
సాక్షి, శ్రీకాకుళం: ఓ ఇంట్లో దాచి ఉంచిన ముందుగుండు సామాగ్రి పేలడం జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మీ టాకీస్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి జనావాసాలు మధ్య ఉన్న ఇళ్లు కుప్పకూలింది. పరిసరాల్లోని మరో నాలుగైదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అడవి పందులను వేటాడం కోసం ఆ ఇంట్లో ఉంటున్నవారు ఈ బాంబులు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంట్లో నివసిస్తున్నవారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున నాటు బాంబుల తయారీ జరుగుతున్న అధికారులు గుర్తించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment