
53వ డివిజన్ 8వ పోలింగ్ బూత్ ఓటర్ల జాబితాలో సర్వే టీం సభ్యులు గుర్తుగా రాసిన టీడీపీ, వైఎస్సార్‌సీపీ పేర్లు
సాక్షి, నెల్లూరు (వీఆర్సీసెంటర్): నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ వెంకటేశ్వరపురం పునరావాసకాలనీ, వాటర్‌ట్యాంక్ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం ఐదుగురు వ్యక్తులు 8వ నంబర్ ఎన్నికల బూత్‌కు చెందిన ఓటర్ల జాబితాను తీసుకుని ఇంటింటికీ తిరిగారు. ఈ ఎన్నికల్లో నగర ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి పి.నారాయణకు ఓటు వేస్తారా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఓటు వేస్తారా అని అడుగుతూ ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. ఈ విధంగా సేకరించిన సమాచారంతో వారి వెంట తెచ్చుకున్న ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్ల ఫొటోల వద్ద టీడీపీకి మద్దతు తెలిపితే ‘టీడీపీ’ అని, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా చెప్పిన వారి ఫొటో వద్ద ‘వై’ అని గుర్తు పెట్టడాన్ని స్థానికులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ విధంగా వచ్చి సర్వే చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తూ సర్వే చేస్తున్న వారిని నిలదీశారు.
ఓ దశలో స్థానికులు, సర్వే చేస్తున్న వారి మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఎక్కువ సేవు ఇక్కడ ఉంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి అక్కడి నుంచి జారుకునే పనిలో పడటాన్ని గుర్తించిన స్థానికులు ఇంతకీ మీరు ఎవరు పంపితే వచ్చారని గట్టిగా నిలదీయడంతో విధి లేని పరిస్థితుల్లో తమలో ఇద్దరం నారాయణ ఆస్పత్రిలో పనిచేస్తున్నామని ఒప్పుకున్నారు. తమకు తోడుగా స్థానికంగా ఉన్న మరో ముగ్గురితో సర్వే చేయాలని యాజమాన్యం ఆదేశించడంతో ఇక్కడకు వచ్చామని చెప్పడంతో మరింత కోపోద్రిక్తులైన ప్రజలు వారిని పోలీసులకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఐదుగురు సర్వే టీం సభ్యులు మెల్లగా అక్కడి నుంచి జారుకుని తిన్నగా స్థానికంగా ఉన్న టీడీపీ కార్యాలయంలో తలదాచుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నారాయణ సంస్థలో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులతో ఇలాంటి సర్వేలు చేయించడం ఏమిటని, నారాయణా ఇది నీకు తగునా అంటూ 53వ డివిజన్ ప్రజలు, ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment