ఏమైందో ఏమో
- నవదంపతుల అనుమానాస్పద మృతి
- పెళ్లయిన 9 నెలలకే నిండిన నూరేళ్లు
- కొత్తపట్నం మండలం రాజుపాలెంలో ఘటన..
కొత్తపట్నం : మండలంలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నవదంపతులు గురువారం వేకువ జామున అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒంగోలు నుంచి బుధవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్న వీరు తెల్లవారేసరికి మృతదేహలై కనపడటంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో కూడా పరిసర ప్రాంతాల వారికి అంతుపట్టడం లేదు. గ్రామానికి చెందిన లింగంగుంట బలరాం (25) ఒంగోలు మంగమూరురోడ్డుకు చెందిన నాగూరి మేరి (22)ని 9 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు.
అప్పటి నుంచి గ్రామంలో ఉండటం లేదు. బలరాం తండ్రి అంజయ్య, తల్లి లక్ష్మీకాంతమ్మలు రాజుపాలెంలోనే ఉంటున్నా వారు వేరుగా ఉంటున్నారు. రాజుపాలెంలో సొంతిల్లు ఉన్నా బేల్దారి పనుల కోసం బలరాం తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. ఆ సమయంలో భార్య మేరిని ఆమె పుట్టింట్లో వదిలి వెళ్తుంటాడు. యథావిధిగా మంగళవారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి భార్య మేరిని తీసుకొని సాయంత్రం 3 గంటలకల్లా స్వగ్రామం రాజుపాలెం చేరుకున్నాడు. బంధువులు, తల్లిదండ్రులతో రాత్రి పడుకునే వరకు కూడా సరదాగానే గడిపారు.
మరుసటి రోజు పొద్దుపోయినా బయటకు రాకపోవడంతో కొందరు ఇంట్లోకి తొంగి చూశారు. ఇద్దరూ ఉరేకి వేలాడుతూ కనిపించారు. మృతదేహాలను స్థానికులు కిందకు దించారు. సమాచారం అందుకున్న ఒంగోలు టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ, కొత్తపట్నం ఎస్సై బి.నరసింహారావులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి ఆనవాళ్లను చేరిపే ప్రయత్నం చేస్తున్న బంధువులను అడ్డుకున్నారు.
నవ దంపతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీప బంధువులు, స్నేహితుల కథనం ప్రకారం ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. పెళ్లయి 9 నెలలుకావడం.. గ్రామంలో సొంత ఇల్లు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు చనిపోయేంతగా వచ్చాయా.. అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం సమస్యలు, దంపతుల మధ్య మనస్పర్థలు పొడచూపాయా అన్న దానిపైనా పోలీసులు విచారిస్తున్నారు. తహశీల్దార్ కె.రవిబాబు, వీఆర్‌వో కృష్ణకిషోర్‌బాబులు వచ్చి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు