అధ్వానంగా కలివెలపాళెం చెరువుకట్ట కలుజు
నెల్లూరు రూరల్: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో నీరు – చెట్టు పథకం కింద పనులను మంజూరు చేశారు. అయితే ఈ పనులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. çకొన్ని చోట్ల పనులను చేయకుండానే ఇరిగేషన్ శాఖ అధికారులను మభ్యపెట్టి పనులు పూర్తయినట్లు బిల్లులు చేసుకొని స్వాహా చేసిన ఉదంతాలు కోకొల్లలు. మరికొన్ని చోట్ల నామమాత్రంగా, నాసిరకంగా నిర్మాణ పనులను పూర్తి చేశారు. దీంతో నిర్దేశిత ప్రమాణాల మేరకు నాణ్యత కొరవడింది. నీరు – చెట్టు పథకంలో పనుల విషయంలో రూ.తొమ్మిది కోట్ల వరకు దుర్వినియోగమయ్యాయి.
పనులు ఇలా..
నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రాంతాల్లో మూడేళ్ల కాలంలో 330 పనులు నీరు – చెట్టు పథకం కింద మంజూరయ్యాయి. ఈ పనులకు రూ.19.25 కోట్లను కేటాయించారు. మండలంలోని చెరువులకు నీటిని మళ్లించేందుకు 15 చెక్‌డ్యామ్‌ల వరకు నిర్మించారు. చెరువు కట్టల బలోపేతానికి గానూ కట్టలపై లైనింగ్ పనులు, చెరువు కట్టల స్థాయిని పెంచేందుకు ఎర్త్‌వర్క్‌లు 50 వరకు చేశారు. చెరువుల్లో నీటిని అధికంగా నిల్వ ఉంచేందుకు మట్టిని తవ్వే పనులు కూడా జరిగాయి.
లేఅవుట్లకు మట్టి తరలింపు
చెరువుల నుంచి తవ్విన మట్టిని అధికార పార్టీ నేతలు తమ స్వలాభానికి యథేచ్ఛగా సమీపంలోని లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు కట్టల బలోపేతానికి చేపట్టిన పనులు తూతూమంత్రంగానే జరిగాయి. దీంతో చెరువుకట్టలు గతంలో ఉన్న మాదిరిగానే యథాస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల రైతులకు చేకూరిన ప్రయోజనం శూన్యం. నీటిపారుదల కాలువలపై బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం, వరద గేట్ల ఏర్పాటు పనుల్లో నాణ్యత పూర్తిగా కొరవడింది. నీటిపారుదల కాలువల్లో పూడికతీత పనులను అధ్వానంగా చేపట్టారు. కాకుపల్లి, కలివెలపాళెం, పెనుబర్తి, మాదరాజుగూడూరు, తదితర ప్రాంతాల్లో నీరు – చెట్టు పథకం పేరిట అధికార పార్టీ నేతలు దోపిడీ పర్వానికి తెరలేపారు.
అంచనా వ్యయం పెంపు
ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాధారిత చెరువులు, కాలువల్లో రైతులకు అవసరమైన పనులు, మరమ్మతులను చేపట్టేందుకు సాగునీటి సంఘాల ద్వారా నివేదికలు ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలతో అందడం పరిపాటి. అయితే రూ.పది లక్షల్లోపు ఉన్న పనులను నామినేటెడ్ పద్ధతిన ఇష్టానుసారంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారు. రూ.10 లక్షలకుపైగా అంచనా కలిగిన పనులను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించారు. చిన్నపాటి మరమ్మతు పనులకు సైతం అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచి కట్టబెట్టారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల మాటకే ఇరిగేషన్ శాఖ అధికారులు తలొగ్గారు.
నీరు – చెట్టు పథకం పనులు అధ్వానంగా జరిగాయి
నీరు – చెట్టు పథకం పనులు అధ్వానంగా జరిగాయి. అవసరం లేని చోట కూడా పనులను చేపట్టి నిధుల దోపిడీకి పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు చేపట్టిన ఈ పనులతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదు.
– పార్లపల్లి వీరరాఘవరెడ్డి, రైతు, కలివెలపాళెం, నెల్లూరు రూరల్
నిధుల దోపిడీకి పాల్పడ్డారు
నీరు – చెట్టు పథకం అధికార పార్టీ నేతలకు వరంలా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. పనులు పూర్తిగా నాసిరకంగా జరిగాయి. బాగున్న చోటే పనులు చేపట్టి బిల్లులు పొందారు.
– బండి శ్రీకాంత్‌రెడ్డి, రైతు, పొట్టేపాళెం, నెల్లూరు రూరల్
నియోజకవర్గం: నెల్లూరు రూరల్
మంజూరైన పనులు - 330
కేటాయించిన నిధులు - రూ.19.25 కోట్లు
స్వాహా అయిన మొత్తం - రూ.9 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment