బడ్జెట్‌లో ఘనంగా రూ.4,028 కోట్లు చూపించినా... ఇచ్చింది రూ.2,068 కోట్లే
కుల సమాఖ్యలు, కార్పొరేషన్ కింద రూపాయి ఖర్చు లేదు
రాజీవ్ అభ్యుదయ యోజనా లేదు...
వివాహ ప్రోత్సాహకాలు లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలంటే ఫీజులు, హాస్టళ్లేనా? ఫీజుల పథకం కింద స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్ ఫీజులిచ్చి, ప్రభుత్వ హాస్టళ్లలో బీసీ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తే వెనుకబడిన వర్గాలన్నీ అభివృద్ధి చెందినట్లేనా? సర్కారు వారి బడ్జెట్ ఖర్చును పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఫీజులు, హాస్టళ్లకంటే బీసీల పట్ల ప్రభుత్వ ప్రాధాన్యతలేమీ లేవని అర్థమవుతోంది. ఈ ఏడాది (2013-14) బడ్జెట్ కింద బీసీల సంక్షేమానికి రూ.4,028 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.2,068 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చింది. అందులో ఫీజులు, హాస్టళ్లు, గురుకులాల కోసమే రూ.1,800 కోట్లకు పైగా ఉన్నాయి.
కుల సమాఖ్యల ఎదురుచూపులు: బడ్జెట్‌లో ఒక్కో కుల సమాఖ్యకు రూ.15 నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయింపులు చూపెట్టినా... ఈ సమాఖ్యల కింద రిజిస్టర్ చేసుకున్న ఒక్క సొసైటీకి కూడా ఆర్థిక సాయం లేదు. అదేమని ప్రశ్నిస్తే... ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మహిళలు, వికలాంగులు, మైనార్టీలందరికీ కలిపి ప్రభుత్వం ఒక కొత్త పథకం రూపొందిస్తోందని, దాని సబ్సిడీ విధానం ఖరారయ్యేంతవరకు నిధులివ్వబోమని అధికారులు చెపుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం వేలాదిమంది నిరుద్యోగులు బ్యాంకులను ఎలాగోలా ఒప్పించుకుని కనీసం గతంలో ఇచ్చే రూ.30వేల సబ్సిడీతోనైనా రుణం అందకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని బీసీలకు ఆర్థిక సాయం చేకూర్చే రాజీవ్ అభ్యుదయ యోజన పరిస్థితి కూడా అంతే. బీసీ కార్పొరేషన్ కింద చేపట్టాల్సిన ఇతర ఆర్థిక సాయం కార్యక్రమాలకు కూడా చిల్లిగవ్వ ఖర్చుచేయలేదు. మరోవైపు ఇతర కులాల వారిని వివాహం చేసుకుంటే ఇచ్చే వివాహ ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో రూ.5.2 కోట్లు చూపెట్టినప్పటికీ ఒక్క రూపాయి కూడా బీసీ శాఖకు ఇవ్వలేదు. అడ్వకేట్ల స్టయిపెండ్, కమ్యూనిటీ సర్వీసులకు కూడా నయాపైసా ఇవ్వకుండా రిక్తహస్తాన్ని చూపెట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
కేంద్రం ఇచ్చినా...: ఈ ఏడాది బడ్జెట్ అంచనాల ప్రకారం హాస్టల్ భవనాల నిర్మాణంతో పాటు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం కేంద్రం రూ.132 కోట్లు ఇవ్వగా, అందులో కేవలం 18.76 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చారు. ఇక, కేంద్రం ఇచ్చే నిధులు మ్యాచింగ్‌షేర్‌గా రాష్ట్రం ఇవ్వాల్సిన రూ. 33 కోట్లకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడునెలలే సమయముంది. ఇందులో వచ్చేది ఒక త్రైమాసికం బడ్జెట్టే. ఈ బడ్జెట్ కింద రూ.2వేల కోట్లు ఇస్తే కానీ బడ్జెట్‌లో చూపెట్టిన మొత్తం బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చినట్లు. మళ్లీ అందులో కూడా వచ్చే మూడు నెలల్లో ఆ మొత్తాన్ని బీసీ సంక్షేమ శాఖ ఖర్చుపెట్టాలి. ఈ నేపథ్యంలో అసలు మిగిలిన మొత్తంలో బీసీలకు ప్రభుత్వం ఎంత ఇస్తుంది... బీసీ సంక్షేమ శాఖ ఎంత ఖర్చు చేస్తుందన్నది ప్రశ్నార్థకమే.
సబ్‌ప్లాన్ పెడతారట...: ప్రణాళిక నిధులనే ఖర్చు పెట్టకుండా, బడ్జెట్‌లో చూపెట్టిన నిధులను కనీసం బీసీ శాఖకు కూడా ఇవ్వకుండా బీసీలపై సవతితల్లి ప్రేమను చూపుతున్న ప్రభుత్వ పెద్దలు... ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీల కోసం కూడా సబ్‌ప్లాన్‌ను పెడతామని చెపుతున్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌పై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని కొందరు మంత్రులు చెబుతుండగా, సీఎం మాత్రం బీసీలకు సబ్‌ప్లాన్ పెడితే బీసీలే నష్టపోతారని, అలా కాకుండా ఏం చేస్తే బీసీలు లాభపడతారో, ఆర్థికంగా వృద్ధి చెందుతారో ఆ కార్యక్రమాలను చేపడతామని చెప్పుకొస్తున్నారు.
వివిధ పథకాల కోసం ఈ ఏడాది డిసెంబర్ 10 వరకు బీసీ సంక్షేమ శాఖకు ఆర్థిక శాఖ మంజూరు చేసిన నిధులు |
|||
పథకం |
బడ్జెట్ అంచనా |
బీఆర్వోలు |
బీసీ శాఖకిచ్చింది (రూ. కోట్లలో) |
గురుకులం | 65.5 | 65.5 | 49 |
రుణాల చెల్లింపు | 3.26 | 3.26 | 0 |
హాస్టళ్లు | 403 | 188 | 151 |
అడ్వకేట్లకు సబ్సిడీ | 20 | 10 | 5 |
స్టడీసర్కిల్స్ | 25 | 18.75 | 12.5 |
కళాశాల హాస్టళ్లు | 116 | 105 | 33 |
కమ్యూనిటీ సర్వీసులు | 50 | 25 | 0 |
కుల సమాఖ్యలు | 140 | 140 | 50 |
బీసీ కార్పొరేషన్ | 206 | 154 | 103 |
వివాహ ప్రోత్సాహకాలు | 5.2 | 5.2 | 0 |
రాజీవ్ అభ్యుదయ యోజన | 69 | 52 | 0 |
ట్యూషన్ ఫీజు (బీసీ) | 1169 | 1748 | 795 |
ట్యూషన్ ఫీజు (ఈబీసీ) | 600 | 1052 | 508 |
స్కాలర్‌షిప్ | 816 | 527 | 257 |
(ఇందులో బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చిన మొత్తం కూడా ఖర్చయ్యే అవకాశం లేదు. అందులో మరికొంత మిగిలే అవకాశం ఉంది. కుల సమాఖ్యలు, బీసీ ఆర్థిక కార్పొరేషన్‌కిచ్చిన రూ.150 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ) |