పొంచి ఉన్న ముప్పు!
విశాఖ నుంచి హైదరాబాద్‌కు సుదీర్ఘ గ్యాస్, పెట్రోలియం పైపులు
విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరం విశాఖపట్నం నుంచి ప్రస్తుత ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వరకు ఉన్న గెయిల్, హెచ్‌పీసీఎల్ పైపులైన్లు ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ భారీ పైపులైన్ల ద్వారా నిరంతరం గ్యాస్, చమురు సరఫరా అవుతాయి. ఇవి ఏళ్ల కిందవి కావడం, ఊళ్లు, గ్రామాలు, పంట పొలాల మధ్య నుంచే వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచు కు వస్తుందోననే భయం ప్రజలను వెంటాడుతోంది. విశాఖ నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు నల్లగొండ జిల్లాల్లోని వందలాది గ్రామాల మీదుగా ఈ పైపులైన్లు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. గెయిల్ సంస్థ విశాఖ నుంచి హైదరాబాద్‌కు 2003లో ఎల్‌పీజీ పైపులైను నిర్మించింది. 600 కిలోమీటర్ల ఈ పైపులైనుకు సంబంధించి గ్యాస్ పంపింగ్, ప్రెజర్ కంట్రోల్ అంతా విశాఖ నుంచే జరుగుతుంది.
ఈ పైపులైనుకు రోజుకు 2.5 లక్షల గ్యాస్ సిలెండర్లను నింపే సామర్థ్యం ఉంది. అంతటి కీలకమైన ఈ పైపులు ఇప్పటికే చాలావరకు పాతబడిపోయాయి. దీనికి సమాంతరంగా హెచ్‌సీపీఎల్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు పెట్రోలియం ఉత్పత్తులను తరలించే మరో పైపులైన్ నిర్మించింది. ఈ రెండు పైపులైన్లు పాతబడి చాలాచోట్ల లీకులు తలెత్తుతున్నాయి. చమురు చోరులు కూడా పైపులైన్ల భద్రతకు ముప్పుగా మారారు. ఇక విశాఖ నగర ప్రజలైతే నిరంతరం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక్కడ స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, ఐవోఎల్ తదితర కంపెనీలు నగరం నడిబొడ్డునే గ్యాస్ పైపులైన్లను నిర్మించాయి. కంపెనీలకు చెందిన రిజర్వు భూముల మీదుగా వెళ్లే ఈ పైపులైన్లు చాలా చోట్ల బలహీనపడి ప్రమాదకరంగా మారాయి.