Met Department
-
రానున్న 12-18 గంటల్లో తీవ్ర మంచు వర్షాలు! రహదారుల మూసివేత..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్, లడఖ్ ఎగువ ప్రాంతాల్లో ఆదివారం (డిసెంబర్ 5) తీవ్రంగా మంచు కురువడంతో బందిపోరా-గురెజ్, సింథన్-కిష్త్వార్, మొఘల్ రహదారులతో సహా సరిహద్దు రహదారులను మూసివేశారు. రానున్న 12 నుంచి 18 గంటల్లో తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. కాశ్మీర్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసినట్లుగా, అనేక హిల్ స్టేషన్లతో సహా యూనియన్ టెరిటరీ ఎగువ ప్రాంతాల్లో ఉదయం నుండి మంచు వానలు కురుస్తున్నాయి. నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లను మూసివేయాల్సి వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో 3 నుంచి 4 అంగుళాలమేర మంచు పేరుకుపోయింది. మరొపక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చదవండి: కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా.. -
మరో మూడు రోజులు నరకం తప్పదు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యభూతం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. రాబోయే మూడు రోజులలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 17 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయని, ఢిల్లీలో బయటి గాలి అసలు పీల్చుకోడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉందని చెబుతున్నారు. శీతాకాలం వాతావరణంలో కాలుష్యమేఘాలు మరింత తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. దాంతో ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా రాబోయే మూడు రోజుల పాటు పాఠశాలలన్నింటికీ సెలవులు ఇచ్చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. దేశ రాజధాని 'గ్యాస్ ఛాంబర్'లా మారిపోయిందనపి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో పీఎం 2.5, పీఎం 10 చాలా ఎక్కువ స్థాయిలో ఉండబోతున్నాయని హెచ్చరించింది. దానివల్ల బయటి గాలిని పీల్చుకోవడం ప్రజలకు తీవ్ర అనారోగ్యకరం అవుతుందని తెలిపింది. 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ధూళి రేణువులను పీఎం2.5గా (పర్టిక్యులేట్ మేటర్ 2.5) వ్యవహరిస్తారు. ఇవి కళ్లలోకి, గొంతు, ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్లిపోయి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తాయి. అదే పీఎం 10 అయితే మాత్రం దీనికంటే కొంత పర్వాలేదు. 10 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ ఉన్న ఈ ధూళి రేణువుల వల్ల దీర్ఘకాలిక, శాశ్వత ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రస్తుతం పీఎం 2.5, పీఎం 10 రెండూ అత్యధిక స్థాయిలో ఉంటున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని.. అప్పుడు కూడా మాస్కులు ధరించి, ఇతర జాగ్రత్తలు తీసుకుని మాత్రమే రావాలని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
పొంచి ఉన్న మరో ముప్పు!
సాక్షి, విశాఖపట్నం: వానలు, వరదలతో విలవిల్లాడుతున్న రాయలసీమ, దక్షిణ కోస్తాలకు పిడుగులాంటి వార్త ఇది. మూడువారాల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మరో ముప్పు ముంచుకొచ్చేలా ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. గురువారం నాటికి అల్పపీడనంగా బలపడబోతోంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకుని అల్పపీడనద్రోణి ఉపరితల ఆవర్తనంతో కలసి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమపై ఈశా న్య రుతుపవనాలు బలంగా ఉన్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. వాయుగుండంగా మారనుందా? అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాయుగుండంగా బలపడకపోయినా అల్పపీడనం ప్రభావంతోనైనా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీని ప్రభావం ఉత్తర కోస్తాకంటే దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అధికంగా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 28 నుంచి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకుంటూనే ఉన్నాయి. కొద్దిరోజుల నుంచి అల్పపీడనం లేకపోయినా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ, దక్షిణకోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడైతే భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గడచిన 24 గంటల్లో పాలసముద్రంలో 7 సెం.మీలు, చిత్తూరు, పలమనేరు, వెంకటగిరికోటల్లో 5, పాకాల, గోరంట్లల్లో 4, శాంతిపురం, ధర్మవరం, పుంగనూరు, కుప్పం, చెన్నేకొత్తపల్లి, మదనపల్లె, సింహాద్రిపురం, బత్తల పల్లె, నగరి, వెంకటగిరిల్లో 3, పెనుకొండ, తిరుమల, తనకల్, లేపాక్షి, ఆరోగ్యవరం, తాడిమర్రిల్లో రెండేసి సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
పైలీన్ కంటే తీవ్రంగా దూసుకొస్తున్న హుదూద్
హుదూద్ తుఫాను గత సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చిన పైలీన్ తుఫాను కంటే మరింత బీభత్సంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావంతో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం నాడు ఈదురుగాలులు, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం హుదూద్ తుఫాను విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో సముద్రం రెండు మూడు అడుగులు ముందుకు రావచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతోంది. శ్రీకాకుళం జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 192 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండటంతో ఇక్కడ తుఫాను మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పటికే ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. శ్రీకాకుళం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ముందు జాగ్రత్త చర్యలను సమీక్షిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా యంత్రాంగం కూడా తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైంది. జిల్లాలోని అందరు ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్షించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. విశాఖపట్నం ఓడరేవులో రెండో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. వీటి నెంబర్లు 0863-2234070, 2234301. -
కాశ్మీర్ లో భూప్రకంపనలు, రిక్టర్ పై 4.9గా నమోదు
శ్రీనగర్: జమ్మూ,కాశ్మీర్ లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 4.9 గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థినష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. జమ్మూ,కాశ్మీర్ లో మంగళవారం రాత్రి 9.06 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.9గా నమోదైంది అని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భూమి కంపించిన సమయంలో ప్రజలందరూ ఒక్కసారిగా భయాందోళనలతో వీధుల్లో పరుగులు తీశారన్నారు. 2005 అక్టోబర్ 8 తేదిన సంభవించిన భూకంప (7.8) ప్రమాదంలో 40 వేలకు పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసింది.