ప్రలోభాలదే పైచేయి | Nandyal by-polls: TDP's Bhuma Brahmananda Reddy wins | Sakshi
Sakshi News home page

ప్రలోభాలదే పైచేయి

Published Tue, Aug 29 2017 2:50 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

ప్రలోభాలదే పైచేయి - Sakshi

ప్రలోభాలదే పైచేయి

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం
27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గిన భూమా బ్రహ్మానందరెడ్డి  
పోస్టల్‌ బ్యాలెట్‌కు స్పందన కరువు  
‘నోటా’కు నాల్గో స్థానం


కర్నూలు (అర్బన్‌)/ నంద్యాల :  నంద్యాల ఉప ఎన్నికలో ప్రలోభాలదే పైచేయి అయ్యింది. డబ్బు పంపిణీతో పాటు అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రచారం..ఇలా పలు అంశాలు అధికార పార్టీ విజయానికి దోహదపడ్డాయి. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై  27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ మొదలుకుని పోలింగ్‌ వరకు సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి  కొనసాగిన విషయం విదితమే. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రధానంగా పోటీ పడ్డారు.

 కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా వారికి కనీస స్థాయిలో కూడా ఓట్లు లభించలేదు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 23న పోలింగ్‌ నిర్వహించగా, సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా, 1,73,187 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లు,  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. దీంతో బ్రహ్మానందరెడ్డి  27,466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపును మొత్తం 19 రౌండ్లుగా చేపట్టారు.

 మొదటి రౌండ్‌ నుంచి 15వ రౌండ్‌ వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగగా.. 16వ రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి  654 ఓట్లు అధికంగా వచ్చాయి. మిగిలిన 17, 18, 19 రౌండ్లలో కూడా టీడీపీ ఆధిక్యత చాటుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అబ్దుల్‌ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు రావడం గమనార్హం.  ‘నోటా’కు ఏకంగా 1,231 ఓట్లు లభించడంతో నాల్గో స్థానంలో నిలిచింది. మిగిలిన అభ్యర్థుల్లో అబ్దుల్‌సత్తార్‌కు 338, భవనాశి పుల్లయ్య 154, రాఘవేంద్ర 75, రావు సుబ్రమణ్యం 94, వల్లిగట్ల రెడ్డప్ప 108, మహబూబ్‌బాషా 400, కాంతారెడ్డి 234, గురువయ్య 122, నరసింహులు మాదిగ 802, బాలసుబ్బయ్య 289, ముద్దం నాగనవీన్‌ 789, రఘునాథరెడ్డి 483 ఓట్లు సాధించరారు.  నంద్యాల పట్టణంతో పాటు నంద్యాల మండలంలోని గ్రామాల్లో టీడీపీ భారీ మెజార్టీ సాధించింది. గోస్పాడు మండలంలో మాత్రం ఆ పార్టీకి 800 మెజార్టీ వచ్చింది.  

పోస్టల్‌ బ్యాలెట్‌కు స్పందన కరువు
ఎన్నికల అధికారులు మొత్తం 250 మందికి పోస్టల్‌ బ్యాలెట్లను పంపారు. ఇందులో చిరునామాలు సక్రమంగా లేని కారణంగా 39 పోస్టల్‌ బ్యాలెట్లు తిరిగి వచ్చాయి. మిగిలిన 211 పోస్టల్‌ బ్యాలెట్లను సంబంధిత ఉద్యోగులు ఉపయోగించుకోలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు.  

అభివృద్ధి ఆగుతుందని..
ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం నంద్యాలలో ఆగమేఘాలపై అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హడావుడిగా రోడ్ల విస్తరణ ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేసింది. మొత్తమ్మీద రూ.1,500 కోట్ల వరకు అభివృద్ధి పనులకు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసింది. ఉప ఎన్నికలో టీడీపీ గెలవకపోతే ఈ పనులన్నీ ఆగిపోతాయని, రోడ్ల విస్తరణ బాధితులకు పరిహారం కూడా రాదని..ఇలా పలువిధాలుగా ప్రచారం సాగించారు. అలాగే పింఛన్లు, రేషన్‌ నిలిపిపోతాయని లబ్ధిదారులను బెదిరించారు. భారీగా డబ్బుతో పాటు చీరలు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, మద్దతుదారులపై పోలీసులను ఉసిగొల్పారు. ఈ విధంగా ప్రలోభపెట్టి, భయపెట్టి, దౌర్జన్యాలు చేసి అధికార పార్టీ గెలిచిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

డబ్బు, అధికారంతోనే టీడీపీ గెలుపు  
టీడీపీ కేవలం డబ్బు, అధికారంతోనే ఉప ఎన్నికలో విజయం సాధించింది. నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి మా పార్టీ శ్రేణులను టార్గెట్‌ చేయడమే కాకుండా ప్రలోభాలకు గురిచేశారు. లొంగని వారిని సోదాల పేరిట భయపెట్టారు. అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలెవరూ నమ్మలేదు. కేవలం పింఛన్‌లు, కార్డులు తొలగిస్తారన్న భయంతోనే టీడీపీకి ఓటు వేశారు. భూమా కుటుంబంపై సింపతీ కూడా కొద్దివరకు పనిచేసింది. ఓడినా, గెలిచినా నంద్యాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయం.
– శిల్పా మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

అభివృద్ధి పనులు కొనసాగిస్తాం
నంద్యాలలో అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నా విజయానికి కృషి చేశారు. అందరికీ కృతజ్ఞతలు.
– భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement