విజయనగరంలోని పెద్దచెరువు మదుము పనిలో గోనెసంచి
ఎన్నికల్లో విజయం సాధించాలంటే నోట్లే ప్రధానమని భావించారు. దానికోసం ఆదినుంచీ పునాదివేసుకుంటూ వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటునుంచీ ఏదోరకంగా డబ్డు కూడగట్టడమే పనిగా పెట్టుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందుకోసమే వినియోగించారు. నీరు–చెట్టు వారి ఆశలకు అనుగుణంగా మారింది. కోట్లు కొల్ల గొట్టేందుకు ఓ బృహత్తర అవకాశంగా కనిపించింది. అనుకున్నదే తడవుగా ఇక నాశిరకం పనులు చేసి చేతులు దులుపుకోవడం ఒక ఎత్తయితే... కొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు కొట్టేశారు. దీనిపై ఏర్పాటైన సామాజిక తనిఖీ బృందాలను సైతం మేనేజ్ చేశారు. అనుకున్నట్టుగా నిధులు దోచుకున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నీరు–చెట్టు పేరుజెప్పి జిల్లాలో కోట్ల రూపాయలను టీడీపీ ప్రజాప్రతినిధులు కాజేశారు. పనులు జరగకుండానే జరిగినట్టు బిల్లులు చేసుకున్నారు. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పనులు సృష్టించి నిధులు స్వాహా చేశారు. నాణ్యతనేది మచ్చుకైనా కనిపించకుండా చేసిన ఈ పనుల్లో చాలా వరకూ సగంలోనే నిలిపేశారు. చెరువుల్లో తవ్విన మట్టిని లోడుకింత అని రేటు కట్టి ప్రైవేటు అవసరాలకు అమ్ముకున్నారు. తమ బినామీలనే కాంట్రాక్టర్లుగా పెట్టి అందిన కాడికి దోచేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
రాష్ట్రమంత్రి ఇలాకాలో...
బొబ్బిలి నియోజకవర్గంలో నీరు చెట్టు పథకంలో సుమారు 104 చెరువులకు పైగా యంత్రాలతో తవ్వేసి ఒప్పందాలు చేసేసుకున్నారు. ఈ వ్యవహారంలో సుమా రు రూ. 40 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తె లు స్తోంది. పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీ పురం మండలంలో రూ.3కోట్లు సీతానగరం మండలంలో రూ.4.2కోట్లు, బలిజిపేట మండలంలో రూ.3.5 కోట్లతో చేపట్టిన పనులను తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జన్మభూమి కమిటీ సభ్యులే చేసుకున్నారు. కొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెల్లిమర్లలో నిధులు స్వాహా...
నెల్లిమర్ల నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపించింది. మండలంలో 2015–16లో రూ.20లక్షలు, 2017–18లో రూ1.2కోట్లతో పనులు చేపట్టగా సతివాడ, దన్నానపేట, వల్లూరు గ్రామాల్లో స్థానిక టీడీపీ నాయకులతో కుమ్మక్కై కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేశారని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో తీసిన మట్టిని లోడు రూ.400 నుంచి రూ.600లకు ఇటుకబట్టీల నిర్వాహుకులకు అమ్ముకున్నారు. 2018–19 సంవత్సరానికి రూ.70లక్షల విలువైన పనులను మంజూరు చేశారు.
గతేడాది మల్యాడ గ్రామానికి సమీపంలో రూ.25లక్షలతో నిర్మించిన చెక్‌డ్యామ్ పనులు నాసిరకంగా చేపట్టడంతో లీకులకు గురైంది. పూసపాటిరేగ మండలంలో చెరువులో తీసిన మట్టి నూతనగృహాల నిర్మాణాలతో పాటు వివిధ పనులకు వాడుకున్నారు. రెల్లివలస పంచా యతీ రామధేనువు చెరువులో పనులను అధికారపార్టీ నాయకులు చేసి మట్టిని ఇటుక బట్టీలు, రహదారులకు అమ్ముకున్నారు.
రియల్‌ఎస్టేట్‌కు అనుకూలంగా...
గజపతినగరం మండలంలోని లోగిశ రామసాగరం, బంగారమ్మపేట అప్పలగరం, పురిటిపెంట సుబ్బసాగరం కొత్తబగ్గాం సీతాఫలం, మధుపాడు తదితర చెరువుల్లో కోట్లాది రూపాయలతో చేపట్టిన పనుల్లో చెరువులోతు పెంచి గట్లను ఎత్తు చేయాల్సి ఉండగా టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ భూములకు ఒక్కో ట్రాక్టర్ రూ.200ల నుంచి రూ.300లకు అమ్మకొని లక్షలాది రూ పాయలు జేబులో వేసుకొన్నా రు. బొండపల్లి మండలం లోని కనిమొరక గంపవాని చెరువులోని మట్టితో స్థానిక టీడీపీ నాయకుడు తన పొలానికి రోడ్డు వేయించున్నారు. దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి వెంకన్న చెరువు, వింధ్యవాసి నర్సరాజు సాగరం, మరడాం బుచ్చన్న చెరువు, కోమటిపల్లి బారికివాని చెరువు, పెదమానాపురం మద్దలవాని చెరువుల్లో ఎమ్మెల్యే అనుచరులు కాంట్రాక్టర్లుగా వ్యవహరించి నిబంధనలకు నీళ్లొదిలి కోట్లాది రూపాయలు స్వాహా చేశారు.
మెంటాడలో మరీ దారుణం
సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలో 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో 106 పనులు మంజూరు చేయగా అందులో 25 చెరువు పనులు పూర్తి చేశారు. 30 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 51 పనులు పూర్తి చేయాల్సిఉంది. కానీ బిల్లులు మాత్రం కాజేశారని తెలుస్తోంది. 2017–18 లో పెదచామలాపల్లి ఎరకయ్య చెరువులో రూ.8 లక్షలతో మంజూరు చేయగా, కనీసం రూ.8 వేలు విలువైన పనులూ చేయలేదు. మక్కువ మండలంలో 125 చెరువులకు రూ.7.50కోట్లు మంజూరు కాగా శంబర గ్రామంలోని మిందివానిబంద, సవకబంద, ఏకలోడుబంద వద్ద జరిపిన చెరువు పనుల్లో నాణ్యత కొరవడంటంతో రక్షణగోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. శంబర గ్రామ సమీపంలో మిందివానిచెరువు పనులకు రూ. 5లక్షలు ఖర్చుచేసినట్టు చూపి బిల్లులు తీసుకున్నారు.
పెద్దచెరువులో నిధులు బుడుంగ్...
విజయనగరం పట్టణంలో కీలకమైన పెద్దచెరువు అభివృద్ధి కోసం నీరుచెట్టు పథకంలో చేపట్టిన పనుల్లో అక్రమంగా దోచేసుకున్నారు. మట్టి పనుల నిమిత్తం రూ.80లక్షలు, మదుముల కోసం రూ.80లక్షలు మంజూరు చేశారు. 2017–18లో మంజూరు చేసిన పనుల్లో మట్టి పనులు సగం వరకు జరగ్గా సిమెంట్ పనులు 25శాతం జరిగాయి. నిబంధనల ప్రకారం ఏదైనా చెరువుకు రూ.10లక్షలకు మించి పనులు చేపడితే టెండర్ల రూపంలో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలి. కానీ ఇక్కడ ఏకంగా రూ.1.60లక్షల పనులు జరిగినా నామినేషన్ పద్ధతిపై పనులు కేటాయించారు.
చీపురుపల్లి మండలంలో 2015 నుంచి 2018 వరకు 101 రకాల పనులకు సంబంధించి రూ.667.93 లక్షలు మంజూరు చేయగా 51 పనులు మాత్రమే జరిగాయని, ఇందుకు సంబందించి రూ.204.31లక్షలు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మండలంలోని కర్లాం పంచాయతీలో కొత్తచెరువు, మోదుగులచెరువు, పోలమ్మచెరువుల్లో పనులు జరిపారు. చేసిన చెరువుల్లోనే పనులు చేయటం, ఉపాధిహామీ పనులు జరిగిన చెరువులనే ఎంచుకుని కొత్తగా పనులు చేసినట్టు చూపి బిల్లులు చేయించుకున్నారన్న విమర్శలున్నాయి.
పనులు చేయకుండానే బిల్లులు
శృంగవరపుకోట మండలంలోని పోతనాపల్లి గ్రామంలో పందిరివాని చెరువులో వేలకొద్దీ క్యూబిక్‌మీటర్ల మట్టిని తవ్వించి ఇటుక బట్టీలు, లేఅవుట్లు, ఇళ్ల స్థలాలకు యథేచ్ఛగా అమ్ముకున్నారు. చెరువులో కళింగలపై సిమెంట్ పూతపూసి, మమ అనిపించారు. పోతనాపల్లి గ్రామంలో మద్దిగెడ్డపై చెక్‌డ్యామ్ పనులు నేటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. వేపాడ మండలం కొండగంగుబూడిలో అడ్డుకొండనుంచి ఇసుకగెడ్డ పారే కాలువవద్ద వైఎస్ హయాంలో నిర్మించిన చెక్‌డామ్‌కు ప్లాస్టింగ్‌చేసి బిల్లులు స్వాహా చేశారు. జామి మండలం శాసనాపల్లి – సోమయాజులపాలెం మధ్య ఉన్న గెడ్డపై అవసరం లేకున్నా రూ.7లక్షలతో చెక్‌డ్యాం అరకొరగా నిర్మించి బిల్లు మింగేశారు. కురుపాం నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో నీరు చెట్టు పేరుతో సుమారు రూ.8.17 కోట్లను టీడీపీ నేతలు, కార్యకర్తలకే ధారపోశారు. అవసరం లేని చోట్ల తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment