
ఆశలు బుగ్గి
పట్టణంలోని చర్చిరోడ్డులో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన సురేష్ మహల్ ఉంది.
∙ చీరాలలో భారీ అగ్నిప్రమాదం
∙ కాలి బూడిదైన సురేష్ మహల్
∙ ఆధునిక వసతులతో సిద్ధమైన థియేటర్
∙ ప్రారంభానికి ముందు రోజు ప్రమాదం
∙ రూ.కోటిన్నరకు పైగా ఆస్తినష్టం
∙ తీవ్ర నిరాశలో సినీ అభిమానులు
జిల్లాలో ప్రముఖ పట్టణమైన చీరాలలో నేటికీ టూరింగ్ టాకీసుల వంటి పురాతన థియేటర్లు మినహా ఆధునిక వసతులతో కూడిన సినిమా హాలు ఒక్కటీ లేదు. మోడ్రన్ థియేటర్‌లో సినిమా చూడాలంటే అటు గుంటూరో.. ఇటు ఒంగోలో వెళ్లాల్సిందే. సినిమా కోసం యాభై, అరవై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం ఇక్కడి సినిమా అభిమానులకు ప్రయాసే. ఈ పరిస్థితుల్లో అత్యాధునిక వసతులతో కూడిన మల్టీప్లెక్స్ ఏసీ థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కానీ, దురదృష్టవశాత్తు ప్రారంభానికి ఒక్కరోజు ముందు అగ్నికి ఆహుతైపోయింది. యాజమాన్యానికి పెద్దమొత్తంలో ఆస్తినష్టం.. అభిమానులకు నిరాశకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
చీరాల: పట్టణంలోని చర్చిరోడ్డులో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన సురేష్ మహల్ ఉంది. దీనిని ఏసీ థియేటర్‌ను నవీకరించి, అన్ని హంగులతో రెండు స్క్రీన్లుగా మార్చారు. కొత్త ఫర్నీచర్, సౌండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు నెలలపాటు ఆధునీకరణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శుక్రవారం సినీనటుడు దగ్గుబాటి రానా చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
రానా నటించిన ‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమాతో పునఃప్రారంభించాలనుకున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం థియేటర్‌లో పనులు చేస్తున్న సమయంలో ఏసీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పనివారు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపట్లోనే పొగ, మంటలు థియేటర్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఓ కార్మికుడికి గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చీరాల డీఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్, తహశీల్దార్ ఆర్.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ సూర్యనారాయణలు సిబ్బందితో వచ్చి థియేటర్‌ను పరిశీలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్నవారి నుంచి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జిల్లా అగ్నిమాపక అధికారి సి.పెద్దిరెడ్డి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా.. లేక మరేదైనా కారణాలున్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉందని, థియేటర్‌కు అగ్నిమాపక అనుమతులు కూడా లేవని చెప్పారు. ప్రమాదంలో దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు...
సురేష్‌మహల్ అగ్నిప్రమాదానికి గురైందనే సమాచారం తెలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. నిత్యం వాహనాలతో రద్దీతో ఉండే రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. చీరాలలో మొదటిసారిగా ఏసీ థియేటర్ ప్రారంభం కానుందని, గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా చీరాలలోనే సినిమా చూడవచ్చని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. వారిని అదుపు చేసేందుకు పోలీస్ సిబ్బంది ఇబ్బంది.