దోపిడి రాజ్యం.. దొంగ ప్రభుత్వం | Neeru-Chettu Scheme Neglected To TDP Government | Sakshi
Sakshi News home page

దోపిడి రాజ్యం.. దొంగ ప్రభుత్వం

Published Tue, Mar 26 2019 10:16 AM | Last Updated on Tue, Mar 26 2019 10:18 AM

Neeru-Chettu Scheme Neglected To TDP Government - Sakshi

కొత్తపట్నం మండలం అల్లూరు చెరువులో అడ్డదిడ్డంగా గోతులు తవ్వి వదిలేసిన దృశ్యం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చెరువులను ఆధునీకరించి, వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతోనే నీరు–చెట్టు పనులను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు ఊదరగొడుతున్నా.. లక్ష్యం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే అన్నది సుస్పష్టం. నీరు–చెట్టు పథకంలో దాదాపు 12 రకాల కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. చెక్‌డ్యామ్‌లు, చిన్న నీటికుంటలు, వాల్‌కట్టలు నిర్మించడం, చెరువుల్లో పూడిక తీసిన మట్టిని వ్యవసాయ భూములకు వినియోగించడం, చెరువులకు మరమ్మతులు చేయడం, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం, నీటివనరులు లభ్యత ఉన్న చోట చెరువులకు ఎత్తిపోతల ద్వారా నీరు అందించడం, చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం, నీటిపారుదల కాలువలకు మరమ్మతులు చేసి సామర్థ్యాన్ని పెంచడం, క్షీణించిన అడవుల్లో చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడడం, ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టి ఆయకట్టును స్థీరికరించడం, మెట్ట ప్రాంతాల్లో కొత్త ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని సరఫరా చేయడంతోపాటు అన్ని ప్రాంతాల్లో మొక్కలు పెంచి హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం నీరు–చెట్టు పథకం ముఖ్య ఉద్దేశం. కానీ క్షేత్ర స్థాయిలో చేస్తున్న పనులు పథకంలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా ఉన్నాయి.  

2015–16లో చేపట్టిన పనుల్లో 90 శాతానికిపైగా పాత గుంతలను చూపించి టీడీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. అధికారులు మాత్రం 385 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక తొలగించినట్లు లెక్కలు చూపడం గమనార్హం. 2016–17లో చేపట్టిన పనుల్లోనూ ఉపాధి హామీ గోతులను నీరు–చెట్టు కింద చేసినట్టు చూపారు. అధికారులు మాత్రం 420 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలగించినట్లు లెక్కలు చెబుతున్నారు. 2017–18లో చేపట్టిన పనుల్లో ఉపాధి హామీ గోతులు, హేచరీలకు మట్టి తరలించగా ఏర్పడిన గోతులను చూపి బిల్లులు మంజూరు చేయించుకున్నారు. మొత్తం మీద గడిచిన మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా నీరు–చెట్టు పథకంలో 604.58 కోట్లతో 8,865 పనులు మంజూరు చేయగా రూ.355.44 కోట్లు వెచ్చించి 4,473 పనులు పూర్తి చేసినట్లు అధికారులు లెక్కలేశారు!

అంతులేని అవినీతి
జిల్లాలో జరుగుతున్న నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. 30 శాతం కమీషన్లు తీసుకుని ఇరిగేషన్‌ అధికారులు ఇబ్బడిముబ్బడిగా పనులు మంజూరు చేయగా పాత గుంతలను చూపించి టీడీపీ నేతలు, కార్యకర్తలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. నీరు–చెట్టులో అధికార పార్టీ నేతలు 80 నుంచి 90 శాతం పనులను మనుషులతో కాకుండా యంత్రాలతో పూర్తి చేశారు. చెరువులు, కాలువల్లో పాత గుంతలు చూపి బిల్లులు చేసుకున్నారు. చెరువుల్లో మట్టిని ఒక్కో ట్రిప్పు రూ.300 నుంచి రూ.800 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అదే గుంతలు చూపించి పూడికతీత పేరుతో నీరు–చెట్టులో బిల్లులు తీసుకున్నారు. చెక్‌డ్యామ్‌లు నాసిరకంగా నిర్మించి పెద్ద ఎత్తున నిధులు కాజేశారు.

జిల్లాలో చీరాల మినహా మిగిలిన 11 నియోజకవర్గాల్లో అవినీతికి అంతే లేదు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురంతోపాటు కందుకూరు, దర్శి ప్రాంతాల్లో అక్రమాలు  ఎక్కువగా చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం కోసమే నీరు–చెట్టు పథకం పెట్టినట్టుందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికారులు అందినకాడికి కమీషన్లు పుచ్చుకుని నేతలు, కార్యకర్తలతో కలిసి వాటాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి సోమవారం జిల్లాలో గ్రీవెన్స్‌ డేకు వచ్చే అర్జీల్లో అధిక శాతం వినతులు.. నీరు–చెట్టు అక్రమాలపైనే కావడం గమనార్హం. ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తున్నా.. ఉన్నతాధికారులతోపాటు సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ కూడా స్పందించిన దాఖలాలు లేవు.

పేదల పొట్టగొడుతున్నారు 
పూసపాడు గ్రామంలోని బాపిరెడ్డి కుంట విస్తీర్ణం 18.24 సెంట్లు. దీని ఆధారంగా 22 కుటుంబాల వారు గత 70 ఏళ్ల నుంచి భూమి సాగు చేసుకుంటున్నారు. మా తాతల కాలం నుంచి ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాం. గతంలో ఐదు ఎకరాలను కుంట తవ్వుకోవడానికి ఇచ్చాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఎకరా కూడా నీరు–చెట్టు పేరుతో తవ్వుకోవాలని చూశారు. మాబోటి పేదోళ్ల పొట్టకొట్టేందుకు సిద్ధపడ్డారు. మట్టి అమ్ముకుని స్థానిక టీడీపీ నాయకులు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదించుకున్నారు.        
– ఇస్తర్ల భూషణం, పూసపాడు(పర్చూరు)

పనులెక్కడ చేశారు?
నీరు చెట్టు కింద మంజూరైన మట్టి పనులు ఎక్కడ చేశారు. వాగుల్లో మట్టి పనులు తూతూమంత్రంగా చేసి బిల్లులు పొందారు. చెరువుల్లో అయితే గతంలో పని చేసిన చోటునే మరోసారి పని చేసినట్టు చూపి టీడీపీ నాయకులు డబ్బు దండుకున్నారు. కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి కనీసం ప్రజాప్రతినధులకు కూడా తెలియకుండానే పనులు చేశారు. 
 – మాలకొండయ్య, మార్కాపురం ఎంపీపీ 

ఇష్టారీతిగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం
కందుకూరు రూరల్‌: కందుకూరు మండలంలో ఉపయోగం లేని చోట చెక్‌డ్యామ్‌లు నిర్మించి అప్పనంగా బిల్లులు మెక్కేశారు. అనంతసాగరం గ్రామంలో నీరు–ప్రగతి కింద రూ.24 లక్షలతో మూడు చెక్‌ డ్యామ్‌లు మంజూరు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు   మూడు చెక్‌డ్యామ్‌లకు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఒకటి పడమటి వాగుపై, మరో రెండు జింకల వాగుపై నిర్మించారు. పడమటి వాగుపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ పగుళ్లిచ్చింది. చెక్‌ డ్యామ్‌ నిర్మిస్తే నీరు నిల్వ ఉండేలా వాగులో పూడిక తీయాలి. ఇక్కడ మరో కాలువ ఉన్నా దానికి కలపకుండా ఒక వాగుపైనే చెక్‌డ్యామ్‌ నిర్మించారు. ఇందులో చుక్క నీరు నిల్వ ఉండే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. అదే విధంగా జింకల వాగుపై నిర్మించిన రెండు చెక్‌డ్యామ్‌లు దగ్గర దగ్గరగా నిర్మించారు. ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో పగుళ్లిచ్చాయి. వాగుకు నీరు వచ్చినప్పుడు చెక్‌ డ్యామ్‌లో నీరు నిల్వ ఉండేలా పని చేయకుండా టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా నిర్మించి బిల్లులు తీసుకున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులు కూడా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ పనులు సక్రమంగా చేయించకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు.  

పచ్చచొక్కాల పర్యవేక్షణలోనే పనులు
పరిటాలవారిపాలెం(సంతమాగులూరు): మండలంలోని పరిటాలవారిపాలెంలో నీరు–చెట్టు పథకంలో భాగంగా చెరువు కట్ట అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు తమ ఇష్టానుసారం చేస్తున్నారు. కట్ట నిర్మాణానికి నాసిరకం మట్టిని వినియోగిస్తున్నా ఎన్‌ఎస్పీ అధికారులు పట్టించుకోవడం లేదు. పనులు చేస్తున్న సమయంలో పర్యవేక్షించడం లేదు. చెరువు కట్ట అభివృద్ధికి ప్రభుత్వం రూ.9 లక్షలు కేటాయించింది. గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు చావా గోవిందయ్య పేరు మీద వర్క్‌ ఆర్డర్‌ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ పని చేయిస్తున్నది మాత్రం కరణం వర్గం నుంచి గొట్టిపాటి వర్గం వైపు వెళ్లిన పరిటాల వెంకయ్య, ఎంపీటీసీ భర్త పేరయ్య. కనీస ప్రమాణాలు పాటించకుండా, నాసిరకమైన మట్టిని వాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామానికి చెందిన కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పని విలువ రూ.9 లక్షలు కాగా రూ.4 లక్షలతో పూర్తి చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి.  

చేసిన పనికే మళ్లీ బిల్లులు
తర్లుపాడు: ఈ ఫోటోలో ఉన్నది తర్లుపాడు మండలం గొల్లపల్లె గ్రామ పరిధిలోని ఎర్రవాగు. వాటర్‌షెడ్‌ పనుల్లో భాగంగా ఈ వాగులో 2015–16లో దాదాపు 9 లక్షల రూపాయలతో నీటి కుంటలు ఏర్పాటు చేశారు. కాగా మళ్లీ అదే వాగులో, అదే ప్రాంతంలో 2016–17కు గాను నీరు–చెట్టు పథకంలో భాగంగా 6 లక్షల రూపాయలతో పనులు కేటాయించారు. ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న మండల టీడీపీ అధ్యక్షుడు వేశపోగు జాన్‌.. కాలువలో పైపై మెరుగులు దిద్ది బిల్లులు పొందాడు. 

ఒక్క వర్షానికే కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌
గిద్దలూరు: రాచర్ల మండలంలోని జే.పి.చెరువు గ్రామం బస్టాండ్‌ సమీపంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. ఈ చెక్‌డ్యామ్‌ పనులను టీడీపీ నాయకుడు ఎస్‌.పాండురంగారెడ్డి చేయించాడు. ప్రభుత్వం రూ.9.95 లక్షలు కేటాయించగా అందులో మూడో వంతు కూడా వినియోగించకుండా నాసిరకంగా పనులు చేపట్టారు. చెక్‌డ్యామ్‌ నిర్మించిన తర్వాత కురిసిన మొదటి వర్షానికే మట్టికట్టలు కొట్టుకుపోయాయి. దీంతో వర్షం నీరంతా వాగులో గుండా బయటకు వెళ్లిపోతోంది. వర్షం నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచేందుకు మంజూరు చేసిన పనులను అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిగా చేసి జేబులు నింపుకున్నారే తప్పా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేందుకు ఈ చెక్‌డ్యామ్‌ నిదర్శనం. 

అంబచెరువులో నిధులు స్వాహా.. 
కొనకనమిట్ల: నీరు–చెట్టు పథకంలో భాగంగా కొనకనమిట్ల అంబచెరువుతోపాటు చెరువులో మట్టి తీసి జెడ్పీ పాఠశాల ఆవరణ చదును చేసేందుకు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను కొనకనమిట్లకు చెందిన టీడీపీ నాయకులు కొండలు, కె.వెంకట కోటయ్య, శ్రీనివాసరెడ్డి చేపట్టారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చెరువు అభివృద్ధి జరగలేదని, నీరు–చెట్టు పనులు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా చేశారని గ్రామస్తులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. నాలుగు కాలాలపాటు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.   

జిల్లాలో అక్రమాల తీరు ఇదీ..

అ ఒంగోలు శివారులోని కొప్పోలు,  చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరు చెరువుల నుంచి రోజు వందల కొద్ది ట్రాక్టర్లు పెట్టి ట్రిప్పు మన్ను ’250 నుండి ’500 విక్రయించారు. అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ల వద్ద సైతం ట్రిప్పుకు 50 చొప్పున కమీషన్లు పుచ్చుకున్నారు. ఒంగోలు నగర వాసులు ఈ మట్టితో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్లు పూడ్చుకోవడం, స్థలం ఎత్తు పెంచుకునేందుకు ఉపయోగించుకుంటుండటంతో డిమాండ్‌ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకొని టీడీపీ నేతలు కాసులు దండుకుంటున్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని అక్కన్నవారి చెరువు, బుర్రవానికుంట, వలేటివారిపాలెం చెరువు, వరగమ్మ వాగు, ముదిగొండ వాగు, చిన్నచెరువులతోపాటు పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి.  
అ గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యాలవాడ, గడికోట, తిమ్మాపురం, సంజీవరాయునిపేట, దంతెరపల్లి, రాచర్ల ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి.  
అ యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువు మట్టిని రోడ్డు కోసం తోలుకుని నీరు–చెట్టు పనుల్లో బిల్లులు తెచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్న చెరువు, చేపలమడుగు, పెద్దచెరువు, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు చెరువుతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. 
అ అద్దంకి–నార్కెట్‌పల్లి దారిలో నీరు–చెట్టులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు అప్పుడే శిథిలావస్థకు చేరుకున్నాయి. జె.పంగులూరు మండలం చినమల్లవరం, అరికట్లవారిపాలెం ప్రాంతంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదవలేదు. 
అ దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం దోర్నపువాగు పరివాహక ప్రాంతం, తోటవెంగన్నపాలెం, రాజానగరం, కొర్రపాటివారిపాలెం, వీరన్నవాగుతోపాటు పలు ప్రాంతాల్లో నీరు
అ చెట్టు పనుల్లో టీడీపీ సానుభూతిపరులు అవినీతికి ద్వారాలు తెరిచారు. నియోజకవర్గంలోని కోమలకుంటచెరువు, ఎర్రచెరువు, తానంచింతం, అబ్బాయిపాలెం, చందలూరు చెరువు పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 
అ కందుకూరు నియోజకవర్గంలోని మోపాడు చెరువు, గుడ్లూరు నాయుడుపాలెం చెరువులతోపాటు నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. 
అ కనిగిరి పరిధిలోని దోమలేరు, గోకులం, జిల్లెళ్లపాడులతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో తెలుగు తమ్ముళ్లు అందినకాడికి దండుకున్నారు.
అ కొండపి పరిధిలోని టంగుటూరు మండలం కొణిజేడు, కొండపి చెరువుతోపాటు నియోజకవర్గంలో పలు చెరువులు, వాగుల్లో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అ మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం చెరువుతో పాటు కొనకనమిట్ల అంబచెరువు, పొదిలి ప్రాంతంలోని అన్నవరం, మల్లవరం, యేలూరు, కొచ్చెర్లకోటతోపాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి.
అ పర్చూరు పరిధిలోని దేవరపల్లి సూరాయకుంట, నూతలపాడులోని బూరాయికుంట, దగ్గుబాడు, నాయుడువారిపాలెం గ్రామాలతోపాటు పలు చెరువుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి.
అ సంతనూతలపాడు పరిధిలోని మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి ఎండోమెంట్‌ చెరువులో భారీగా మట్టిని తరలించి అక్రమాలకు పాల్పడ్డారు. దొడ్డవరప్పాడు, ముదిగొండ వాగు, జతివారికుంట, పాపాయి చెరువులతోపాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

పడమటి వాగుపై పూడిపోయిన చెక్‌డ్యామ్‌

2
2/5

పరిటాలవారిపాలెం చెరువు కట్టను చదును చేయిస్తున్న టీడీపీ నాయకులు

3
3/5

రెండుసార్లు పనులు చేసినట్టు చూపి బిల్లులు పొందిన గొల్లపల్లె వాగు

4
4/5

రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో ఒక్కసారి వర్షానికే కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌

5
5/5

పూర్తి స్థాయిలో అభివృద్ధి కాని కొనకనమిట్ల అంబచెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement