రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నగరానికి రావడం ఇది రెండోసారి. ఇటీవల జరిగిన తొలి పర్యటనలో శారదా పీఠాన్ని సందర్శించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మలి పర్యటనను దేశ రక్షణ శాఖ కార్యక్రమాలకు కేటాయించారు. ఈ పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే జరిగే విందులో పాల్గొని.. అదే రోజు రాత్రి విజయవాడకు తిరిగి వెళ్తారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆదివారం మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉంటారు. – సాక్షి, విశాఖపట్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఇద్దరూ కలిసి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ రెండోసారి నగరానికి వస్తుండగా, రక్షణ మంత్రి హోదాలో రాజ్‌నాధ్ విశాఖ రావడం ఇదే తొలిసారి. రక్షణ మంత్రి శనివారం మధ్యాహ్నమే నగరానికి రానుండగా.. సీఎం వైఎస్‌జగన్ రాత్రి 7 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయంలోనే పార్టీ నాయకులు, అధికారులు ఇతర ముఖ్యులతో మాట్లాడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరి సమావేశ మందిరానికి 7.30కు చేరుకుంటారు. అక్కడ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలుస్తారు. అనంతరం రాత్రి 8.15 వరకు నౌకాదళ సమీక్షలో వారిద్దరూ కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ జరిగే విందులో సీఎం జగన్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారు. రాత్రి 8.40 గంటలకు సీఎం బయలుదేరి 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు తిరిగి వెళ్తారు.
రెండు రోజులు రక్షణ మంత్రి ఇక్కడే..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉదయం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 3.55 వరకు హెలికాప్టర్‌లో తూర్పు నౌకాదళంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. రాత్రి 7.30కు ఈస్ట్రన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే సమీక్ష సమావేశం, విందు కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్‌జగన్‌తో కలిసి పాల్గొంటారు. రెండో రోజు ఆదివారం ఉదయం ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరి ఈఎన్‌సీ ప్రధాన కేంద్రానికి చేరుకొని నౌకలను సందర్శిస్తారు. నావికులు, నేవీ అధికారులు, నేవీ సివీలియన్ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలోఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
విశాఖ చేరుకున్న నౌకాదళాధిపతి
కేంద్ర రక్షణ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ శుక్రవారం సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్నారు. ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకున్న కరమ్‌బీర్‌సింగ్‌ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ స్వాగతం పలికారు. భారత నౌకాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వచ్చిన కరమ్‌బీర్ సింగ్‌కు గార్డాఫ్ హానర్ నిర్వహించి స్వాగతం పలికారు. అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజున ఈఎన్‌సీ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment