దేశంలోనే దీర్ఘకాలంగా.. 28 ఏళ్లుగా.. జైల్లో ఉన్న మహిళా ఖైదీ నళిని ప్రస్తుతం కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెయిల్ ఇమ్మని అడుగుతోంది. కోర్టు ఆమె అభ్యర్థనపై విచారణను జూన్‌కి వాయిదా వెయ్యడంతో ఆమె ఇంకో రెండు నెలల పాటు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే నళిని పూర్తిగా విడుదల అయ్యేదెప్పుడు?
రాజీవ్‌గాంధీ హత్య కేసులో పాతికేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కానీ రెండేళ్ల క్రితం ఆమె ఆత్మకథ మాత్రం విడుదలైంది. 500 పేజీల ఆ తమిళ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రచురణకర్తలు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఎదురు కావచ్చని మొదట అంతా అనుకున్నప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. పుస్తకాన్ని ఎండిఎంకె నేత వైకో ఆవిష్కరించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి హరిపరంథామన్ తొలి ప్రతిని అందుకున్నారు. నళిని జైల్లో ఉండడంతో ఆమె లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది.‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే అర్థం వచ్చే టైటిల్ ఉన్న ఈ తమిళ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత రాశారు.1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పటికి సరిగ్గా నెల ముందు ఎల్.టి.టి.ఇ. (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) తీవ్రవాది శ్రీహరన్ (మురుగన్)తో నళిని వివాహం అయింది.
రాజీవ్ హత్యోదంతంలో అరెస్ట్ అయ్యేనాటికే నళిని గర్భవతి. విచారణ ఖైదీగా ఆమెను వెల్లూరులోని మహిళా జైల్లో ఉంచారు. ఇవాళ్టికే ఆమె ఆ జైల్లోనే ఉన్నారు.నళిని ఆత్మకథలో ఆమె బాల్యం, శ్రీహరన్‌తో ఆమె ప్రేమబంధం, రాజీవ్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షిగా ఆమె పరారీలో ఉండడం, అరెస్ట్ అవడం, కస్టడీలోకి వెళ్లడం, అక్కడ చిత్రహింసలకు గురికావడం, జైల్లోనే బిడ్డను ప్రసవించడం, దోషిగా నిర్ధారణ అవడం, జైలు శిక్షను అనుభవించడం వంటివన్నీ ఉన్నాయి. చివరిగా.. 2008 మార్చి 19న రాజీవ్ కుమార్తె ప్రియాంక, నళిని రహస్యంగా జైల్లో కలుసుకుని, ‘‘మీరు మా నాన్నను ఎందుకు చంపారు?! ఆయన ఎంతో మంచివారు కదా!’’ అని ఉద్వేగంగా అడగడం, ఆ తర్వాత 90 నిమిషాల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా.. నళిని ఆత్మకథలో ఉన్నాయి.
పేరు పెట్టింది గాంధీజీ!
నళిని తల్లి పద్మావతి. ఆమెకు పద్మావతి అని పెట్టింది మహాత్మాగాంధీ అని అంటారు. పద్మావతి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అనూహ్యంగా వారి జీవితాల్లోకి వచ్చాడు. అద్దె ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వారి పక్కనే చేరాడు. కొన్నాళ్లకు ‘ఒంటికన్ను’ శివరాసన్.. శ్రీహరన్ రూమ్‌మేట్ అయ్యాడు. కొద్ది రోజుల్లోనే వాళ్లతో ‘థను’ వచ్చి చేరింది. (రాజీవ్‌గాంధీని చంపడానికి మానవబాంబుగా మారింది ఈ ‘థను’నే). ఈ క్రమంలో శ్రీహరన్, నళిని ప్రేమలో పడ్డారు. రాజీవ్ హత్య తర్వాత నిందితులందరితో పాటూ ఈ దంపతులూ అరెస్ట్ అయ్యారు. ‘‘రక్తాన్ని దాహంగొన్న తేడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’అని హత్య తర్వాత నళిని కోర్టులో తన వాదన వినిపించారు. అయినా శిక్ష తప్పలేదు.
తర్వాత్తర్వాత సోనియా గాంధీ క్షమాభిక్షతో ఉరిశిక్షను తప్పించుకుని, యావజ్జీవ శిక్షను అమె అనుభవిస్తున్నారు.నళిని చెన్నైలో పుట్టారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించేనాటికి ఆమె ఒక ప్రేవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. అంత పెద్ద ఆత్మకథను రాసుకున్న నళిని ఇప్పటికీ ఒక ప్రశ్న వేధిస్తోంది. ఆ రోజు ప్రియాంక పనిగట్టుకుని తననెందుకు కలిశారో ఆమె అంతుబట్టడం లేదట! ఈ అనుమానాన్ని కూడా ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారు. నళిని కూతురు హరిత ప్రస్తుతం యు.కె.లోని ఓ యూనివర్శిటీలో చదువుతోందన్నంత వరకే ప్రపంచానికి తెలుసు.
నాలుగేళ్ల క్రితం హరిత జీమెయిల్ చాట్‌లో ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ.. తన తల్లిని, తండ్రిని విడిపించమనీ, జైలు జీవితం నుంచి వారికి విముక్తి కల్పించమని రాజీవ్ కుటుంబాన్ని, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.ఆమె అభ్యర్థకు ఇంతవరకు మన్నింపు దొరకలేదు. నళిని ఎప్పటికి విడుదలవుతుందో తెలియదు!లండన్‌లో ఉంటున్న తన కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలలు బెయిలు మంజూరు చెయ్యాలని ఇటీవల నళిని తన లాయర్ ద్వారా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ కేసును జూన్ 11కు వాయిదా వేస్తూ, ఈలోపు అత్యవసరం అయితే నళిని ‘వేసవి సెలవుల కోర్టులో’ తన వాదనను వినిపించుకోవచ్చని సూచించింది. నళిని కూతురు హరిత అలియాస్ మెగ్రా లండన్‌లోని అమ్మమ్మగారి ఇంట్లో ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment