అభివృద్ధి, సుపరిపాలనే ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ రథసారథి నరేంద్ర మోడీ ‘నవభారత యువభేరి’కి రంగం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాదా, వచ్చే ఏడాదా అన్నది తేలని స్థితిలోనే బీజేపీ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ సదస్సు నుంచే ఎన్నికల ప్రచార నగారా మోగించనుంది. అభివృద్ధి, సుపరిపాలన, అధిక ధరలు, యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలే ఎన్నికల ఎజెండాగా దేశవ్యాప్తంగా నిర్వహించే వంద సదస్సుల్లో ఇది మొదటిది. మధ్యతరగతిని, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి కాషాయ దళం దీన్ని ఏర్పాటు చేసింది. సదస్సు వేదిక నుంచే ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదాన్ని దేశానికి వినిపించనుంది. దేశానికి తామేం చేయబోతున్నామో వివరించనుంది. ఇప్పుడు కాకుంటే మరెన్నడూ కాదన్న రీతిలో, కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో మోడీ తన కొత్త ఆలోచనలను, ఆకాంక్షలను వెల్లడించనున్నారు. తెలంగాణలో లబ్ధి పొందాలన్న యోచనతో రాష్ట్ర పార్టీ కమిటీ నగరంలో ఈ సదస్సును ఏర్పాటు చేసింది.
విస్తృత ఏర్పాట్లు: లక్ష మందితో నిర్వహించాలని భావిస్తున్న సదస్సుకు పార్టీ బీజేపీ రాష్ట్ర శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షా 24 వేల మందికి ప్రతినిధి కార్డులు జారీ చేసింది. పార్కింగ్, ఇతర ఏర్పాట్ల కోసం చుట్టుపక్కలున్న నిజాం కళాశాల గ్రౌండ్స్, మహబూబియా కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియాలను(ఇందిరాపార్కు) కూడా తీసుకుంది. పెద్దపెద్ద స్క్రీన్లను, సభాప్రాంగణంలో మూడు భారీ తెరలను అమర్చారు. సభా వేదికకు దారితీసే ఐదు ప్రధాన ద్వారాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టారు. మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సీ-బ్యాండ్‌తో అనుసంధాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లాల్లో సినిమా హాళ్లను అద్దెకు తీసుకుని ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు వెంకయ్య నాయుడు, కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, నల్లు ఇంద్రసేనారెడ్డి, టి.ఆచారి, వెంకటరెడ్డి తదితరులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సదస్సు గురించి సోషల్ మీడియాలో ప్రచారం కోసం 500 మందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ ప్రధాన ప్రతినిధి ఎన్.రామచంద్రరావు తెలిపారు.
ప్రతినిధి కార్డులు తప్పనిసరి...
సదస్సు గురించి సామాజిక వెబ్‌సైట్లలో ప్రచారం కల్పించడంతో ఇతర రాష్ట్రాల నుంచి, అమెరికా, బ్రిటన్‌ల నుంచి కూడా కొందరు హాజరు కానున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతినిధి కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించనున్నారు. అప్పటికప్పుడు ఈ కార్డులను జారీ చేయడానికి సభాప్రాంగణంలో 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తాయి. ఐదు రూపాయల రుసుం చెల్లించిన వారు ముందే వచ్చి తమ సీట్లలో కూర్చోవాలని నిర్వాహకులు సూచించారు. వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు, గొడుగులు సిద్ధం చేసినట్టు సదస్సు ప్రధాన బాధ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వివరించారు.