
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
సాక్షి, కోవూరు: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు. చంద్రబాబునాయుడు డైరెక్షన్‌లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమ పార్టీ నాయకులకు గౌరవం ఉందన్నారు. అయితే లక్ష్మీనారాయణ వంటి వ్యక్తుల వల్ల ఆ గౌరవం సన్నగిల్లుతోందన్నారు. కన్నాకు గుంటూరులో రౌడీగా ముద్ర ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల విధివిధానాలను అపహాస్యం చేస్తూ కన్నా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు.
ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిని తమ పార్టీకి అప్పగించడం జరిగిందన్నారు. దానిని ఒక సవాల్‌గా స్వీకరించి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇతర దేశాల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు లాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దారుణమన్నారు. చంద్రబాబు, కన్నా వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమి ఒరగదన్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో లక్షలాదిమందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సమావేశంలో కాటంరెడ్డి దినేష్‌రెడ్డి, ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, డి.నిరంజన్‌బాబురెడ్డి, మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, ఎస్‌కే అహ్మద్, సొసైటీ అధ్యక్షులు ములుమూడి సుబ్బరామిరెడ్డి, ఎస్.నరసింహులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment