కడప అర్బన్/వేంపల్లె, న్యూస్‌లైన్: కడప నగరంలోని ఓ పూల వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు రాబట్టాలని నిందితులు నేరానికి పాల్పడగా, ఆ ఘటనను కేవలం 24 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన వారి ఆట కట్టించారు. వారు బాధితుని నుంచి బలవంతంగా రాయించుకున్న ప్రామిసరి నోట్లు, అగ్రిమెంట్లను సీజ్ చేశారు. డయల్ 100కు ఫోన్ రాగానే వెంటనే స్పందించిన ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించి నిందితులను అరెస్ట్ చేశారు.
శుక్రవారం సాయంత్రం ఒన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలో కడప డీ ఎస్పీ సి.రాజేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎర్రముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్ సమీపంలో పూల వ్యాపారి ఏనుగటి క్రిష్ణ అలియాస్ పూలక్రిష్ణ(55) నివసిస్తున్నాడన్నారు. ఆయన నగరంలోని పాత బస్టాండు వద్ద పూల అంగడితో పాటు పాత సీసాలు, పాత ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేసేవారన్నారు. నాగరాజుపేటకు చెందిన నామాల శ్రీనివాసులు పూల క్రిష్ణ వద్ద పదేళ్లుగా గుమాస్తాగా పని చేసేవాడన్నారు. అతని ప్రవ ర్తన సరిగా లేకపోవడంతో శ్రీనివాసులును క్రిష్ణ ఉద్యోగం నుంచి తొలగించాడని డీఎస్పీ తెలిపారు. తన భాగానికి రూ.40 లక్షలు వస్తాయని శ్రీనివాసులు ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఒన్‌టౌన్ పోలీసులు విచారించగా తప్పుడు ఫిర్యాదుగా విచారణలో తేలిందన్నారు.
పూల క్రిష్ణ వద్ద నుంచి రూ.40 లక్షలు రాబట్టుకునేందుకు శ్రీనివాసులు పులివెందులకు చెందిన లక్ష్మినారాయణరెడ్డిను సంప్రదించి కిడ్నాప్ పథకం రచించారన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి 9.20 గంటలకు ఎర్రముక్కపల్లె సర్కిల్ వద్ద ఎక్సెల్ వాహనంలో ఇంటికి వెళుతున్న క్రిష్ణను నామాల శ్రీనివాసులు (45), బత్తల శ్రీనివాసులు(29), బొర్రె వంశీ రాం (21), డొడ్డోడు సురేష్ (23), రామాంజి (24), లక్ష్మినారాయణరెడ్డి, మహేష్, బాషాలు స్కార్పియోలో కిడ్నాప్ చేశారన్నారు. వేంపల్లె వద్ద పూల క్రిష్ణను బెదిరించి, 4 ఖాళీ బాండ్ పేపర్లు, 5 ప్రామిసరి నోట్లపై సంతకాలు చేయించుకున్నారన్నారు.
అనంతరం వేంపల్లె బస్టాండులో వదిలేశారన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పూల క్రిష్ణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారన్నారు. ఒన్‌టౌన్ సీఐ ఎస్.మహబూబ్‌బాష, అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఒన్‌టౌన్ ఎస్‌ఐలు రంగనాయకులు, మైనుద్దీన్‌లు సిబ్బంది ప్రసాద్, వెంకటేశ్వర్లు ఐదుగురు నిందితులను శిల్పారామం వద్ద అరెస్ట్ చేశారని డీఎస్పీ వివరించారు.
కిడ్నాప్ సుఖాంతం
Published Sat, Mar 1 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement