మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
మామిడికుదురు/కాకినాడ క్రైం: గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, చెప్పారు. ఇందులో ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, గెయిల్ నుంచి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. వాటిలో ఐదేసి లక్షల రూపాయలతో ఆయా కుటుంబాలకు శాశ్వత సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయాలపాలైన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా అందిస్తామన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. శుక్రవారం నగరం గ్రామంలో జరిగిన దుర్ఘటన విషయం తెలియగానే హస్తిన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి ప్రధాన్‌తో కలిసి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వచ్చి, అక్కడి నుంచి నగరం గ్రామానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో కాకినాడ చేరుకొని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నగరం గ్రామాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అక్కడ స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీసే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజవాయువు వెలికి తీసే దేశాల్లో పర్యటించి అక్కడ అవలంబిస్తున్న భద్రత చర్యలను పరిశీలిస్తామని, మనదేశంలో కూడా వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదంపై విచారణకు హైపవర్ కమిటీని నియమించినట్టు చంద్రబాబు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
బాధితుల ఆవేదన..
చంద్రబాబు తొలుత నగరం గ్రామంలో ఓఎన్‌జీసీ అధికారులతో మాట్లాడారు. ఈ సమయంలో బాధితులు సీఎంను, కేంద్ర మంత్రిని చుట్టుముట్టారు. చమురు సంస్థలు తమ రక్షణను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఓఎన్‌జీసీ అధికారుల వైఖరి వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం, కేంద్ర మంత్రి తమ ఇళ్లకు రావాలని పట్టుబట్టారు. బాధితుల ఇళ్లకు వారు వెళ్లకపోవడంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ సీఎం పట్టించుకోకుండా వారినుద్దేశించి మాట్లాడారు. ఈ ప్రమాదం విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లానని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు.
వైద్య నిపుణులను రప్పిస్తాం: మంత్రి కామినేని
కాకినాడలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు హైదరాబాద్ నుంచి నిపుణులైన వైద్యులను రప్పిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలిచ్చామన్నారు.