
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుందని, దాని ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి నారాయణస్వామి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంకల్ప యాత్రలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా మద్యనిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3500 ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే గతనెలలో 475 ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించామని చెప్పారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఈ మద్యం దుకాణాలను నిర్వహిస్తామని, వీటి ద్వారా 3500 మంది సూపర్ వైజర్లు, 8033 మంది సేల్స్ మెన్ ఉద్యోగాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
బెల్ట్ షాప్‌లు, నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం
గత ప్రభుత్వం మద్యంను ఆదాయంగా భావించిందనీ, అయితే మహిళల కష్టాలను తీర్చేందుకు దశలవారీ మద్య నిషేధాన్ని చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 43వేల బెల్ట్ షాప్‌లు వెలిశాయని ఆయన మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే ప్రభుత్వం బెల్ట్ షాప్‌లపై ఉక్కుపాదం మోపడంతో.. ఇప్పటికే రాష్ట్రంలో బెల్ట్ షాప్ లను పూర్తిస్థాయిలో నిర్మూలించామన్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులపై 2872 కేసులు నమోదు చేసి, 2928 వ్యక్తులను అరెస్ట్ చేశామని మంత్రి తెలిపారు. అదేవిధంగా నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం మోపామని, 4788 కేసుల్లో 2834 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని ఆయన పేర్కొన్నారు. 18 బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఇంటర్ స్టేట్ బోర్డర్‌లలో 31 చెక్‌పోస్ట్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు.
ఎక్సైజ్ శాఖలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా.. ఎక్సైజ్ అధికారులు చిత్తశుద్దితో పనిచేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది కొరతను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. అంతేకాక 678 కానిస్టేబుల్ పోస్టులకు ప్రతిపాదనలు ఇచ్చామని, ముఖ్యమంత్రి వీటి భర్తీకి సానుకూలంగా స్పందించారని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షిస్తున్నామని అన్నారు. దుకాణాల నిర్వహణపై సీఐ, ఎస్సైలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని, దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ పూర్తిగా బాధ్యత తీసుకుందని మంత్రి నారాయణస్వామి అన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో సారాయి, అక్రమ మద్యం రవాణా లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. 'డీ అడిక‌్షన్ సెంటర్'లను అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం మీద ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని, మద్యపాన నిషేధానికి అందరి సహకారం అవసరమని తెలిపారు. అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో మద్యం ధరలు ఏవిధంగా వున్నాయో పరిశీలించి, మద్యం ధరల పెరుగుదలపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. గతంలో బార్లు రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగించేవారనీ, ఈ సమయాలను తగ్గించాలని ఆలోచిస్తున్నామని ఈ మేరకు మంత్రి చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ మద్యం షాపులతో ఆదాయం తగ్గదు
ప్రభుత్వం నిర్వహించే షాప్‌ల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గదని, రిటైలర్‌లకు ఇచ్చే పదిశాతం ఇన్సెంటివ్ ప్రభుత్వానికే మిగులుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారని, దీంతో ఒక వ్యక్తికి మూడు బాటిళ్లకే పరిమితం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు సంబంధించి కొన్నిచోట్ల అధిక అద్దెలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో.. అద్దెకు ఇచ్చిన వ్యక్తి ఎలా ఇచ్చారో పరిశీలించి, చర్యలు తీసుకుంటామని అన్నారు.
పాఠశాలలు, ఆద్యాత్మిక సంస్థలకు దగ్గరగా మద్యం షాప్‌లు వుండకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. బార్‌లకు దగ్గరగా ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రితో పాటు ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్, బేవరేజస్ ఎండి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment