సాక్షి, హైదరాబాద్ : హెల్త్‌స్కీంలో భాగంగా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగుల చికిత్సకు సంబంధించిన బిల్లు రూపకల్పన, తద్వారా వచ్చిన నిధులను వైద్యులు ఇతర సిబ్బందికి ఎలా పంచాలి అన్నదానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీయూలో ఉండే రోగి చికిత్సకు రోజుకు రూ.2,500, ఏసీ వార్డుకు రూ.1,500, శస్త్రచికిత్స అనంతరం సాధారణ వార్డుకు రోజుకు రూ.1000, ఆపరేషన్ థియేటర్ చార్జీల కింద గంటకు రూ.2వేల నుంచి రూ.3వేలు, ఆహారానికి రోజుకు వంద రూపాయలు, రక్తనిధికి సంబంధించిన చార్జీలను ఒక్కో బ్యాగు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు.
ఉద్యోగులకు వైద్య చికిత్సల ద్వారా ప్రభుత్వాసుపత్రికి వచ్చే సొమ్ములో 20 శాతం నిధులను రివాల్వింగ్ ఫండ్ కింద ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ తీసుకుంటుంది.
ఆ నిధులతో ఆసుపత్రుల్లో యంత్రాలు, ఇతర పరికరాలను సమకూరుస్తారు. మిగతా 80 శాతంలో 45 శాతం రోగుల చికిత్సల కోసం ఖర్చు చేస్తారు.
35 శాతం సొమ్మును వైద్యులు, నర్సులు తదితర వైద్య సేవలు అందించిన వారు తీసుకోవాలి. ఈ 35 శాతం సొమ్ములో ఎలా పంచుకోవాలో వివరించారు.
ఇందులో శస్త్రచికిత్స చేసినవారు లేదా వైద్యసేవలు అందించిన వైద్య బృందం 75 శాతం, రక్తపరీక్షలు లేదా ఎక్స్‌రేలు (ఇన్వెస్టిగేషన్స్) చేసిన వారికి 10 శాతం, నర్సింగ్ సిబ్బందికి 10 శాతం, నాల్గవ తరగతి ఉద్యోగులకు 5 శాతం ఇవ్వాలి. వైద్యులకిచ్చే 75 శాతం సొమ్ములో 55 శాతం సంబంధిత డాక్టర్లు తీసుకుంటే, మిగతా 20 శాతం నిధులు అనస్థీషియన్ (మత్తు డాక్టరు) తీసుకోవాలని పేర్కొన్నారు.
మెడికల్ బిల్లులపై మార్గదర్శకాలు
Published Sun, Feb 2 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement