పొంచి ఉన్న ఫైలిన్ తుఫాన్
Published Fri, Oct 11 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫైలిన్ తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మండలాల వారీగా ప్రభావిత గ్రామాల వివరాలు సేకరించింది. సముద్రం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. శుక్ర, శనివారాల్లో ఫైలిన్ తుఫాన్ ప్రభావం ఉండవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీర ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీర ప్రాంతంలోని పదకొండు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించింది.
జిల్లాలోని ఒంగోలు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, గుడ్లూరు, చీరాల, చినగంజాం, సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, వేటపాలెం, జరుగుమల్లి మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న 79 హ్యాబిటేషన్లపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 17.1 మిల్లీమీటర్ల సగటు వర్షం నమోదైంది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ప్రకటించడం, మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉండటంతో ఎక్కడ కుండపోత వర్షం కురుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బోట్లు, బియ్యం సిద్ధం
తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో పరిస్థితులను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత మండలానికి ఒకటి చొప్పున బోట్లను సిద్ధం చేసింది. ఎవరైనా నీటిలో కొట్టుకుపోతే ఆదుకునేందుకు ఈతగాళ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు వారిని సిద్ధం చేసింది. బియ్యం, ఇతర నిత్యావసరాలు నిల్వ చేసింది. చీరాల నుంచి గుడ్లూరు వరకు ఐదారు పెట్రోలు బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసే పనిలో నిమగ్నమైంది. వైద్య బృందాలను, అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేసింది. అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది. నాలుగైదు రోజుల్లో ప్రసవించే గర్భిణుల వివరాలు సేకరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. వారిని ముందుగానే వైద్యశాలలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఉధృతంగా గుండ్లకమ్మ
గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీటి ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 4,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 4,400 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే రెండు గేట్లను ఎత్తివేశారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే మరో గేట్ ఎత్తివేసే అవకాశం ఉంది. మూడో గేట్‌ను కూడా ఎత్తివేస్తే ప్రాజెక్టు పరిధిలోని గుండ్లాపల్లి, అన్నంగి, మల్లవరం, నేలటూరు, ఏడుగుండ్లపాడు, వెల్లంపల్లి గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు - చదలవాడ చప్టాకు దగ్గరగా నీరు ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేట్ ఎత్తివేస్తే చప్టాపై నీరు ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.
అప్రమత్తంగా ఉండాలి
ఫైలిన్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి తుఫాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బియ్యం, పప్పు, పామాయిల్ నూనె, కిరోసిన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, సీపీఓ వెంకయ్యతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement