నెల్లూరు పెద్దాస్పత్రి దీనస్థితి | nellore hospital in shortage in medicine | Sakshi
Sakshi News home page

నెల్లూరు పెద్దాస్పత్రి దీనస్థితి

Published Thu, Jun 30 2016 8:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

నెల్లూరు పెద్దాస్పత్రి దీనస్థితి

నెల్లూరు పెద్దాస్పత్రి దీనస్థితి

రోగులకు మందుల్లేవ్!
ఆవేదన వ్యక్తం చేస్తున్న రోగులు

 
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి పరిస్థితి. వైద్య కళాశాల ఏర్పడ్డాక ఇక్కడ మెరుగైన సేవలందుతాయని ఆశించిన పేదలకు నిరాశే ఎదురవుతోంది. అన్ని రకాల మందులు దొరుకుతాయని భావించిన వారికి అత్యవసర మందులు సైతం లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. రకరకాల మందులు బయటే కొనుగోలు చేయాల్సి రావడంతో దిక్కులు చూడాల్సి వస్తోంది.
 

 
నెల్లూరు(అర్బన్): ప్రజల చిరకాల వాంఛ నెల్లూ రు ప్రభుత్వ వైద్య కళాశాల. ఈ కళాశాల ఏర్పడ్డాక చిన్నపిల్లల ఆస్పత్రితో పాటు జూబ్లీ ప్రసూతి, టీబీ ఆస్పత్రులను పెద్దాస్పత్రిలో విలీ నం చేశారు. 750 పడకలుగా స్థాయి పెంచారు. పెద్ద సంఖ్యలో రోగులు పెరిగారు. ప్రతిరోజూ  దాదాపు 900 నుంచి 1200 వరకు ఓపీ ఉంటుంది. అయితే వీరికి తగిన స్థాయిలో పలురకాల మందులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. ఒక రోజు ఉన్న మందులు రెండో రోజు ఉండటం లేదు. దీంతో రోగులు  తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. మహిళలు, రక్తహీనత ఉన్న వారికి  ఐరన్ మాత్రలు తప్పనిసరి.  ప్రధా న మందుల షాపులో అసలు లేవు. అక్కడకు మందుల చీటీలు తెచ్చిన వారిని బయట కొనుక్కోమంటున్నారు. ప్రసూతి వార్డులో కూడా ఇవి  ఖాళీ అయితే కొద్ది మేరకు మాత్రమే మళ్లీ ఏర్పాటు చేశారు. పాంటప్రజోల్ మాత్రలు తెచ్చామని సూపరింటెండెంట్ ఈనెల 28న తెలిపారు. 29న ప్రధాన మందులషాపు వద్దకు వెళ్లి అడిగితే అయిపోయాయని ఫార్మాసిస్టు చెప్పారు.


సేవలు అంతంత మాత్రమే
మందుల సంగతి అటుంచితే సేవలు కూడా అంతంత మాత్రంగానే అందిస్తూ రోగుల సహనాన్ని డాక్టర్లు పరీక్షిస్తున్నారు. సోమవారం సహజంగానే ఓపీలన్నీ రద్దీగా ఉంటాయి. ఈనెల 20న  ఉదయం నుంచి ఎంసీహెచ్‌లో ప్రతి గది వద్ద  పెద్దఎత్తున మహిళా రోగులు, గర్భిణులు నిండి పోయారు. అయితే సూపరింటెండెంట్ ఎంసీహెచ్ డాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోపు రోగులు నర్సులతో గొడవ పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఉదయం 11.00 గంటలకు వచ్చిన డాక్టర్లు హడావుడిగా రోగులను పరీక్షించారు. ఈ నెల 27 సోమవారం స్కానింగ్ చేసేదానికి డాక్టరమ్మ రాలేదు. దీంతో తమ బిడ్డల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆశతో వచ్చిన గర్భిణులు ఎదురు చూసీ చూసీ స్కానింగ్ చేయించుకోకుండానే నిరాశతో వెనుదిరిగిపోయారు.


రోగుల చీటీలో మందుల వివరాలు రాయని డాక్టర్లు
డాక్టర్లు మందులు రాసేటప్పుడు మెడికల్ షాపునకు ఒక చీటి, రోగుల కోసం ఓపీ చీటీ ఇస్తారు. ఓపీ చీటీలో మందుల వివరాలుండాలి. అందుకు విరుద్ధంగా కొంతమంది డాక్టర్లు మెడికల్ షాపునకు అందచేసే చీటీలోనే మందులు రాస్తున్నారు. వీటిని ఫార్మాసిస్టులు తీసుకుని భద్రపరచాలి. రోగులకు ఇచ్చే చీటీల్లో మందుల గురించి రాయడం లేదు. దీంతో షాపులో లేని మందుల గురించి రోగులకు ఏ చీటీలో రాయాలో ఫార్మాసిస్టులకు అర్థం కావడంలేదు.
 
కొరతలేకుండా చూస్తాం
మందుల కొరత ఎందుకు ఉందో విచారిస్తాం. కొరత ఉన్నవాటిని వెంటనే ఏర్పాటు చేసేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ భారతితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. చాట్ల నరసింహారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్
 
లోకల్ పర్చేజికి ఆర్డర్ పెట్టాం
కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే లోకల్‌గా కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టాం. త్వరలోనే వస్తాయి. డాక్టర్ భారతి, సూపరింటెండెంట్.
 
షుగర్ మందు లేదన్నారు
నాకు షుగర్‌కి చెందిన రెండు రకాలు మందులు రాశారు. అయితే  గ్లిమిప్రైడ్ అనే షుగర్ మందు లేదని బయట కొనుక్కోమన్నారు.  చీటీని మందుల షాపులో తీసుకున్నారు. నా ఓపీ చీటిలో మందుల వివరాలు రాసివ్వలేదు. బయట కొనుక్కోమన్న మందును చీటిలో రాసివ్వకపోతే నేనెలా కొనుక్కోగలను. - సుబ్బరత్నమ్మ, బాలాజీనగర్
 
12 గంటలకే ఓపీ చీటీలు ఆపేశారు
12 గంటలకే ఓపీ చీటీలు ఆపేశారు. బతిమిలాడుకున్నా చీటీ రాయలేదు. నర్సులు ఎమర్జెన్సీ వార్డుకెళ్లి రాయిం చుకోమన్నారు. అడుక్కున్నా అక్కడా రాయలేదు. తెలిసిన వ్యక్తి వస్తే చివరికి ఎలాగోలా ఎమర్జెన్సీలో ఓపీ చీటి రాసి మందులు రాసిచ్చారు. అందులో కూడా పాంటప్రజోల్ మాత్ర లేదు బయట కొనుక్కోమన్నారు.    -జి.వెంకటయ్య, వీరంపల్లి
 
 అందుబాటులో లేని కొన్ని మందులు
 
1.  డెరిఫిలిన్ ఇంజక్షన్  
     (ఆయాసంతో వచ్చిన వారికి అత్యవసరం)
2.  హైడ్రోకార్టిజోన్ ఇంజక్షన్
     (రియాక్షన్, ఇతర సమస్యలకు)
3. అమికాసిన్ (గాయాలైనప్పుడు గాని,
     చిన్నపిల్లలకు గాని యాంటిబయాటిక్)
4.   మెట్రోజిల్ ఇంజక్షన్
     (విరేచనాలు, అమీబియాసిస్ లాంటి వ్యాధులకు)
5  ఎకోస్ప్రిన్ (గుండెనొప్పి వస్తే
     అత్యవసరంగా వేసుకోవాల్సిన టాబ్లెట్)
6.  ర్యాన్‌టిడిన్ (యాంటిబయాటిక్, నొప్పుల మాత్రలు రాస్తే కడుపులో మంటరాకుండా ఉండేందుకు ఇది తప్పనిసరి)
7.  మెగ్నీషియం సల్ఫేట్ ఇంజక్షన్
     (బీపీతో ఉన్న గర్భిణులకు తప్పనిసరి)
8. బ్లడ్ సెట్ (రక్తం ఎక్కించేందుకు పైపు. రోగులు
     బయట రూ.150 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు)
9. యాంటి-డి (మదర్ పాజిటివ్ ఉండి, బేబీ నెగెటివ్ ఉంటే ఈ ఇంజక్షన్ తప్పని సరి. రూ.2వేల వరకు ఖరీదుంటుంది)
10. ఇన్సులిన్ ఇంజక్షన్
     ( షుగర్ వ్యాధి కంట్రోల్ కాని వారికి అత్యవసరం)
 11. ఐరన్ టాబ్లెట్లు (ప్రసూతి వార్డులో మాత్రమే ఉన్నాయి. మిగతా చోట్ల అందుబాటులో లేవు)
 12. ఫోలిక్ యాసిడ్ (అండంలో బిడ్డ పెరుగుదలకు తప్పనిసరి. ఇవి కూడా లేవు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement