నర్సాపూర్, న్యూస్‌లైన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందని ద్రాక్షగానే మారింది. పలు పీహెచ్‌సీలో వైద్యుల కొరత కారణంగా... మరికొన్ని కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఉన్నా వారి నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు అందడం లేదు. పీహెచ్‌సీలు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు అవుట్ పేషెంట్లకు వైద్యం అందించాలి. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య వైద్య సేవలు ఆరంభమై మధ్యాహ్నం 2 గంటలలోపు ముగిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత వెళ్తే చాలా పీహెచ్‌సీలకు తాళాలే దర్శనమిస్తున్నాయి. సెలవు రోజుల్లోనూ తెరుస్తారో లేదో తెలియని పరిస్థితి. నియోజక వర్గంలోని చాలా పీహెచ్‌సీలలో పనిచేసే వైద్యులు స్థానికంగా ఉండకపోవడమే గాక సమయ పాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. వైద్యం కోసం ఎంతో ఆశతో వచ్చే పేదలు పీహెచ్‌సీల దుస్థితిని చూసి వెనుదిరుగుతున్నారు. నర్సాపూర్‌లో ఉంటూ పీహెచ్‌సీలను పర్యవేక్షించాల్సిన అధికారి సైతం స్థానికంగా ఉండకపోవడం గమనార్హం.
నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండగా ఒకరు సెలవుల్లో వెళ్లగా మరొకరు వారానికి మూడు రోజులు దౌల్తాబాద్ పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారు. ఆ డాక్టర్ వెళ్లే మూడురోజులు రెడ్డిపల్లి పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంలే వైద్యం చేస్తారు.
దౌల్తాబాద్ పీహెచ్‌సీలో వారంలో మూడు రోజులు పోను మిగతా రోజులు సిబ్బందే వైద్యమందిస్తుంటారు. రెడ్డిపల్లి పీహెచ్‌సీకి పక్కా భవనం ఉన్నా అక్కడ డెలివరీలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
హత్నూరలో 24 గంటల పీహెచ్‌సీలో డాక్టరు లేకపోవడంతో సీనియర్ నర్సు వైద్యం చేస్తున్నారు.
కొల్చారం, రంగంపేట పీహెచ్‌సీలలో వైద్యులు ఒక్కొక్కరు మాత్రమే ఉండడంతో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. డెలివరీ కోసం కొల్చారం వస్తే మెదక్‌కు పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. రంగంపేటలో సాయంత్రమైతే వైద్యసేవలకు బ్రేకు పడుతుంది.
కౌడిపల్లిలో 24 గంటల పీహెచ్‌సీ ఉన్నా రాత్రిపూట ఇద్దరు డాక్టర్లు ఉండకపోవడంతో ఏఎన్‌ఎంలే వైద్య సేవలందిస్తున్నారు.
వెల్దుర్తిలో ఇద్దరు వైద్యులున్నా వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ సెలవు రోజుల్లో పీహెచ్‌సీని తెరుస్తారో, తెరువరో తెలియని పరిస్థితి.
శివ్వంపేటలో ఒకే డాక్టరు ఉండడంతో డెలివరీలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల జోలికి వెళ్లడం లేదు.
సర్కార్ వైద్యం అరకొరే..
Published Sat, Nov 2 2013 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement