పైలీన్ కంటే తీవ్రంగా దూసుకొస్తున్న హుదూద్
హుదూద్ తుఫాను గత సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చిన పైలీన్ తుఫాను కంటే మరింత బీభత్సంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావంతో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం నాడు ఈదురుగాలులు, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం హుదూద్ తుఫాను విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
దీని ప్రభావంతో సముద్రం రెండు మూడు అడుగులు ముందుకు రావచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతోంది. శ్రీకాకుళం జిల్లాకు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 192 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండటంతో ఇక్కడ తుఫాను మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పటికే ఆర్మీ, నేవీ, కోస్ట్గార్డ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. శ్రీకాకుళం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ముందు జాగ్రత్త చర్యలను సమీక్షిస్తున్నారు.
మరోవైపు గుంటూరు జిల్లా యంత్రాంగం కూడా తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైంది. జిల్లాలోని అందరు ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్షించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. విశాఖపట్నం ఓడరేవులో రెండో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. వీటి నెంబర్లు 0863-2234070, 2234301.