గ్రూపు సభ్యుల సమావేశం
డ్వాక్రా పొదుపు సంఘాలంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది నెలనెలా పొదుపు చేయడం... బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం...తిరిగి చెల్లించడం. దీనికి భిన్నంగా శ్యామలాంబ ఎస్‌ఎల్‌ఎఫ్(స్లమ్ లెవల్ ఫెడరేషన్) ఆలోచించింది. ఆలోచనను ఆచరణలో పెట్టింది. అందుకు తగిన గుర్తింపు పొందింది. జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం, సాలూరు: మున్సిపాలిటీలోని శ్యామలాంబ ఎస్‌ఎల్‌ఎఫ్‌కు జాతీయ స్థాయిలో స్వచ్ఛసేవా ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. పట్టణంలోని 13వ వార్డుకు చెందిన శ్యామలాంబ ఎల్‌ఎల్‌ఎఫ్ పారిశుద్ధ్య నిర్వహణలో తన పరిధిలో ఉన్న 28 స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన పరుస్తూనే ఇతర బాధ్యతలను సమర్ధంగా నిర్వహించడంతో జాతీయ స్థాయిలో పురస్కారం సొంతం చేసుకొంది.
ఆదర్శంగా సేవా కార్యక్రమాలు...
♦ రోజువారీగా ఇళ్లల్లో నుంచి వచ్చే చెత్తను, ఇతర వ్యర్ధాలను ఆరుబయట, మురుగు కాలువల్లో పారబోయకుండా వీధుల్లోకి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించేలా మహిళలను చైతన్యపరచడం.
♦ వచ్చే చెత్తలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా నిల్వచేసేలా చేయడం.
♦ వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల ప్రాముఖ్యత, వినియోగంపై అవగాహన పరచడం, నిర్వహించేలా చేయడం.
♦ గడిచిన పదేళ్లగా సంఘం పరిధిలో 280 మంది మహిళలను అనునిత్యం అవగాహన పరచడంలో ఏవిధంగా శ్యామలాంబ ఎస్‌ఎల్‌ఎఫ్ ముందుకు పోతోందో తెలిపే విషయాలను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో ఇటీవల జరిగిన స్వచ్చ సర్వేక్షణ్ సర్వేలో కూడా ఈ సంఘం మహిళలతో ప్రత్యేకంగా సర్వే బృందం సభ్యులు సమావేశం నిర్వహించింది. పారిశుద్ధ్య విషయంలో రూపొందించిన 58అంశాలతో కూడిన ఫార్మాట్‌పై ప్రశ్నలు వేసి, వారికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించారు. అందులో సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు క్షేత్ర స్థాయిలో కూడా అదే తరహా పరిస్థితులు కనిపించడంతో స్వచ్ఛసేవ ఎక్స్‌లెన్స్ పురస్కారానికి సర్వే కమిటీ సిఫారసు చేసింది.
ఆనందంగా వుంది...
ఇతర పొదుపు సంఘాల మాదిరిగా మా సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు సామాజిక విషయాలపై కూడా ప్రతీ సమావేశంలోనూ చర్చించేవాళ్లం. దీంతో మహిళల అందరిలోనూ పారిశుద్ధ్య విషయంలో అవగాహన పెరిగింది. పదేళ్లుగా మేం చేస్తోన్న కృషికి తగిన గుర్తింపు దక్కిందన్న ఆనందం మాకెంతో గొప్పగా వుంది. ఇది మహిళలందరి విజయం.–నల్లి పద్మ, శ్యామలాంబఎస్‌ఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు, సాలూరు
కృషి ఫలించింది..
మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విషయంలో మేం చేస్తోన్న కృషి ఫలించింది. మహిళలతోనే మార్పు సాధ్యమన్న విషయాన్ని నమ్మి, వారిని చైతన్యపరచడానికి అధిక ప్రాదాన్యమిచ్చాం. తడిపొడి చెత్తల సేకరణ, పారిశుద్ధ్యంపై మేం చెప్పే విషయాలను అర్ధం చేసుకున్న మహిళలు జాతీయ స్థాయి పురస్కారాన్ని దక్కించుకోవడం అభినందనీయం. –ఎంఎం.నాయుడు, మున్సిపల్ కమిషనర్, సాలూరు
Comments
Please login to add a commentAdd a comment