Congress Party Will Approach Supreme Court On Rajiv Gandhi Killers Release - Sakshi
Sakshi News home page

కేంద్రం బాటలో సుప్రీంకు కాంగ్రెస్‌!.. లేట్‌ రియాక్షన్‌పై చర్చ

Published Mon, Nov 21 2022 3:37 PM | Last Updated on Mon, Nov 21 2022 4:21 PM

Congress Party Will Approach SC On Rajiv Gandhi Killers Release - Sakshi

న్యూఢిల్లీ: రాజీవ్‌ దోషుల విడుదలను భావోద్వేగ రాజకీయ సమస్యగా మల్చుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయా?. మాజీ ప్రధాని హత్య కేసులో నిందితుల ముందస్తు విడుదలను పునపరిశీలించాంటూ.. కేంద్రం ఇదివరకే సుప్రీం కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఇప్పుడు.. 

సుప్రీం ఆదేశాలు వెలువడిన పదిరోజుల తర్వాత.. రాజీవ్‌ సొంత పార్టీ కాంగ్రెస్‌ కూడా రివ్యూ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో కేంద్రం ఓ అడుగు ముందు ఉండడంపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా విమర్శలు చెలరేగినట్లు సమాచారం. దీంతో ఈ వారంలోనే సుప్రీం ఆదేశాలను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ధృవీకరించింది కూడా. 

దోషులను రాజీవ్‌ కుటుంబం క్షమించినా.. తాము క్షమించే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ నేతలు మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం ఆదేశాలు వెలువడిన వెంటనే స్పందించిన కాంగ్రెస్‌ కీలక నేతలు.. ప్రెస్‌మీట్‌ నిర్వహించి మరీ విడుదల ఆదేశాలను దురదృష్టకరమని పేర్కొన్నారు. అంతేకాదు.. న్యాయస్థానం ఆదేశాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో కేంద్రం ముందుగా స్పందించి.. విడుదల ఆదేశాలపై సుప్రీంకు వెళ్లింది. గత శుక్రవారం కేంద్రం దోషుల విడుదల ఆదేశాలను పునపరిశీలించాలని ఒక పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇక ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించబోతోంది కాంగ్రెస్‌. నవంబర్‌ 11వ తేదీన రాజీవ్‌ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న  మిలిగిన ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళిని శ్రీహారన్‌, ఆర్‌పీ రవింద్రన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది.

రాజీవ్‌ హత్య కేసు టైం లైన్‌

1991 మే 21: రాజీవ్‌ హత్య. ఈ కేసులో ఏడుగురి అరెస్టు. నళిని ఆ సమయంలో గర్భవతి. జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
1991 జూన్‌ 11: పెరారివాళన్‌ను అరెస్టు చేసిన సిట్‌. టాడా చట్టం కింద కేసు.
1991: బెంగళూరులో పేలుడు సూత్రధారి శివరాసన్‌ తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. దాంతో మరో ఆరుగురితో కలిసి శివరామన్‌ ఆత్మహత్య. 
1992: రాజీవ్‌ హత్యలో ఎల్టీటీఈ పాత్ర ఉందని తేల్చిన సిట్‌. 1990లోనే జాఫ్నా అడవుల్లో ఇందుకు ఎల్టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ పథక రచన చేసినట్టు వెల్లడి.
1998: మురుగన్, సంథాను, పెరారివళన్, నళిని సహా మొత్తం 26 దోషులకు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 
1999: నలుగురు నిందితుల అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మురుగన్, శంతను, పెరారివాళన్, నళినిలకు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. ముగ్గురికి జీవితకాల శిక్ష విధిస్తూ మిగతా 19 మందిని వదిలేసింది.  నళిని, మురుగన్, శంతను, పెరారివాళన్‌ క్షమాభిక్ష అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం 
తోసిపుచ్చింది. 
2001: శంతను, మురుగన్, పెరారివాళన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ తిరస్కరించారు. ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్‌ హైకోర్టు సెప్టెంబర్‌ 9న స్టే విధించింది. దాన్ని జీవితకాల శిక్షకు తగ్గించాలన్న తీర్మానానికి నాటి తమిళనాడు సీఎం జయలలిత ఆమోదం తెలిపారు. 
2011: రాజీవ్‌ను హత్య చేసినందుకు భారత్‌కు ఎల్టీటీఈ క్షమాపణ. 
2014: రాజీవ్‌ భార్య సోనియా గాంధీ అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షగా తగ్గించిన సుప్రీంకోర్టు. 
2018: మొత్తం ఏడుగురు నిందితులనూ విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్‌ సిఫార్సు. 
2019: నళినికి తొలిసారి పెరోల్‌.
2021: నళిని, రవిచంద్రన్‌లకు పెరోల్‌. 
2022: సుప్రీంకోర్ట్‌ తీర్పుతో మే 18న పెరారివాళన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. 
2022 సెప్టెంబర్‌: నళిని, రవిచంద్రన్‌ విడుదలకు సుప్రీంకోర్ట్‌ ఆదేశం. 
నవంబర్‌ 2022: మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్‌ తీర్పు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement