
నృత్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి
సాక్షి, అమరావతి/విజయవాడ కల్చరల్: ప్రఖ్యాత నాట్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి (70) అడుగులు ఆగిపోయాయి. నాట్యమయూరి, కళానిధి, కళాప్రపూర్ణ బిరుదులందుకున్న ఆమె విజయవాడ రామవరప్పాడులోని వృద్ధాశ్రమంలో మంగళవారం మృతి చెందారు. కృష్ణా జిల్లా తేలప్రోలులో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. నాట్య కళాకారిణిగా జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఈ విషయమై గతేడాది సెప్టెంబర్‌లో ‘తడబడిన నాట్య మయూరి అడుగులు’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది.
అన్నపూర్ణాదేవి జీవన నేపథ్యమిదీ..
► కృష్ణా జిల్లా గుడివాడలో లక్ష్మీనారాయణ, సుబ్బలక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన లంక అన్నపూర్ణాదేవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
► చిన్నప్పుడే ఆమె చింతా సీతారామాంజనేయులు, భాగవతుల రామతారకం వద్ద భరత నాట్యం నేర్చుకున్నారు. కూచిపూడి కులపతి చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు.
► 1962లో భారత్–చైనా యుద్ధ సమయం లో దేశ సరిహద్దులకు వెళ్లి సైనికులలో ఉ త్తేజం నింపేలా నాట్య ప్రదర్శనలిచ్చారు. ఇందుకు గాను నాటి ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అభినందనలు అందుకున్నారు.
► 1973లో రైలు ప్రమాదంలో అన్నపూర్ణకు ఒక కాలు మోకాలి వరకు తెగిపోగా, మరో కాలు మడమ వరకు దెబ్బతింది.
► ఆ తరువాత కొయ్య కాలు అమర్చుకుని దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
► 1982లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో డ్యాన్స్ టీచర్ ఉద్యోగం ఇచ్చింది.
► 2006లో ఉద్యోగ విరమణ చేసిన ఆమె విజయవాడ సత్యనారాయణపురంలో స్థిర పడ్డా రు. గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్యం పా లైన ఆమెను బంధువులు, శిష్యు లు వైద్యం చేయించి వృద్ధాశ్రమంలో చేర్పించారు.
కళాకారుల సంతాపం
లంక అన్నపూర్ణాదేవి మృతి పట్ల నగరానికి చెందిన ఆంధ్ర నాట్యాచార్యుడు ఉమామహేశ్వర పాత్రుడు, పద్మశ్రీ హేమంత్, హైదరాబాద్‌కు చెందిన శిష్యురాలు భావన సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment