పాపకు ప్రాణదానం చేయరూ | need help from donors | Sakshi
Sakshi News home page

పాపకు ప్రాణదానం చేయరూ

Published Fri, Sep 6 2013 3:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

need help from donors

కొత్తపేట, న్యూస్‌లైన్:
 అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ చిన్నారిపై విధి పగ పట్టిందో ఏమో! ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ పాపను అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధి పట్టిపీడిస్తోంది. కంటి వెలుగుగా తిరుగాడుతున్న కూతురు ఆస్పత్రి పాలై.. బాధ పడుతుండడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబమైనా బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలని చేయని ప్రయత్నం లేదు. మరో శస్త్రచికిత్స చేయిస్తే బిడ్డకు నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. బరువు పెరిగి.. ఆహారం ఒంటబట్టక.. తరచూ వచ్చే జ్వరంతో బాధపడుతున్న ఆ చిన్నారి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన శ్రీకూర్మం సత్యనారాయణ బట్టల దుకాణంలో రోజు కూలీగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె విజయదుర్గకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన తాపీమేస్త్రి పెరంబదూరి దుర్గాప్రసాద్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు.  దివ్య అక్షర (5), నాగవైష్ణవి (3). అక్షర వాడపాలెంలోని అమ్మమ్మ ఇంట్లో పెరుగుతోంది. కొంతకాలం క్రితం అక్షర శరీరం ఉబ్బి అనారోగ్యానికి గురైంది. ఆమెకు స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించారు.
 
  అక్కడ  నయం కాకపోవడంతో నరసాపురం, భీమవరం ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. రూ.60 వేలు పైబడి ఖర్చయినా ఏమాత్రం నయం కాకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకువెళ్లారు.  అక్షరకు సోకింది అప్లాస్టిక్ ఎనీమియా (ఎముకల్లోని మూలుగులో రక్తం తయారుకాకపోవడం) వ్యాధి అని అక్కడ  నిర్థారించారు. బంధువులు, దాతలు సమకూర్చిన సుమారు రూ.4 లక్షలతో అక్కడ వైద్యం చేయించారు. అయినప్పటికీ నయం కాకపోవడంతో అక్షర సోదరి వైష్ణవి మూలుగు ఎక్కిస్తే నయమవుతుందని రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ మేరకు రూ.12 వేలు వెచ్చించి వైష్ణవికి మూలుగు పరీక్ష చేయించగా ఇద్దరి గ్రూపు కలవలేదు. దాంతో అక్షరకు సరిపోయే దాతలు ఎవరి మూలుగునైనా ఎక్కించవచ్చని, దానికి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని, ఆ శస్త్రచికిత్సను తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేస్తారని తెలిపారు. అంత సొమ్ము వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
 
  దయార్ద్ర హృదయులు సాయం చేయాల్సిందిగా తాత శ్రీ కూర్మం సత్యనారాయణ, తండ్రి పెదంబదూరి దుర్గావరప్రసాద్ కోరుతున్నారు. దాతలు పెదంబదూరి దుర్గావరప్రసాద్ ఆంధ్రాబ్యాంక్ ఎకౌంట్ నంబరు 110510100085813 కు జమచేయవచ్చని, వివరాలకు అతని సెల్ నం 9666504852ను సంప్రదించాలని శ్రీకూర్మం సత్యనారాయణ కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement