ఆ భూములను రికార్డుల్లో నమోదు చేయండి
ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన 29 మంది దళిత రైతులకు చెందిన 30 ఎకరాల భూమిని రికార్డుల్లో నమోదు చేసే విధంగా అధికారులకు అదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఉండవల్లి గ్రామంలో తమకు 1977లో లంక భూమలును సాగు చేసుకోవడానికి డీకే పట్టాలిచ్చారని, కానీ ఆ భూముల్ని సాగు, రికార్డుల్లో నమోదు చేయనీయకుండా కొందరు అడ్డుపడుతున్నారని బాధిత రైతులు గ్రామ సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో విచారణకు హాజరుకావాలని గుంటూరు కలెక్టర్‌ను, అధికారులను, బాధిత రైతులను కమిషన్ ఆదేశించింది.
బుధవారం విచారణకు అధికారులు హాజరుకాక పోవడంతో కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దళిత రైతుల హక్కులను కాపాడాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కమిషన్ సభ్యురాలు కమలమ్మ మండిపడ్డారు. ఏపీ నుంచి తరచుగా దళితుల భూముల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తమకు ఫిర్యాదులు అందడం దురదృష్టకరమని ఆమె అన్నారు. అధికారులకు అదేశాలు జారీ చేసి దళిత రైతుల భూములు ఆన్‌లైన్‌లో రికార్డు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఆమె లేఖ రాశారు.