భద్రత లేని గ్యాస్ పైపులు
ప్రమాదం జరిగితే భారీ ప్రాణ నష్టం తప్పదు!
తాడేపల్లిగూడెం: మీ వంటిం టికే గ్యాస్ వస్తుంది. నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అవుతుంది. ఎంత వాడితే అంతే సొమ్ము చెల్లించవచ్చు. ఇదీ సహజవాయువు, ఎల్పీజీ, లిక్విడ్ హైడ్రోజన్ సరఫరాకు గెయిల్ గ్యాస్ పైపు లైన్లు వేసే సమయంలో చెప్పిన విషయాలు. గ్యాస్ లైను వెళ్లింది. వంట ఇంటికి మాత్రం గ్యాస్ రాలేదు. పైగా, గ్యాస్ పైపులు, గ్యాస్ స్టేషన్ల వద్ద భద్రత చర్యలు నామమాత్రంగానే చేపట్టారు. నగరం గ్రామం వద్ద జరిగిన పెనుప్రమాదం గ్యాస్ లై న్ల భద్రతలో డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న గ్యాస్ స్టేషన్లు, పైపు లైన్ల భద్రత చర్యలపై చర్చ మొదలైంది.
ఈ పైపులు జనావాసాల మధ్య నుంచి వెళ్తున్నాయి. ఇవి ఏ కంపెనీ పైపు లైన్లు, వాటి వద్ద తవ్వాలంటే ఎవరిని సంప్రదించాలో తెలుపుతూ బోర్డులు పెట్టారు. కానీ, గ్యాస్ లీకైతే ఏం చేయాలి, ఏ రక్షణ చర్యలు చేపట్టాలనే విషయాలు ఎక్కడా లేవు. తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లికి వెళ్లే రహదారి పక్కన గెయిల్ ఎస్‌వీ-4 గ్యాస్ స్టేషన్ ఉంది. ఈ పైపులైను పెదతాడేపల్లిలో జనసమ్మర్థం ఎక్కువగా ఉండే మేకల సంత, విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుకనుంచి ఉంది. ఐదేళ్ల క్రితం వ్యవసా య క్షేత్రాలు, జనావాసాల మీదుగా రిలయన్స్ గ్యాస్ పైపులైనును వేశారు. ఇక్కడ కూడా తవ్వకాలు చేపట్టొద్దని చెప్పారు తప్ప ప్రమాదాలపై అవగాహన కల్పించలేదు.