ఇంటర్మీడియెట్‌ సిలబస్‌లో మార్పులు | New Intermediate syllabus in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియెట్‌ సిలబస్‌లో మార్పులు

Published Thu, Dec 21 2017 3:36 AM | Last Updated on Thu, Dec 21 2017 3:36 AM

New Intermediate syllabus in andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఇంటర్మీడియెట్‌ సైన్స్, లాంగ్వేజెస్, ఒకేషనల్‌ సిలబస్‌ మారుతోంది. కొత్త పాఠ్యపుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తేనున్నారు. ఇంటర్‌ సిలబస్‌ మార్చి ఐదేళ్లు దాటడంతో సిలబస్‌ను మార్చినట్టు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షలను విద్యార్థులు ఎదుర్కొనేలా పలు చాప్టర్లలో మార్పులు చేశారు. నీట్‌ను ప్రవేశపెట్టిన తొలిరోజుల్లోనే బోర్డు నీట్‌ సిలబస్‌పై అధ్యయనం చేసింది. నీట్‌కు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ఫిజిక్స్‌ సిలబస్‌ కంటే బోర్డు సిలబస్‌ ఎక్కువగా ఉందని, దానిలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని భావించింది. జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీల్లో కొన్ని తేడాలుండడంతో అదనపు సమాచారాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తోంది. 

మార్పులివే..
జువాలజీ–1లో బయోడైవర్సిటీలో ‘లెవెల్స్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ’కి సంబంధించిన కొన్ని చిత్రపటాలను, ‘థ్రెట్స్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ’లో లాస్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ పేరాను ఎన్‌సీఈఆర్‌టీ నుంచి అదనంగా చేరుస్తున్నారు. బయోమాస్‌కు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీలో అదనంగా ఉన్న కొన్ని చిత్రపటాలను పాఠ్యపుస్తకాల్లో జతచేస్తున్నారు. జువాలజీ–2లో పేజీ నెంబర్‌ 2లో హార్మోన్‌ చిత్రపటాన్ని మార్చారు. 136, 153 పేజీల్లో గ్రేవ్స్‌ డిసీజెస్‌ చిత్రపటాలను చేరుస్తున్నారు. పేజీ నెంబర్‌ 244లో మొదటి బాక్సు, రెండో బాక్సుల్లో కొన్ని చిత్రపటాలను ఎన్‌సీఈఆర్‌టీ నుంచి అదనంగా జతచేస్తున్నారు. పేజీ నెంబర్లు 249, 250, 252, 258ల్లో ఆయా అంశాల్లో అదనంగా కొన్ని పేరాలను కలుపుతున్నారు. ఇలాగే మరికొన్ని పేజీల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. బోటనీలో పేజీ నెంబర్‌ 2లో వైరస్, వైరాయిడ్స్‌కు సంబంధించి అదనపు పేరాలను చేరుస్తున్నారు. పేజీ నెంబర్‌ 4లో 4.1లో ఆల్గేలో 29, 30 పేజీల్లో అదనపు పేరాలను ఎన్‌సీఈఆర్‌టీ నుంచి జతచేస్తున్నారు. కెమిస్ట్రీలో కూడా 13 అంశాలకు సంబంధించి మార్పులు చేస్తున్నారు. ఫిజిక్స్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు.

జంబ్లింగ్‌లోనే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు 
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ఉదయలక్ష్మి వివరించారు. ఇంగ్లిష్‌లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇఫ్లూ యూనివర్సిటీ ద్వారా మార్పులు చేయించినట్లు తెలిపారు. ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో 2015లోనే మార్పులు చేసినందున రెండేళ్ల తర్వాత సిలబస్‌ను మారుస్తామన్నారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జంబ్లింగ్‌లోనే ఈ ఏడాదీ నిర్వహించనున్నామని ఉదయలక్ష్మి స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో కాకుండా పాత విధానంలో నిర్వహించాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బుధవారం ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముందు ధర్నా చేపట్టాయి. అయితే జంబ్లింగ్‌లోనే ప్రాక్టికల్‌ పరీక్షలుంటాయని ఆమె తేల్చిచెప్పారు. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్‌ కళాశాలలు నిబంధనలు పాటించని కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. దీంతో ఆయా కళాశాలలకు రూ.50 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement