
పెండింగ్‌కు కొత్త పూత!
♦ పాత దరఖాస్తుల్ని పరిష్కరిస్తూ
♦ తాజా ఒప్పందాలంటున్న ప్రభుత్వం
(విశాఖ నుంచి సాక్షి ప్రతినిధి) ఓ కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి ఏడాది కిందట రాష్ట్రానికొచ్చింది. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా అనుమతి దొరికితే ఒట్టు! ఇక విసుగొచ్చి ఆ కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. గుజరాత్‌లోని సూరత్‌లో కంపెనీ పెట్టుకుంది. తరవాత ఐటీ క్యాపిటల్ బెంగళూరులో... చివరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోనూ కంపెనీ ఏర్పాటు చేసింది. అన్నిచోట్లా పెట్టుబడులు పెట్టింది. రాష్ట్రంలో మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేశాక చివరకు... ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆ సంస్థకు భూమి కేటాయిస్తూ ఒప్పందం చేసుకున్నారు.
మరో కంపెనీది కూడా ఇదే పరిస్థితి. కాకినాడలో ఐటీ సెజ్ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించటంతో అక్కడ తమ సంస్థకు భూమి కేటాయించాలని ఏడాది కిందట దరఖాస్తు చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఆ కంపెనీతో ఎంఓయూకు కూడా ఈ సదస్సే వేదికయింది.కేంద్ర మంత్రులు, కార్పొరేట్ అధిపతులు ఆంధ్ర ప్రదేశ్ పాలసీ అద్భుతంగా ఉందంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వల్లే ఇది సాధ్యమయిందంటున్నారు.
ఆయన కూడా... 21 రోజుల్లోనే ఏ కంపెనీకైనా అనుమతి ఇస్తామని, లేదంటే ఆటోమేటిగ్గా అనుమతి వచ్చినట్లే భావించాలంటున్నారు. వాస్తవం అలా లేదని చెప్పటానికి పై రెండు కంపెనీలు చిన్న ఉదాహరణలు మాత్రమే. ఓ కంపెనీ దరఖాస్తు పరిష్కారం కావాలంటే ఇలాంటి భాగస్వామ్య సదస్సో లేదా ఇన్వెస్టర్ల సదస్సో జరగాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నట్లు పై రెండు కంపెనీలను బట్టి తెలుస్తోంది. పైగా ఆయా సదస్సుల్లో చాలావరకు ఇలాంటి పాత దరఖాస్తులన్నీ పరిష్కరిస్తూ.. వాటన్నిటినీ తాజాగా కుదిరిన ఒప్పందాలని, వాటి విలువ లక్షల కోట్లని చూపిస్తుండటం మరింత విచిత్రం.
పారదర్శకత లేదు.. వేగం అంతకన్నా లేదు
సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా పలువురిని ‘సాక్షి’ ప్రతినిధి కలిసినపుడు... ముఖ్యమంత్రి చెబుతున్నంత వేగం కింది స్థాయిలో లేదని బాహాటంగానే చెప్పారు. పారదర్శకత కూడా లేదని, పారిశ్రామిక విధానం అనేది రాజకీయం కాకూడదని, ఇక్కడ మాత్రం అదే జరుగుతోందని కొందరు పేర్కొన్నారు. ‘ఉదాహరణకు మైనింగ్‌నే తీసుకోండి. మునుపటి ప్రభుత్వాలు కుదుర్చుకున్న 12 ఎంఓయూలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. పెపైచ్చు అర్హత లేదంటూ పలువురి దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారు.
గడిచిన ఏడాదిన్నర కాలంలో వివిధ కారణాలు చూపిస్తూ 60 వేల పాత దరఖాస్తుల్ని తిరస్కరించారు. వాటి స్థానంలో కొత్తగా తమ వారిని పెట్టుకున్నారు. గతంలో ఎంఓయూలు కుదుర్చుకుని, తిరస్కరణకు గురైనవారెవ్వరినీ ఈ భాగస్వామ్య సదస్సుకు పిలవలేదు. అందుకే ఈ సదస్సులో మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఎంఓయూలు అతితక్కువ ఉన్నాయి’ అని ప్రభుత్వంలో పెద్ద హోదాలో పనిచేసిన ఒకరు వెల్లడించారు.
తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించిన వారిని పిలిచి సందేహాలు నివృత్తి చేసుకోవడం కూడా ఈ ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన పారిశ్రామికుల్ని మార్చడం సరికాదన్నారు.ప్రభుత్వ విధానం మారాలన్నారు. ‘చట్టాలను సరళీకృతం చేయాలి. కొత్తవారిని, వాళ్లకు కావాల్సిన వారిని ప్రోత్సహించుకోవచ్చు కానీ... ఎప్పటినుంచో ఈ రంగంలో ఉన్నవారిని బయటకు నెట్టేయటం సరికాదు’ అని అన్నారు.
ఒప్పందాలకే పరిమితం...!
అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న అనేక సంస్థలు ఆ తర్వాత రాష్ట్రం వైపే చూడటం లేదు. గత ఏడాది పరిస్థితిని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 46 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో సింగపూర్, జపాన్, చైనా కంపెనీలు సైతం ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు పరిశ్రమల స్థాపనకు ముందుకురాలే దు. జపాన్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ అనంతపురంలో 10 వేల మెగావాట్ల సోలార్ యూనిట్ స్థాపిస్తుందని ప్రభుత్వం పెద్దయెత్తున ప్రచారం చేసింది.
దాదాపు 50 వేల ఎకరాలను తామే సమకూర్చి ఇస్తామని ప్రభుత్వం లోపాయికారిగా హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ‘లావాదేవీలు’ ఎక్కడ బెడిసికొట్టాయో తెలీదు. సాఫ్ట్ బ్యాంక్ మాత్రం రాలేదు. భోగాపురం ఎయిర్‌పోర్టు, భావనపాడు పోర్టుల పరిధిలో ఎంవోయూలు చేసుకున్న ఏ ఒక్క సంస్థ ఇప్పటివరకు ముందుకొచ్చిన దాఖలాల్లేవు. ఫుడ్ ప్రోసెసింగ్ రంగానికి సంబంధించి కృష్ణా, గుంటూరులో యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చిన 20 విదేశీ, స్వదేశీ సంస్థల్లో 16 వరకు వెనక్కి మళ్లిపోవడం గమనార్హం.
కుప్పంలో బ్రిటానియా, ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్‌ఏఎల్ గ్రూప్ కొబ్బరి ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా తర్వాత ఆగిపోయాయి. 2014 జూన్ నుంచి ఇప్పటివరకు చూస్తే కేవలం 13 కంపెనీలు మాత్రమే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవి పెట్టబోయే పెట్టుబడుల మొత్తం కూడా కేవలం రూ.1,489.79 కోట్లు మాత్రమే. వీటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు కూడా ఇంకా సిద్ధం కాలేదు. వాస్తవ పరిస్థితి ఇలావుంటే లక్షల కోట్ల ఎంవోయూలు కుదురుతున్నాయని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. విశాఖ సదస్సు తొలి రెండురోజుల్లో రూ.4 లక్షల కోట్ల మేరకు ఎంవోయూలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది పరిస్థితిని చూస్తే.. విశాఖ సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు రాష్ట్రంలో ఏ మేరకు పెట్టుబడులు పెడతాయోనననే అనుమానాలు పారిశ్రామిక వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.
చాలావరకు పాత ఒప్పందాలే..
రూ.2 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సదస్సుకు ముందు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే సీఎం తొలిరోజు ఆదివారమే రూ.1.97 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరినట్లు ప్రకటించారు. ఇక రెండు, మూడు రోజులు కలిపితే ఈ మొత్తం రూ.4 లక్షల కోట్లకు మించిపోతుందని సీఐఐ ఏపీ శాఖ చైర్మన్ చిట్టూరి సురేష్ రాయుడు చెప్పారు. కానీ సోమవారం మరో రూ.1.90 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకున్నట్లు బాబు ప్రకటించారు.
రెండురోజుల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయన్న మాట. ‘ఇందులో చాలా వరకు పాతవే ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి పెద్ద మొత్తాలను ప్రకటిస్తున్నారు. విస్తరణ కోసం కొన్ని కంపెనీలు గతంలో ప్రకటించిన పెట్టుబడుల్నే మళ్లీ కొత్తవిగా ప్రకటిస్తున్నారు’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శ్రీసిటీ ఒప్పందాలు కూడా కొత్తవేమీ కావ ని, అందులో ఇప్పటికే కొనసాగుతున్న కంపెనీలవేనంటున్నారు.
ఇక ఈ పెట్టుబడు ల్లో ఎంత వాస్తవరూపం దాలుస్తాయనేది కూడా మున్ముందు తెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. గుజరాత్‌లో ‘వైబ్రంట్ గుజరా త్’ పేరిట 2015 జనవరిలో సదస్సు నిర్వహించినప్పుడు ఏకంగా రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రావడం గమనార్హం. ఇందుకు సంబంధించి 21,000 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.