అహోబిలం శనివారం నరసింహ నామస్మరణతో మార్మోగింది. దిగువ అహోబిలంలో తెల్లవారుజామున గరుడోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు.. రాత్రి తెప్పోత్సవంలో కనువిందు చేశారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకం నిర్వహించిన వేదపండితులు అనంతరం తెప్పపై కొలువుదీర్చారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలతో స్వామికి కలిగిన శ్రమను తొలగించడానికి తెప్పోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ తెలిపారు. నేడు, రేపు కూడా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో తెప్పోత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో ఉత్సవమూర్తులు ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు.
ప్రత్యేక పల్లకిలో దేవాలయం సమీపంలో ఉన్న కొనేరు వద్దకు తీసుకువచ్చారు. కోనేరు వద్ద అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్‌శఠగోపయతీంద్ర మహదేశికన్, దేవస్థాన మేనేజర్ రామానుజన్, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేరులో సిద్ధంగా ఉన్న తెప్పలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు హారతి ఇచ్చి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో 10 రోజులపాటు స్వామి వారు వివిధ వాహనాలలో తిరగడంతో కలిగిన శ్రమను తొలగించడానికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ తెలిపారు.తెప్పోత్సవం ముగిసిన తరువాత ఉత్సవమూర్తులను అహోబిలం మఠం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. మఠం వద్ద పీఠాధిపతి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు తెప్పోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఆది,సోమవారాల్లో కూడా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన మేనేజర్ రామానుజన్ తెలిపారు.
దిగువ అహోబిలంలో
ఘనంగా గరుడోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శనివారం తెల్లవారుజామున గరుడోత్సవం నిర్వహించారు. ప్రహ్లాదవరదస్వామినిపల్లకిలో గరుడవాహనం వద్దకు తీసుకువచ్చారు. అర్చకులు వేదమంత్రోచ్చారణలు చదువుతుండగా, మేళతాళాలు,భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామి గరుడవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనానికి ముందు అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్‌శఠగోపయతీంద్రమహదేశికన్ ఉత్సవమూర్తులు ప్రహ్లదవరదస్వామి,శ్రీదేవి,భూదేవి అమ్మవారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నమో నారసింహ
Published Sun, Mar 8 2015 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement