్రన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. మరోవైపు.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని, శ్రీహరన్ అలియాస్ మురుగన్, శంతను, ఏజీ పెరారివాళన్, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. గత మే 18న పెరారివాళన్ పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక, 1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మృతిచెందారు. #RajivGandhiAssassination | A day after the Supreme Court ordered the release of the six remaining convicts in the Rajiv Gandhi assassination case, #NaliniSriharan was released from Vellore jail on Saturday.https://t.co/3n7kxF5oZF pic.twitter.com/9z5h8jn9M8 — Express Chennai (@ie_chennai) November 12, 2022 -
రాజీవ్ హత్య కేసు: సుప్రీంకోర్టు తీర్పు మాకు అంగీకారం కాదు..
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మొత్తం ఆరుగురు దోషుల ముందస్తు విడుదలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో దోషిగా 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించిన ఎ.జి.పెరారివళన్ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గత మే 18న విడుదలవడం తెలిసిందే. మిగతా దోషులకూ అదే వర్తిస్తుందని న్యాయమూర్తులు బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘వారికి క్షమాభిక్ష పెట్టాలంటూ గతంలోనే తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీంతోపాటు దోషుల సత్ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం’’ అని తెలిపింది. దాంతో 30 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఎస్.నళిని, ఆమె భర్త వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, ఆర్.పి.రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పయస్, శంతన్‌కు విముక్తి లభించింది. శ్రీహరన్, శంతన్, రాబర్ట్, జయకుమార్ శ్రీలంక దేశస్తులు. నళిని, రవిచంద్రన్ ముందస్తు విడుదలకు పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సహ దోషి పెరారివాళన్ విడుదలను కోర్టు దృష్టికి తెచ్చారు. 2021 డిసెంబర్ 27 నుంచి వారిద్దరూ పెరోల్‌పై బయటే ఉన్నారు. మిగతా నలుగురు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం. మాకెంతమాత్రమూ అంగీకారం కాదు. కోర్టు సరైన స్ఫూర్తితో వ్యవహరించలేదు’’ అని పార్టీ నేతలు రణ్‌దీప్ సుర్జువాలా, అభిషేక్ సింఘ్వి, జైరాం రమేశ్ తదితరులన్నారు. సుప్రీం తీర్పుపై సమీక్ష కోరడమా, న్యాయపరంగా ఇతరత్రా చర్యలు చేపట్టడమా యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు విన్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ప్రధానిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల విడుదలను సమర్థిస్తారో, లేక తీర్పుపై సమీక్ష కోరతారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దోషులను సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ క్షమించి ఉండవచ్చు. అది వారి గొప్పదనం. కానీ పార్టీగా వారి నిర్ణయాన్ని మాత్రం కాంగ్రెస్ సమర్థించబోదు. ఈ విషయంలో పార్టీ వైఖరి ముందునుంచి ఒకేలా ఉంది’’ అని చెప్పారు. తమిళనాట మాత్రం కాంగ్రెస్ భాగస్వామ్య పక్షమైన అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే దోషుల విడుదలను స్వాగతించాయి. ఇది చరిత్రాత్మక తీర్పని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అన్నారు. నళిని తల్లి హర్షం సుప్రీం తీర్పు పట్ల నళిని తల్లి ఎస్.పద్మ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ‘‘అంతులేని ఆనందమిది. నళిని, మేమంతా ఇంతకాలం అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు’’ అన్నారు. పెరోల్‌పై బయట ఉన్నందున తీర్పుపై స్పందించేందుకు నళిని నిరాకరించింది. ఆమె కూతురు ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. ఆ రోజు ఏం జరిగింది...? 1991 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21న రాజీవ్‌గాంధీ తమిళనాడులో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో రాత్రి వేళ సభలో పాల్గొన్నారు. రాత్రి 10:10 సమయంలో శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన తెన్మొళి రాజారత్నం అలియాస్ థాను అనే ఎల్టీటీఈ మహిళా ఆత్మాహుతి దళ సభ్యురాలు ఆర్డీఎక్స్తో కూడిన బెల్టు బాంబు పెట్టుకుని రాజీవ్‌ను సమీపించింది. ఆయనకు పూలమాల వేసింది. కాళ్లకు మొక్కేందుకన్నట్టుగా కిందకు వంగింది. ఆమెను పైకి లేపేందుకు రాజీవ్ కాస్త ముందుకు వంగుతూనే తనను తాను పేల్చేసుకుంది. దాంతో రాజీవ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది కూడా మరణించారు. ఎల్టీటీఈని అడ్డుకునేందుకు శ్రీలంక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు శాంతి పరిరక్షణ దళం పేరిట అక్కడికి భారత సైన్యాన్ని పంపుతూ ప్రధానిగా రాజీవ్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహించి సంస్థ అధిపతి వేలుపిళ్లై ప్రభాకరన్ ఈ దురాగతానికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. విచారణలో మలుపులు 1991 మే 21: రాజీవ్ హత్య. ఈ కేసులో ఏడుగురి అరెస్టు. నళిని ఆ సమయంలో గర్భవతి. జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 1991 జూన్ 11: పెరారివాళన్‌ను అరెస్టు చేసిన సిట్. టాడా చట్టం కింద కేసు. 1991: బెంగళూరులో పేలుడు సూత్రధారి శివరాసన్ తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. దాంతో మరో ఆరుగురితో కలిసి శివరామన్ ఆత్మహత్య. 1992: రాజీవ్ హత్యలో ఎల్టీటీఈ పాత్ర ఉందని తేల్చిన సిట్. 1990లోనే జాఫ్నా అడవుల్లో ఇందుకు ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పథక రచన చేసినట్టు వెల్లడి. 1998: మురుగన్, సంథాను, పెరారివళన్, నళిని సహా మొత్తం 26 దోషులకు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 1999: నలుగురు నిందితుల అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మురుగన్, శంతను, పెరారివాళన్, నళినిలకు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. ముగ్గురికి జీవితకాల శిక్ష విధిస్తూ మిగతా 19 మందిని వదిలేసింది. నళిని, మురుగన్, శంతను, పెరారివాళన్ క్షమాభిక్ష అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. 2001: శంతను, మురుగన్, పెరారివాళన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు. ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్ హైకోర్టు సెప్టెంబర్ 9న స్టే విధించింది. దాన్ని జీవితకాల శిక్షకు తగ్గించాలన్న తీర్మానానికి నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆమోదం తెలిపారు. 2011: రాజీవ్‌ను హత్య చేసినందుకు భారత్‌కు ఎల్టీటీఈ క్షమాపణ. 2014: రాజీవ్ భార్య సోనియా గాంధీ అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షగా తగ్గించిన సుప్రీంకోర్టు. 2018: మొత్తం ఏడుగురు నిందితులనూ విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ సిఫార్సు. 2019: నళినికి తొలిసారి పెరోల్. 2021: నళిని, రవిచంద్రన్‌లకు పెరోల్. 2022: సుప్రీంకోర్ట్ తీర్పుతో మే 18న పెరారివాళన్ జైలు నుంచి విడుదలయ్యాడు. 2022 సెప్టెంబర్: నళిని, రవిచంద్రన్ విడుదలకు సుప్రీంకోర్ట్ ఆదేశం. నవంబర్ 2022: మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్ తీర్పు. -
ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని
సాక్షి, చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని ఎట్టకేలకు పెరోల్‌పై గురువారం జైలు నుంచి విడుదలైంది. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పెరోల్ కావాలని మద్రాస్ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే నళినికి ఆరు నెలలు ఇవ్వలేమనీ, ఇతర సాధారణ ఖైదీల్లాగే 30 రోజుల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన నళినినీ తీసుకువెళ్లేందుకు ఆమె తల్లి వచ్చింది. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ తన కుమార్తె విషయంలో తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించలేకపోయానని, అంతేకాకుండా తండ్రి చనిపోయిన తర్వాత కూడా కుమార్తెగా కుటుంబానికి ఏమీ చేయలేకపోయాని, పెరోల్ లభించిన సందర్భంగా కుటుంబాన్ని కలవడంతో పాటు కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించనున్నట్లు నళిని తెలిపింది. కాగా రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్ నారాయణన్ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. -
నా బిడ్డ పెళ్లికి వెళ్లనివ్వండి ప్లీజ్
దేశంలోనే దీర్ఘకాలంగా.. 28 ఏళ్లుగా.. జైల్లో ఉన్న మహిళా ఖైదీ నళిని ప్రస్తుతం కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెయిల్ ఇమ్మని అడుగుతోంది. కోర్టు ఆమె అభ్యర్థనపై విచారణను జూన్‌కి వాయిదా వెయ్యడంతో ఆమె ఇంకో రెండు నెలల పాటు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే నళిని పూర్తిగా విడుదల అయ్యేదెప్పుడు? రాజీవ్‌గాంధీ హత్య కేసులో పాతికేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కానీ రెండేళ్ల క్రితం ఆమె ఆత్మకథ మాత్రం విడుదలైంది. 500 పేజీల ఆ తమిళ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రచురణకర్తలు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఎదురు కావచ్చని మొదట అంతా అనుకున్నప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. పుస్తకాన్ని ఎండిఎంకె నేత వైకో ఆవిష్కరించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి హరిపరంథామన్ తొలి ప్రతిని అందుకున్నారు. నళిని జైల్లో ఉండడంతో ఆమె లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది.‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే అర్థం వచ్చే టైటిల్ ఉన్న ఈ తమిళ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత రాశారు.1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పటికి సరిగ్గా నెల ముందు ఎల్.టి.టి.ఇ. (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) తీవ్రవాది శ్రీహరన్ (మురుగన్)తో నళిని వివాహం అయింది. రాజీవ్ హత్యోదంతంలో అరెస్ట్ అయ్యేనాటికే నళిని గర్భవతి. విచారణ ఖైదీగా ఆమెను వెల్లూరులోని మహిళా జైల్లో ఉంచారు. ఇవాళ్టికే ఆమె ఆ జైల్లోనే ఉన్నారు.నళిని ఆత్మకథలో ఆమె బాల్యం, శ్రీహరన్‌తో ఆమె ప్రేమబంధం, రాజీవ్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షిగా ఆమె పరారీలో ఉండడం, అరెస్ట్ అవడం, కస్టడీలోకి వెళ్లడం, అక్కడ చిత్రహింసలకు గురికావడం, జైల్లోనే బిడ్డను ప్రసవించడం, దోషిగా నిర్ధారణ అవడం, జైలు శిక్షను అనుభవించడం వంటివన్నీ ఉన్నాయి. చివరిగా.. 2008 మార్చి 19న రాజీవ్ కుమార్తె ప్రియాంక, నళిని రహస్యంగా జైల్లో కలుసుకుని, ‘‘మీరు మా నాన్నను ఎందుకు చంపారు?! ఆయన ఎంతో మంచివారు కదా!’’ అని ఉద్వేగంగా అడగడం, ఆ తర్వాత 90 నిమిషాల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా.. నళిని ఆత్మకథలో ఉన్నాయి. పేరు పెట్టింది గాంధీజీ! నళిని తల్లి పద్మావతి. ఆమెకు పద్మావతి అని పెట్టింది మహాత్మాగాంధీ అని అంటారు. పద్మావతి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అనూహ్యంగా వారి జీవితాల్లోకి వచ్చాడు. అద్దె ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వారి పక్కనే చేరాడు. కొన్నాళ్లకు ‘ఒంటికన్ను’ శివరాసన్.. శ్రీహరన్ రూమ్మేట్ అయ్యాడు. కొద్ది రోజుల్లోనే వాళ్లతో ‘థను’ వచ్చి చేరింది. (రాజీవ్‌గాంధీని చంపడానికి మానవబాంబుగా మారింది ఈ ‘థను’నే). ఈ క్రమంలో శ్రీహరన్, నళిని ప్రేమలో పడ్డారు. రాజీవ్ హత్య తర్వాత నిందితులందరితో పాటూ ఈ దంపతులూ అరెస్ట్ అయ్యారు. ‘‘రక్తాన్ని దాహంగొన్న తేడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’అని హత్య తర్వాత నళిని కోర్టులో తన వాదన వినిపించారు. అయినా శిక్ష తప్పలేదు. తర్వాత్తర్వాత సోనియా గాంధీ క్షమాభిక్షతో ఉరిశిక్షను తప్పించుకుని, యావజ్జీవ శిక్షను అమె అనుభవిస్తున్నారు.నళిని చెన్నైలో పుట్టారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించేనాటికి ఆమె ఒక ప్రేవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. అంత పెద్ద ఆత్మకథను రాసుకున్న నళిని ఇప్పటికీ ఒక ప్రశ్న వేధిస్తోంది. ఆ రోజు ప్రియాంక పనిగట్టుకుని తననెందుకు కలిశారో ఆమె అంతుబట్టడం లేదట! ఈ అనుమానాన్ని కూడా ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారు. నళిని కూతురు హరిత ప్రస్తుతం యు.కె.లోని ఓ యూనివర్శిటీలో చదువుతోందన్నంత వరకే ప్రపంచానికి తెలుసు. నాలుగేళ్ల క్రితం హరిత జీమెయిల్ చాట్‌లో ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ.. తన తల్లిని, తండ్రిని విడిపించమనీ, జైలు జీవితం నుంచి వారికి విముక్తి కల్పించమని రాజీవ్ కుటుంబాన్ని, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.ఆమె అభ్యర్థకు ఇంతవరకు మన్నింపు దొరకలేదు. నళిని ఎప్పటికి విడుదలవుతుందో తెలియదు!లండన్‌లో ఉంటున్న తన కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలలు బెయిలు మంజూరు చెయ్యాలని ఇటీవల నళిని తన లాయర్ ద్వారా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ కేసును జూన్ 11కు వాయిదా వేస్తూ, ఈలోపు అత్యవసరం అయితే నళిని ‘వేసవి సెలవుల కోర్టులో’ తన వాదనను వినిపించుకోవచ్చని సూచించింది. నళిని కూతురు హరిత అలియాస్ మెగ్రా లండన్‌లోని అమ్మమ్మగారి ఇంట్లో ఉంటోంది. -
‘అమాయకులం.. ఇక శాశ్వత సెలవు తీసుకుంటా’
సాక్షి, చెన్నై : తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితులు నళిని, ఆమె భర్త మురుగన్ జైలులోనే నిరాహార దీక్ష చేయడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గత 12 రోజులుగా దీక్ష చేస్తుండగా, గత శనివారం నళిని ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. తమతో పాటు ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేసేంత వరకు దీక్ష విరమించబోమని పేర్కొన్నారు. నళిని తరఫు న్యాయవాది ద్వారా ఈ విషయం బయటికి పొక్కడంతో తమిళ సంఘాలు, పార్టీల్లో కలకలం రేగుతోంది. మురుగన్ ఆరోగ్య పరిస్థితి విషమించడం, నళిని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో తమిళవాదుల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే నేపథ్యంలో ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలపై దృష్టి సారించింది. ఇక ఈ విషయమై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌కు లేఖ తమని విడుదల చేయాలి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ నళిని పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు నళిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ‘ న్యాయం కోసం అర్థిస్తున్న మాకు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. 28 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం. మేము అమాయకులం. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ కేసులో ఇరుక్కున్నాం. ఇక ఇప్పుడు నేను ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 9 నుంచి నిరాహార దీక్ష చేపడతున్నాను. ఇలానైనా నాకు విముక్తి లభిస్తుంది’ అని నళిని లేఖలో పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టడం సబబు కాదు. కానీ నళిని విషయంలో ఇది సమర్థనీయం. రాజీవ్ హత్య కేసులో వారిని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్ చేస్తున్న జాప్యానికి వ్యతిరేకంగానే ఆమె దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆయన ఇందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ వీరిని గనుక విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. రాజీవ్ హత్యకేసు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు. మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. జయకుమార్, రాబర్ట్ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది. -
రాహుల్ గాంధీకి ధన్యవాదాలు: నళిని
చెన్నై : ‘రాహుల్ గాంధీకి చాలా చాలా ధన్యవాదాలు. ఆయన హృదయం చాలా విశాలమైనది. అందువల్లనే తన తండ్రిని హత్య చేసిన మమ్మల్ని క్షమించారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్. ‘తమ తండ్రిని హత్య చేసిన వారి పట్ల తమకు కోపం లేదంటూ.. వారిని క్షమించానని’ రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో నళిని శ్రీహరన్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం గురించి ఆమె ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో ఉత్తరాల ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘ఇప్పటికే నా జీవితంలో చాలా కష్టాలను భరించాను. ఇక మిగిలిన ఈ జీవితాన్ని నా కుమార్తెతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఇప్పుడు నా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను నా తండ్రి, కూతురితో కలిసి ప్రశాంత జీవనం గడపాలనుకుంటున్నాను’ అని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం తన పట్ల దయగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడైన ఏ జీ పెరరివాలన్ చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ని పరిగణలోకి తీసుకోవాలంటూ అప్పటి తమిళనాడు సీఎం జయలలిత.. కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడుగురిని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేంద్రం అంగీకారం లేకుండా రాష్ట్రాలు ఖైదీలను విడుదల చేయడం కుదరదని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక రాజీవ్ హత్య కేసులో నిందితులను విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. వీరితో పాటు ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర సుప్రీం కోర్టుకు విన్నవించింది. కానీ నళిని మాత్రం కేంద్ర ప్రభుత్వం తన పట్ల ఔదార్యం చూపిస్తుందని.. తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తుందని నమ్మకంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వెల్లూరులో శిక్ష అనుభవిస్తున్న నళిని ప్రపంచంలోనే అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన మహిళా ఖైదీగా గుర్తింపు పొందింది. -
రాజీవ్ హంతకుల విడుదలకు నో
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ వీరిని విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ జస్టిస్ గొగోయ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి సమర్పించింది. మాజీ ప్రధానితో పాటు 15 మంది అధికారుల్ని పొట్టనపెట్టుకున్న విదేశీయుల్ని విడుదల చేస్తే చాలా ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి వీబీ దూబే కోర్టుకు సమర్పించిన పత్రంలో తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరస్తుల విడుదలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రాజీవ్ హంతకులపై ఎలాంటి జాలి చూపించాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు. మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. జయకుమార్, రాబర్ట్ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఈ ఏడుగురికి విధించిన శిక్షల్ని రద్దుచేసి విడుదల చేయాలంటూ అదే ఏడాది కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంతో ఏడుగురు ఉగ్రవాదుల్ని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం కేంద్రం అంగీకారం లేకుండా ఖైదీలను రాష్ట్రాలు విడుదల చేయడం కుదరదని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాన్ని సవరించేదాక ఆగం దేశంలో ఆందోళనలు, ధర్నాలు, బంద్‌ల సందర్భంగా అల్లరిమూకలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. ఇలాంటి ఘటనల్ని నిరోధించేందుకు కేంద్రం చట్టాన్ని సవరించేంతవరకూ తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చట్ట సవరణ విషయంలో ప్రభుత్వానికి తాము మార్గదర్శకాలు జారీచేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఎక్కడైనా అల్లర్లు, ఆస్తుల విధ్వంసం జరిగితే సంబంధిత జిల్లా సూపరింటెండెంట్(ఎస్పీ)లను బాధ్యులుగా చేయాలని న్యాయస్థానానికి సూచించారు. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలకు అధికారుల్ని బాధ్యులుగా చేయగానే అలాంటి అక్రమ కట్టడాలు నిలిచిపోయాయని తెలిపారు. ► ఆరుషీ తల్వార్, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో తల్వార్ దంపతుల్ని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. ► వచ్చే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్ యంత్రాలను తనిఖీలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సుప్రీంను ఆశ్రయించారు. ► లైంగిక దాడి, అత్యాచారాలకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌పై ఉన్న నిబంధనల్ని సమీక్షిస్తామని సుప్రీం తెలిపింది. మీడియాలో బాధిత మహిళలు, చిన్నారుల పేర్లు, ఫొటోల ప్రసారాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. వసతి గృహాల్లో రేప్‌లు ఎప్పుడు ఆగుతాయి? దేశంలోని అనాథాశ్రమాలు, వసతి గృహాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగికదాడులు ఎప్పుడు ఆగుతాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యూపీ, బిహార్‌లోని వసతి గృహాల్లో మహిళలు, మైనర్ బాలికలపై రేప్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. అనాథాశ్రమాల్లో లైంగికదాడులపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. యూపీలోని పాల్గఢ్, ప్రతాప్‌గఢ్ బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతి గృహాల్లో మహిళలు, మైనర్ బాలికపై జరిగిన దారుణాలపై కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమికస్ క్యూరీగా పనిచేస్తున్న న్యాయవాది అపర్ణా భట్ స్పందిస్తూ.. దేశంలోని చిన్నారుల సంరక్షణా కేంద్రాలు(సీసీఐ)తో పాటు సోషల్ ఆడిట్ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుందని విన్నవించారు. అనంతరం కేంద్రం, హోంశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ న్యాయవాదులు కోర్టు ముందు హాజరుకాగా, ఇంతమంది ఎందుకొచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం స్త్రీ, శిశుసంక్షేమ శాఖ న్యాయవాది హాజరైతే సరిపోతుందని∙వ్యాఖ్యానించింది. -
రాజీవ్ హంతకులను విడుదల చేయం
-
రాజీవ్ హంతకులను విడుదల చేయం : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. హంతుకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం తరుఫున అఫడవిట్ దాఖలు చేయాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్రం రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని శుక్రవారం న్యాయస్థానానికి తెలిపింది. కాగా మాజీ ప్రధాని హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నళిని రాజ్యాంగంలోని 161 అధికరణ ప్రకారం గవర్నర్ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా రాజీవ్ హంతుకులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 2016లో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిది వారిని విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1991 మే 21న ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. 27 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నందున క్షమాభిక్ష కింద వారిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. -
రాజీవ్ హత్య కేసు: నళినీ పిటిషన్ తిరస్కరణ
చెన్నై: మాజీ ప్రధాని రాజీమ్ గాంధీ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న నళిని తన ముందస్తు విడుదల కోరుతు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 గవర్నర్ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని నళిని పిటిషన్లో పేర్కొంది. ఆమె అభ్యర్ధనను స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శశిధరన్, ఆర్. సుబ్రహ్మణ్యన్‌ల బెంచ్ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. రాజీవ్ గాంధీ హత్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, నళిని ఎలాంటి పిటిషన్ దాఖలు చేసిన స్వీకరించవద్దని 2017 నవంబర్‌లో తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును కోరింది. నళిని దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయమూర్తి రాజీవ్ శక్దేర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 1991 మే 21న ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాగా ఇటీవల రాజీవ్‌గాంధీ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సింగపూర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘ నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించ్చేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం.’అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
హంతకురాలి ఆత్మకథ
-
నళినికి ఒక రోజు పెరోల్
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషి నళిని శ్రీహరణ్‌కు పెరోల్ మంజూరైంది. 24గంటలపాటు ఆమె జైలు బయట ఉండేందుకు కోర్టు అనుమతించింది. తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మద్రాస్ కోర్టు ఆమెకు ఈ అవకాశం కల్పించింది. గత నెలలో చెన్నైలో ఆమె తండ్రి చనిపోవడంతో 12గంటల ఎమర్జెన్సీ పెరోల్‌పై ఆమెను విడుదల చేశారు. కాగా, అంత్యక్రియల అనంతర కార్యక్రమాలకు మరోసారి హాజరయ్యేందుకు మూడు రోజులపాటు అనుమతించేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆమె మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆమెను గత 24 సంవత్సరాలుగా వెల్లోర్లోని ప్రత్యేక సెల్ లో ఉంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 24 సంవత్సరాలుగా జైలులో ఉంటున్న తనను సత్ప్రవర్తన కింద పరిగణించి విడిచిపెట్టాలని కూడా ఆమె గత డిసెంబర్లో కోర్టుకు వెళ్లారు. -
రాజీవ్ హత్య కేసులో నిందితురాలికి పెరోల్
నళినికి 12 గంటల పెరోల్- తండ్రి అంత్యక్రియలకు హాజరు తాను నిర్దోషినని పునరుద్ఘాటన చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్‌కు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం 12 గంటల పెరోల్ మంజూరైంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇచ్చిన పెరోల్‌పై ఆమె వేలూరు జైలు నుంచి చెన్నైకి చేరుకుని తండ్రి శంకర నారాయణ్(91) అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత మళ్లీ జైలు వెళ్లారు. తాను నిర్దోషిని అని, రాజీవ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెన్నైలో మీడియాతో అన్నారు. ఈ కేసులో తనతోపాటు శిక్ష అనుభవిస్తున్న మిగతావారి విడుదల కోసం తమిళనాడు సీఎం జయలలిత చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు తన విడుదలకు సహకరించాలని కోరారు. 2004లో తన సోదరి పెళ్లికి పెరోల్‌పై విడుదలైన నళిని ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడడం ఇదే తొలిసారి. రాజీవ్ హత్య కేసులో ఆమెకు 1998లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించగా, 2000లో నాటి తమిళనాడు గవర్నర్ ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. తాను 24ఏళ్లకు పైగా జైల్లో ఉన్నాను కనుక ముందస్తుగా విడుదల చేయాలని ఆమె గత ఏడాది మద్రాస్ హైకోర్టును కోరారు.