
సమరభేరి
అటు పురపోరుకు, ఇటు సార్వత్రిక సంగ్రామానికి మధ్య మరో ప్రతిష్టాత్మక సమరానికి తెర తొలగింది. పరిషత్ యుద్ధభేరి మార్మోగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందుగా అన్ని పల్లెల్లో వాతావరణాన్ని వేడెక్కించే ప్రాదేశిక యుద్ధానికి నాందీ ప్రస్తావన జరిగింది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉండడంతో ఇక గ్రామీణ రాజకీయం రసవత్తరంగా మారనుంది. , విశాఖపట్నం: జిల్లాలో 39 జెడ్పీటీసీలు, 656 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు పరిషత్ ఎన్నికలతో కళకళలాడబోతున్నాయి. ప్రస్తుతం వరుస ఎన్నికల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు వాయిదా వేయాలన్న పార్టీలు,అధికారుల విన్నపాల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలచేసింది.
ఈనెల 17నుంచి 20వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది. 21న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఎంపీటీసీ స్థానాలకు మండలస్థాయిలో నామినేషన్లు వేయాలి. జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్లను విశాఖనగరంలోని జిల్లాపరిషత్ కార్యాలయంలో దాఖలు చేయాలి. 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. అదేవిధంగా ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య, లేదా బ్యాలెట్ ఎన్నికల్లో అవకతవకలు వంటివేవైనా జరిగితే తిరిగి ఏప్రిల్ 7న అంటే మరుసటి రోజు పోలింగ్ నిర్వహిస్తారు.
ఫలితాలు కూడా ఎన్నికలైన మరుసటి రోజే అంటే ఏప్రిల్ 8న వెలువడనున్నాయి. జిల్లాలోని మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాల్లో 20 మహిళలకు,19 జనరల్‌కు కేటాయించారు. 656 ఎంపీటీసీ స్థానాలను 163 బీసీ,45 ఎస్సీ, 166 ఎస్టీ, 282 అన్‌రిజర్వుడ్‌కు కేటాయించారు.ఈదఫా జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 10 పెరిగాయి. జిల్లాపరిషత్ ఛైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈసారి పరిషత్ ఎన్నికల్లో మహిళామణుల హవా కొనసాగనుంది. అయితే ఇప్పటికే చాలాచోట్ల రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడతో మైదాన ప్రాంతాల్లో చాలాచోట్ల ఎస్టీలకు, ఏజెన్సీలో బీసీలకు ఎక్కువ స్థానాల్లో సీట్లు రిజర్వు అయ్యాయి. దీంతో నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీలో తగిన అభ్యర్థిని వెదకడం కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి.