సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించడం కోసం జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీలు, సకలజనులు చేస్తున్న ఉద్యమాలు రోజు రోజుకూ ఉధృత మవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 12వ రోజు ఉద్యమకారులు రోడ్లపై వంటా వార్పులతో పాటు ర్యాలీలు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
విభజన నిర్ణయం ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాలను కొనసాగించేందుకు వివిధ సంఘాల జేఏసీ నాయకులు ప్రణాళికల సిద్ధంకు నడుంబిగించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సమాయత్తమైయ్యారు. ఆదివారం నెల్లూరులో సమావేశమైన 13 జిల్లాల పరిధిలోని 14 యూనివర్సిటీల విద్యార్థి సంఘాల జేఏసీ, సమైక్యాంధ్ర ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు కార్యాచరణ రూపొందించాయి.
కావలి పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనదీక్షతో నిరసన తెలిపారు. జేఏసీ నేతలకు వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మౌన ప్రదర్శనను నిర్వహించారు.
సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాకోర్టును నిర్వహించారు. సోనియాకు దేశబహిష్కరణ, కేసీఆర్‌కు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు. నెల్లూరు నగరంలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. వినూత్నంగా బల్ల తయారు చేశారు.
అనంతరం గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత మార్కెట్‌లోని వ్యాపారులంతా మార్కెట్‌కు తాళాలు వేశారు. అనంతరం రోడ్డుపైనే వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఉదయగిరి పట్టణంలో ఎన్‌ఏఎంయూ సంఘానికి ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సాయంత్రం బస్టాండు సమీపంలో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో గ్రామస్తులు, విద్యార్థులు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోవూరులో ఎన్‌జీఓ హోంలో ఆర్యవైశ్య నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేటలో టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని చెదరగొట్టారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు తెలుగుతల్లి వేషధారణతో ప్రదర్శన నిర్వహించారు.
ఉవ్వెత్తున ఉద్యమం
Published Mon, Aug 12 2013 5:33 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement