- పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి
- విద్యానికేతన్‌లో నారాయణస్వామి విగ్రహావిష్కరణ
చంద్రగిరి : ఉపాధ్యాయుడిగా నారాయణస్వామి నాయుడు సేవలు ఆదర్శనీయమని శాంత బయోటిక్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబు తండ్రి, దివంగత ఉపాధ్యాయులు నారాయణస్వామి నాయుడు విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహాన్ని ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మనజీవితంలో చీక టిని పారద్రోలి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు నింపే ఒకే ఒక్కడు గురువన్నారు. నారాయణస్వామి నాయుడు ఎన్నో వేలమంది పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ మోహన్‌బాబు నారాయణస్వామినాయుడును తండ్రిగానే కాకుండా గురువుగా భావించి విగ్రహావిష్కరణ చేయడంతో ఆయన జన్మను చరితార్థం చేసుకున్నాడన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నారాయణస్వామి లాంటి మహానుభావుడి కడుపులో పుట్టడం మోహన్‌బాబు చేసుకున్న అదృష్టమన్నారు. మంచితనం, నిబద్ధత కలిగిన వ్యక్తి నారాయణస్వామి పిల్లలకు చదువు చెప్పాలని సంకల్పించి చదువుతోపాటు మంచిని బోధించిన మహనీయుడన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఒక తండ్రిని గురువని ఇలా సత్కారం చేసిన మోహన్‌బాబు నిజంగా అదృష్టవంతుడన్నారు.
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను కూడా 19 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగానన్నారు. చివరగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మోహన్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇలా విగ్రహ రూపంలో కాకుండా తల్లిదండ్రులను గుండె గుడిలో పెట్టుకున్నవారే చిరస్థాయిగా ఉంటారన్నారు. టీచర్స్ డే సందర్భంగా నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు కుటుంబసభ్యులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.