Kottapatnam
-
మన తీరం.. విదేశీ బంధం..
సాక్షి, హైదరాబాద్: నెల్లూరులోని కొత్తపట్నం.. ప్రస్తుతం చేపలు పట్టేవారితో కూడిన ఓ చిన్న గ్రామం. కానీ ఒకప్పుడు ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించిన నౌకాశ్రయం. ఇటీవలే పరిశోధకులు దీని గుట్టు తేల్చారు. క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 16వ శతాబ్దం వరకు భారీ విదేశీ నౌకల లంగరుతో ఈ పోర్టు బిజీగా ఉండేదని గుర్తించారు. ఎన్నో దేశాలతో భారతదేశానికి ఉన్న వాణిజ్యంలో ఈ నౌకాశ్రయం కీలకంగా వ్యవహరించేదని చెబుతున్నారు. అయితే ప్రకృతి విపత్తులు, భౌగోళిక మార్పులతో ఇది నామరూపాల్లేకుండా పోయింది. ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించిన పరిశోధకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె.పుల్లారావు ఒకరు. ఇప్పుడు ఆయన మరోసారి ఈ పోర్టుకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు సమాయత్తం అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తీరం వెంట సముద్రమార్గం ద్వారా జరిగిన విదేశీ వాణిజ్యం, ఆయా దేశాలతో సంబంధాలు, సాంస్కృతిక మైత్రీ తదితర అంశాలపై ఆయన ఆధ్వర్యంలోని బృందం విస్తృత పరిశోధనలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ బృహత్తర పరిశోధన శనివారం నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో.. భారతదేశం తన సువిశాల సముద్ర తీరంతో అనాదిగా ప్రపంచదేశాలతో వాణిజ్యం నిర్వహిస్తోంది. వేల ఏళ్లుగా సాగిన ఈ వాణిజ్యంతో ఆర్థికపరంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా ఆయా దేశాలతో మైత్రి ఏర్పడింది. ఇక్కడి కొన్ని సాంస్కృతిక అంశాలను ఆయా దేశాలు తమలో కలుపుకోగా, విదేశీ సంప్రదాయాలు కొన్ని మనలో మమేకమయ్యాయి. క్రీస్తు పూర్వం నుంచి ఈ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. అలాంటి ప్రత్యేకతలను వెలికి తీయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో బృహత్తర పరిశోధన ప్రారంభించింది. ఇది కొత్తపట్నంలో అంతరించిన పోర్టు వద్ద లభించిన 14వ శతాబ్దం నాటి చైనా మింగ్ వంశం చక్రవర్తి టైజాంగ్ జారీ చేసిన నాణెం కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌తో సముద్రతీరాన్ని పంచుకుంటున్న 39 దేశాలతో తిరిగి వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంతో పాటు, ఆయా దేశాల ఆర్థిక సాంస్కృతిక వైవిధ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మైత్రీ పటిష్టం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా తీరం వెంట ఉన్న చారిత్రక, పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతాలు, అలనాటి నౌకాశ్రయాలున్న చోట పరిశోధనలు జరుపుతారు. గతంలో జరిగిన పరిశోధనల్లో వెలుగు చూసిన అంశాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇతర దేశాల తీర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వెలుగు చూసిన ఈ తరహా పరిశోధన వివరాలపై అధ్యయనం చేస్తారు. అలా మన దేశంలో తీర ప్రాంతమున్న రాష్ట్రాలకు ప్రత్యేక నిపుణులను కేటాయించారు. తమిళనాడు, కేరళ, ఒడిశా, బెంగాల్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిశోధన మొదలుకానుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలో శనివారం నుంచి నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ఈ అన్వేషణ ప్రారంభం కానుంది. 70 అంశాలను పరిశీలిస్తాం కె.పుల్లారావు ‘క్రీస్తు పూర్వం నుంచి మనదేశం ఇతర దేశాలతో సముద్ర వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక మైత్రి నెరుపు తోంది. దాన్ని ఇప్పుడు బలోపేతం చేయాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే ప్రాజెక్టు మౌసమ్లో మేం 70 రకాల అంశాలను పరిశీలిస్తాం. తొలి విడత పరిశోధన నెల్లూరు జిల్లా కొత్తపట్నం పురాతన పోర్టు ఉన్న ప్రాంతంలో మొదలవుతుంది. చారిత్రక, మానవ మనుగడ, ఆర్థిక పరిస్థితులే కాకుండా వృక్ష, జంతు జీవ వైవిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ -
ఆయన నిర్వాకంతోనే రాష్ట్రం దివాలా..
సాక్షి, కొత్తపట్నం: చదువుకు పేదరికం అడ్డు కాకూడదని.. పేదల బిడ్డలు ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంగ్లీష్ బోధనను దురుద్దేశం తోనే ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. గురువారం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్ హైస్కూల్లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని..విద్యార్థుల తల్లులకు అమ్మఒడి చెక్కులను అందజేశారు. మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి చిన్నారుల తల్లులు పాలాభిషేకం చేశారు. బాలినేని మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రం దివాలా తీసిందని.. అయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. కొత్తపట్నం మండలంలో త్వరలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని కందుకూరులో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘జగనన్న అమ్మఒడి పథకాన్ని’ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ కంటి వెలుగు పథకం’ ద్వారా విద్యార్థులకు కంటి అద్దాలను ఆయన పంపిణీ చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి మద్దతుగా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాల ఓరియంటల్ యూపీ పాఠశాలలో ‘అమ్మఒడి’ పథకాన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎం. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మఒడి పథకాన్ని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చుండూరు రవి, మండవ అప్పారావు, ఏఎంసీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా) (చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’) -
ఏమైందో ఏమో
- నవదంపతుల అనుమానాస్పద మృతి - పెళ్లయిన 9 నెలలకే నిండిన నూరేళ్లు - కొత్తపట్నం మండలం రాజుపాలెంలో ఘటన.. కొత్తపట్నం : మండలంలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నవదంపతులు గురువారం వేకువ జామున అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒంగోలు నుంచి బుధవారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్న వీరు తెల్లవారేసరికి మృతదేహలై కనపడటంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో కూడా పరిసర ప్రాంతాల వారికి అంతుపట్టడం లేదు. గ్రామానికి చెందిన లింగంగుంట బలరాం (25) ఒంగోలు మంగమూరురోడ్డుకు చెందిన నాగూరి మేరి (22)ని 9 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గ్రామంలో ఉండటం లేదు. బలరాం తండ్రి అంజయ్య, తల్లి లక్ష్మీకాంతమ్మలు రాజుపాలెంలోనే ఉంటున్నా వారు వేరుగా ఉంటున్నారు. రాజుపాలెంలో సొంతిల్లు ఉన్నా బేల్దారి పనుల కోసం బలరాం తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. ఆ సమయంలో భార్య మేరిని ఆమె పుట్టింట్లో వదిలి వెళ్తుంటాడు. యథావిధిగా మంగళవారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి భార్య మేరిని తీసుకొని సాయంత్రం 3 గంటలకల్లా స్వగ్రామం రాజుపాలెం చేరుకున్నాడు. బంధువులు, తల్లిదండ్రులతో రాత్రి పడుకునే వరకు కూడా సరదాగానే గడిపారు. మరుసటి రోజు పొద్దుపోయినా బయటకు రాకపోవడంతో కొందరు ఇంట్లోకి తొంగి చూశారు. ఇద్దరూ ఉరేకి వేలాడుతూ కనిపించారు. మృతదేహాలను స్థానికులు కిందకు దించారు. సమాచారం అందుకున్న ఒంగోలు టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణ, కొత్తపట్నం ఎస్సై బి.నరసింహారావులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి ఆనవాళ్లను చేరిపే ప్రయత్నం చేస్తున్న బంధువులను అడ్డుకున్నారు. నవ దంపతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీప బంధువులు, స్నేహితుల కథనం ప్రకారం ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. పెళ్లయి 9 నెలలుకావడం.. గ్రామంలో సొంత ఇల్లు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు చనిపోయేంతగా వచ్చాయా.. అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం సమస్యలు, దంపతుల మధ్య మనస్పర్థలు పొడచూపాయా అన్న దానిపైనా పోలీసులు విచారిస్తున్నారు. తహశీల్దార్ కె.రవిబాబు, వీఆర్వో కృష్ణకిషోర్బాబులు వచ్చి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు -
పొంచి ఉన్న ఫైలిన్ తుఫాన్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫైలిన్ తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మండలాల వారీగా ప్రభావిత గ్రామాల వివరాలు సేకరించింది. సముద్రం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. శుక్ర, శనివారాల్లో ఫైలిన్ తుఫాన్ ప్రభావం ఉండవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీర ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీర ప్రాంతంలోని పదకొండు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించింది. జిల్లాలోని ఒంగోలు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, గుడ్లూరు, చీరాల, చినగంజాం, సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, వేటపాలెం, జరుగుమల్లి మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న 79 హ్యాబిటేషన్లపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 17.1 మిల్లీమీటర్ల సగటు వర్షం నమోదైంది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ప్రకటించడం, మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉండటంతో ఎక్కడ కుండపోత వర్షం కురుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బోట్లు, బియ్యం సిద్ధం తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో పరిస్థితులను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత మండలానికి ఒకటి చొప్పున బోట్లను సిద్ధం చేసింది. ఎవరైనా నీటిలో కొట్టుకుపోతే ఆదుకునేందుకు ఈతగాళ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు వారిని సిద్ధం చేసింది. బియ్యం, ఇతర నిత్యావసరాలు నిల్వ చేసింది. చీరాల నుంచి గుడ్లూరు వరకు ఐదారు పెట్రోలు బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసే పనిలో నిమగ్నమైంది. వైద్య బృందాలను, అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేసింది. అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది. నాలుగైదు రోజుల్లో ప్రసవించే గర్భిణుల వివరాలు సేకరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. వారిని ముందుగానే వైద్యశాలలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఉధృతంగా గుండ్లకమ్మ గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీటి ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 4,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 4,400 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే రెండు గేట్లను ఎత్తివేశారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే మరో గేట్ ఎత్తివేసే అవకాశం ఉంది. మూడో గేట్‌ను కూడా ఎత్తివేస్తే ప్రాజెక్టు పరిధిలోని గుండ్లాపల్లి, అన్నంగి, మల్లవరం, నేలటూరు, ఏడుగుండ్లపాడు, వెల్లంపల్లి గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు - చదలవాడ చప్టాకు దగ్గరగా నీరు ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేట్ ఎత్తివేస్తే చప్టాపై నీరు ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి ఫైలిన్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి తుఫాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బియ్యం, పప్పు, పామాయిల్ నూనె, కిరోసిన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, సీపీఓ వెంకయ్యతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.