CII Partnership Summit
-
విశాఖలో ప్రారంభమైన పెట్టుబడుల సదస్సు
-
ఆ రూ.6.5 లక్షల కోట్లు కేంద్రానివే
‘విశాఖ ఉత్సవ్’లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన రూ.10.50 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూల్లో రూ.6.50 లక్షల కోట్లు కేంద్రం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలవేనని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు రూ.2.25 లక్షల కోట్లు ప్యాకేజీగా ఇస్తుందన్నారు. మూడు రోజుల పాటు సాగరతీరంలో జరగనున్న విశాఖ ఉత్సవ్‌ను ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఉద్యమాలు చేయడం తగదన్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడడం, గణతంత్ర దినోత్సవం నాడు ఆందోళనలు చేపట్టడడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన లోటును పూడ్చే పనిలో కేంద్రం ఉందని, విభజన చట్టంలో ఉన్నవీ, లేనివి కూడా అమలు చేస్తుందని చెప్పారు. ఏటా విశాఖ ఉత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ చైతన్యం, వికాసానికి మారుపేరు విశాఖ అని, పోరాటం చేయగల స్ఫూర్తిమంతులు విశాఖ వాసులని కొనియాడారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సాగరతీరంలో మూడు కిలోమీటర్ల పొడవున పలు కార్యక్రమాలు, వేదికలను ఏర్పాటు చేశారు. -
పాలెన్ని?... నీళ్లెన్ని?
♦ ముగిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ♦ రూ.4.67 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదిరాయన్న సీఎం చంద్రబాబు ♦ ఈ మొత్తంలో సాకారమయ్యేది ఎంతనేదే ప్రశ్న (విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఏదైనా ఎగ్జిబిషన్‌కు టిక్కెట్టు పెడితే ఒకలా... టిక్కెట్టు లేకపోతే మరోలా ఉంటుంది సందర్శకుల తాకిడి. ఎందుకంటే టిక్కెట్టు కొని ఎగ్జిబిషన్‌కు వెళ్లేవారిలో చూడటానికి మాత్రమే వెళ్లేవారు తక్కువ. ఏదో ఒకటి కొందామన్న ఉద్దేశంతో వెళ్లేవారే ఎక్కువ. అదే ఫ్రీ ఎగ్జిబిషన్ అయితే... పోయేదేముందిలే అన్న రీతిలో వెళ్లేవారే అధికంగా ఉంటారు. ఒక రకంగా విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కూడా టికెట్ లేని ఎగ్జిబిషన్‌నే తలపించిందనేది కొందరు సీరియస్ పారిశ్రామికవేత్తల మాట. మూడురోజుల సదస్సు సందర్భంగా రాష్ట్రంలో రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే చివరకు సాకారమయ్యేది ఎంతనేదే ప్రశ్న. నిజానికి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఎవ్వరికైనా సంతోషమే. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అది ఎవ్వరైనా ఆహ్వానించాల్సిన పరిణామమే. కాకపోతే దాన్ని భూతద్దంలో చూపించేసి... ఎంఓయూ కూడా కాకముందే ఆ పరిశ్రమలు వచ్చేసినట్లుగా... రాష్ట్రం నంబర్ వన్‌గా మారిపోయినట్లుగా చిత్రించే ప్రయత్నాలు ఎక్కువ జరిగాయన్నది సీఐఐ సదస్సు చూసినవారికి అర్థంకాక మానదు. ఈ ప్రచారార్భాటాల వల్ల అనవసరమైన ఆశలు రేగుతాయన్న విమర్శలూ లేకపోలేదు. అంచనాలు మించాయంటే అర్థమేంటి? ఇక్కడ రెండు మూడు విషయాలు గమనించాలి. ప్రభుత్వం మొదట రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగొచ్చని అంచనా వేసింది. ముఖ్యమంత్రి చెప్పినదానిని బట్టి.. తొలిరోజు ఒప్పందాలే ఆ అంచనాను అందేశాయి. ఇక రెండు, మూడు రోజుల్లో ప్రకటించిన ఎంఓయూలన్నీ కూడా అంచనాలకు మించినవే. బోనస్సే. అందుకే ఇటు ముఖ్యమంత్రితోపాటు అటు సీఐఐ వర్గాలు సైతం... సదస్సుకు ఊహించని స్పందన వచ్చిందంటూ ఆశ్చర్యం, హర్షం వ్యక్తం చేశారు. అయితే ఊహించని స్పందన వస్తే పొంగిపోవడానికి ఇదేమీ కొత్త సినిమా కాదు. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఒక అంచనా వేశాయంటే దానర్థమేంటి? అప్పటిదాకా వచ్చిన దరఖాస్తులు చూసి, వాటిలో అర్హమైనవి నిగ్గు తేల్చి... వాటిద్వారా వచ్చే పెట్టుబడులు అంచనా వేశాయనే కదా!!. మరి అంచనాలు మించిపోయాయంటే ఏమనుకోవాలి? అవన్నీ అప్పటికప్పుడు హడావుడిగా వచ్చిన దరఖాస్తులనే కదా? వాటిలోని కచ్చితత్వాన్ని, సదరు దరఖాస్తుదారుల సామర్థ్యాన్ని నిగ్గు తే ల్చే సమయం కూడా లేకపోయిందనేగా అర్థం? ఏదో చివర్లో ఒకటో, రెండో సంస్థలు అప్పటికప్పుడు వచ్చాయంటే అనుకోవచ్చు. కానీ అనుకున్న దానికన్నా ఏకంగా 150 శాతం అధికంగా వచ్చాయంటే అర్థమేంటి? సాకారమయ్యేదెంత? ఈ వచ్చిన దరఖాస్తుల్లో సాకారమయ్యే శాతం ఎంతుంటుందనే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో లెక్కుంది. 25 శాతం కావొచ్చని, అలా అయినా సంతోషించాల్సిన విషయమేనని సీఐఐ ఏపీ శాఖ చైర్మన్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించిన కీలక విభాగానికి సారథ్యం వహిస్తున్న ఓ ఐఎస్ఎస్ అధికారి... సదస్సు నేపథ్యంలో కొందరు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే అంశం చర్చకు రావటం కనిపించింది. ఓ 30 శాతం గ్రౌండ్ అవుతాయా? అని పారిశ్రామికవేత్తలు అడిగినప్పుడు ఆయన పెద్దగా నవ్వారు. పోనీ 20 శాతం? అన్నప్పుడు కూడా ఆయనది అదే ఫీలింగ్. 10-15 శాతం సాకారమైతే 100 శాతం అయినట్టే భావించాల్సి ఉంటుందన్నది ఆయన రియాక్షన్. దీనిపై మరో పారిశ్రామిక వేత్తను కదపగా... ఏ సదస్సులోనైనా ఇది సహజమని ఆయన అన్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలను విజయవంతంగా నిర్వహిస్తున్న మరో పారిశ్రామికవేత్త స్పందన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ‘స్టార్టప్ కంపెనీల్లాంటివి కూడా వచ్చి ఎంఓయూలు చేసుకున్నాయి. వాటికి వేరే వేదిక ఉంటే బాగుండేది. వాటిని ప్రత్యేకంగా డీల్ చెయ్యాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ప్రభుత్వం ఈ ఒప్పందాల్లో భాగంగా కొందరికి భూములివ్వటానికి కూడా ఒప్పుకుందని గుర్తుచేస్తూ... ‘భూముల కోసం దరఖాస్తు చేసిన కంపెనీలు భారీ పెట్టుబడికి హామీలిచ్చాయి. కనీసం అలాంటి సంస్థలకైనా వారు పెట్టుబడి పెడతామన్న మొత్తంలో తక్కువలో తక్కువగా 0.5 శాతాన్ని డిపాజిట్ చెయ్యమని అడిగి ఉంటే బాగుండేది. ఆ తర్వాత దాన్ని మాఫీ చేయొచ్చు. అలా చేసి ఉంటే ఈ స్థాయి పెట్టుబడులు వినిపించేవి కాదు’ అని వివరించారు. వినటానికి ఈ ప్రతిపాదన వింతగా ఉన్నా... అసలు పారిశ్రామికులెవరో వడపోయాలంటే ఇదే కరెక్ట్టు పద్ధతేమో అన్పించక మానదు. భూములు తనఖా పెట్టే కంపెనీలు కూడా..? భూముల కోసం వివిధ కంపెనీల పేరిట... వివిధ మార్గాల్లో వచ్చే సంస్థలూ వీటిలో ఉండొచ్చన్నది మరికొందరు లోపాయికారీగా చెప్పిన మాట. ఇప్పటికే పలు పరిశ్రమలు పెట్టి, చక్కని ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీతో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇప్పటికే తమ కంపెనీల్ని విజయవంతంగా నడిపిస్తూ విస్తరణ కోసం వచ్చినవాటితోనూ ఇబ్బంది లేదు. ఇప్పటికిప్పుడు ఏర్పాటై... ‘వినూత్నమైన’ ఆలోచనలతో ముందుకొచ్చిన వాటితోనే ఇబ్బందంతా. ‘ఇలాంటి సంస్థలు భూములు తమ చేతికి దక్కగానే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటాయి. ఆ నిధులను మళ్లిస్తాయి కూడా. కాలం బాగుంటే అవి మళ్లీ ఉద్దేశించిన పరిశ్రమలోకి వస్తాయి. లేకుంటే బ్యాంకులో, ప్రభుత్వమో నష్టపోక తప్పదు’ అంటూ మరో పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ సదస్సు జరపాలని ముఖ్యమంత్రి గట్టిగా భావిస్తున్నారు కనక... అప్పటిలోగా పాలేవో... నీళ్లేవో తెలిసిపోతుందని ఆయన వ్యాఖ్యానించటం కొసమెరుపు. ట్రైనాతో నవంబర్లోనే ఒప్పందం! సదస్సు ముగింపు సందర్భంగా.. కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంత వేగంగా కదులుతున్నాయో ముఖ్యమంత్రి వివరించారు. ట్రైనా సోలార్ సంస్థ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదన చేయటం దగ్గర్నుంచి భూమి పూజ చేయటం వరకు రెండు నెలల్లోనే జరిగిందని చెప్పారు. ‘ఈ రోజు ఎంఓయూ చేసుకున్నాం. అచ్యుతాపురంలో ప్లాంటు ఏర్పాటుకు ఈరోజే వాళ్లు భూమిపూజ కూడా చేస్తున్నారు’ అని తెలిపారు. నిజానికి చైనాకు చెందిన ట్రైనా సోలార్... యూరప్, అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతోంది. నవంబర్లోనే ఇరువురి మధ్య అవగాహన కుదిరింది. రూ.2,800 కోట్లతో విశాఖ జిల్లాలోని అచ్యుతాపురంలో సోలార్ సెల్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఎంఓయూ కుదిరినట్లు గతేడాది నవంబర్ 18నే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత భూమి కేటాయింపు కూడా జరగటంతో మంగళవారం భూమిపూజ చేయగలిగింది. అయితే సీఐఐ సదస్సు సందర్భంగా మంగళవారమే ట్రైనాతో ఎంఓయూ కుదిరిందని ముఖ్యమంత్రి చెప్పటం గమనార్హం. -
పెండింగ్‌కు కొత్త పూత!
♦ పాత దరఖాస్తుల్ని పరిష్కరిస్తూ ♦ తాజా ఒప్పందాలంటున్న ప్రభుత్వం (విశాఖ నుంచి సాక్షి ప్రతినిధి) ఓ కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి ఏడాది కిందట రాష్ట్రానికొచ్చింది. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా అనుమతి దొరికితే ఒట్టు! ఇక విసుగొచ్చి ఆ కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. గుజరాత్‌లోని సూరత్‌లో కంపెనీ పెట్టుకుంది. తరవాత ఐటీ క్యాపిటల్ బెంగళూరులో... చివరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోనూ కంపెనీ ఏర్పాటు చేసింది. అన్నిచోట్లా పెట్టుబడులు పెట్టింది. రాష్ట్రంలో మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేశాక చివరకు... ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆ సంస్థకు భూమి కేటాయిస్తూ ఒప్పందం చేసుకున్నారు. మరో కంపెనీది కూడా ఇదే పరిస్థితి. కాకినాడలో ఐటీ సెజ్ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించటంతో అక్కడ తమ సంస్థకు భూమి కేటాయించాలని ఏడాది కిందట దరఖాస్తు చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఆ కంపెనీతో ఎంఓయూకు కూడా ఈ సదస్సే వేదికయింది.కేంద్ర మంత్రులు, కార్పొరేట్ అధిపతులు ఆంధ్ర ప్రదేశ్ పాలసీ అద్భుతంగా ఉందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వల్లే ఇది సాధ్యమయిందంటున్నారు. ఆయన కూడా... 21 రోజుల్లోనే ఏ కంపెనీకైనా అనుమతి ఇస్తామని, లేదంటే ఆటోమేటిగ్గా అనుమతి వచ్చినట్లే భావించాలంటున్నారు. వాస్తవం అలా లేదని చెప్పటానికి పై రెండు కంపెనీలు చిన్న ఉదాహరణలు మాత్రమే. ఓ కంపెనీ దరఖాస్తు పరిష్కారం కావాలంటే ఇలాంటి భాగస్వామ్య సదస్సో లేదా ఇన్వెస్టర్ల సదస్సో జరగాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నట్లు పై రెండు కంపెనీలను బట్టి తెలుస్తోంది. పైగా ఆయా సదస్సుల్లో చాలావరకు ఇలాంటి పాత దరఖాస్తులన్నీ పరిష్కరిస్తూ.. వాటన్నిటినీ తాజాగా కుదిరిన ఒప్పందాలని, వాటి విలువ లక్షల కోట్లని చూపిస్తుండటం మరింత విచిత్రం. పారదర్శకత లేదు.. వేగం అంతకన్నా లేదు సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా పలువురిని ‘సాక్షి’ ప్రతినిధి కలిసినపుడు... ముఖ్యమంత్రి చెబుతున్నంత వేగం కింది స్థాయిలో లేదని బాహాటంగానే చెప్పారు. పారదర్శకత కూడా లేదని, పారిశ్రామిక విధానం అనేది రాజకీయం కాకూడదని, ఇక్కడ మాత్రం అదే జరుగుతోందని కొందరు పేర్కొన్నారు. ‘ఉదాహరణకు మైనింగ్నే తీసుకోండి. మునుపటి ప్రభుత్వాలు కుదుర్చుకున్న 12 ఎంఓయూలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. పెపైచ్చు అర్హత లేదంటూ పలువురి దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో వివిధ కారణాలు చూపిస్తూ 60 వేల పాత దరఖాస్తుల్ని తిరస్కరించారు. వాటి స్థానంలో కొత్తగా తమ వారిని పెట్టుకున్నారు. గతంలో ఎంఓయూలు కుదుర్చుకుని, తిరస్కరణకు గురైనవారెవ్వరినీ ఈ భాగస్వామ్య సదస్సుకు పిలవలేదు. అందుకే ఈ సదస్సులో మైనింగ్ ఆధారిత పరిశ్రమల ఎంఓయూలు అతితక్కువ ఉన్నాయి’ అని ప్రభుత్వంలో పెద్ద హోదాలో పనిచేసిన ఒకరు వెల్లడించారు. తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించిన వారిని పిలిచి సందేహాలు నివృత్తి చేసుకోవడం కూడా ఈ ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన పారిశ్రామికుల్ని మార్చడం సరికాదన్నారు.ప్రభుత్వ విధానం మారాలన్నారు. ‘చట్టాలను సరళీకృతం చేయాలి. కొత్తవారిని, వాళ్లకు కావాల్సిన వారిని ప్రోత్సహించుకోవచ్చు కానీ... ఎప్పటినుంచో ఈ రంగంలో ఉన్నవారిని బయటకు నెట్టేయటం సరికాదు’ అని అన్నారు. ఒప్పందాలకే పరిమితం...! అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న అనేక సంస్థలు ఆ తర్వాత రాష్ట్రం వైపే చూడటం లేదు. గత ఏడాది పరిస్థితిని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 46 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో సింగపూర్, జపాన్, చైనా కంపెనీలు సైతం ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు పరిశ్రమల స్థాపనకు ముందుకురాలే దు. జపాన్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ అనంతపురంలో 10 వేల మెగావాట్ల సోలార్ యూనిట్ స్థాపిస్తుందని ప్రభుత్వం పెద్దయెత్తున ప్రచారం చేసింది. దాదాపు 50 వేల ఎకరాలను తామే సమకూర్చి ఇస్తామని ప్రభుత్వం లోపాయికారిగా హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ‘లావాదేవీలు’ ఎక్కడ బెడిసికొట్టాయో తెలీదు. సాఫ్ట్ బ్యాంక్ మాత్రం రాలేదు. భోగాపురం ఎయిర్‌పోర్టు, భావనపాడు పోర్టుల పరిధిలో ఎంవోయూలు చేసుకున్న ఏ ఒక్క సంస్థ ఇప్పటివరకు ముందుకొచ్చిన దాఖలాల్లేవు. ఫుడ్ ప్రోసెసింగ్ రంగానికి సంబంధించి కృష్ణా, గుంటూరులో యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చిన 20 విదేశీ, స్వదేశీ సంస్థల్లో 16 వరకు వెనక్కి మళ్లిపోవడం గమనార్హం. కుప్పంలో బ్రిటానియా, ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్ఏఎల్ గ్రూప్ కొబ్బరి ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా తర్వాత ఆగిపోయాయి. 2014 జూన్ నుంచి ఇప్పటివరకు చూస్తే కేవలం 13 కంపెనీలు మాత్రమే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవి పెట్టబోయే పెట్టుబడుల మొత్తం కూడా కేవలం రూ.1,489.79 కోట్లు మాత్రమే. వీటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు కూడా ఇంకా సిద్ధం కాలేదు. వాస్తవ పరిస్థితి ఇలావుంటే లక్షల కోట్ల ఎంవోయూలు కుదురుతున్నాయని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. విశాఖ సదస్సు తొలి రెండురోజుల్లో రూ.4 లక్షల కోట్ల మేరకు ఎంవోయూలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది పరిస్థితిని చూస్తే.. విశాఖ సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు రాష్ట్రంలో ఏ మేరకు పెట్టుబడులు పెడతాయోనననే అనుమానాలు పారిశ్రామిక వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. చాలావరకు పాత ఒప్పందాలే.. రూ.2 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సదస్సుకు ముందు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే సీఎం తొలిరోజు ఆదివారమే రూ.1.97 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరినట్లు ప్రకటించారు. ఇక రెండు, మూడు రోజులు కలిపితే ఈ మొత్తం రూ.4 లక్షల కోట్లకు మించిపోతుందని సీఐఐ ఏపీ శాఖ చైర్మన్ చిట్టూరి సురేష్ రాయుడు చెప్పారు. కానీ సోమవారం మరో రూ.1.90 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకున్నట్లు బాబు ప్రకటించారు. రెండురోజుల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయన్న మాట. ‘ఇందులో చాలా వరకు పాతవే ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి పెద్ద మొత్తాలను ప్రకటిస్తున్నారు. విస్తరణ కోసం కొన్ని కంపెనీలు గతంలో ప్రకటించిన పెట్టుబడుల్నే మళ్లీ కొత్తవిగా ప్రకటిస్తున్నారు’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శ్రీసిటీ ఒప్పందాలు కూడా కొత్తవేమీ కావ ని, అందులో ఇప్పటికే కొనసాగుతున్న కంపెనీలవేనంటున్నారు. ఇక ఈ పెట్టుబడు ల్లో ఎంత వాస్తవరూపం దాలుస్తాయనేది కూడా మున్ముందు తెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. గుజరాత్లో ‘వైబ్రంట్ గుజరా త్’ పేరిట 2015 జనవరిలో సదస్సు నిర్వహించినప్పుడు ఏకంగా రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రావడం గమనార్హం. ఇందుకు సంబంధించి 21,000 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. -
తరలివస్తే.. సదుపాయాలు కల్పిస్తాం
సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, తరలివచ్చి పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలో సోమవారం రెండో రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో 'సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్: కలల సాఫల్యం-విజన్ 2029' అంశంపై ఆయన కీలకోపన్యాసం ఇచ్చారు. ''ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి దేశవిదేశాల నుంచి వచ్చిన ఇన్వెస్టర్లకు నాది భరోసా. సుపరిపాలన, జవాబుదారీతనం, పారదర్శక విధానాలను పాటిస్తూ సింగిల్ డెస్క్ విధానంతో అనుమతులు వేగవంతంగా ఇస్తాం'' అని ముఖ్యమంత్రి ఆహ్వానితులకు వివరించారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీలకు దక్షిణ భారతీయులే సీఈఓలుగా ఉన్నారని గుర్తుచేశారు. సమ్మిళిత వృద్ధితోనే సామాన్యులకు ఫలాలు అభివృద్ధి చెందిన సమాజంలో అభివృద్ధి ఫలాలు పై నుంచి కింది స్థాయికి వాటంతట అవే చేరవని సీఎం చంద్రబాబు అన్నారు. ఆకాంక్షలు నిజం కావాలంటే ప్రభుత్వ విధాన రూపకల్పనదారులు సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. అభివృద్ధి-పేదల సంక్షేమాన్ని తాను ఎలా సమన్వయం చేసుకువస్తున్నదీ ఆహ్వానితులకు వివరించారు. రెండూ పరస్పర విరుద్ధ అంశాలని అందరూ భావిస్తారని, అయితే అది సరికాదని తాను నిరూపించానని చెప్పారు. ప్రాధాన్యక్రమంలో జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేస్తున్నామని తెలిపారు. సేద్యపుకుంటలు, రెయిన్ గన్స్, బిందుసేద్యం ద్వారా కరవు పీడిత జిల్లాలను సస్యశ్యామలం చేయటానికి తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. 10 లక్షల సేద్యపు కుంటలను తవ్వాలని, రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో ఈ లక్ష్యం చేరుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో బలంగా ఉందని, దేశంలోని ఎగుమతులలో 40 శాతం వాటా ఉందని ముఖ్యమంత్రి వివరించారు. -
హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా నేనే మార్చా
-
తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉంది
-
తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉంది: జైట్లీ
విశాఖపట్నం: తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆదివారం విశాఖలో ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని హామీయిచ్చారు. రాష్ట్రానికి ఇస్తున్న పారిశ్రామిక రాయితీలు కొనసాగిస్తామని భరోసాయిచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామన్నారు. -
'పెట్టుబడులకు అపారమైన అవకాశాలు'
విశాఖపట్నం: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం విశాఖలో ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, దక్షిణాదిలో మిగులు విద్యుత్ కలిగిన ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. తమ రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని అన్నారు. తీరప్రాంతాల అభివృద్ధి, తయారీ రంగ పరిశ్రమల కారణంగానే చైనా వృద్ధి చెందిందని గుర్తు చేశారు. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. అనవసర నిబంధనలు తొలగించి పరిశ్రమలకు అనుమతులు సరళీకృతం చేస్తామని తెలిపారు. వృద్ధిరేటులో దేశంతో ఏపీ పోటీ పడుతోందన్నారు. 2022 నాటికి దేశంలో మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2049 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కూడా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చెప్పారు. -
'పెట్టుబడులకు అపారమైన అవకాశాలు'
-
విశాఖలో భాగస్వామ్య సదస్సు ప్రారంభం
-
విశాఖలో భాగస్వామ్య సదస్సు ప్రారంభం
విశాఖపట్నం: మూడు రోజుల పాటు జరిగే భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సు ఆదివారం ప్రారంభమైంది. 'సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ ఇన్వెస్టర్స్ మీట్' విశాఖలోని హార్బర్ పార్కు సమీపంలోని ఏపీఐఐసీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, పీయూష్ గోయల్ తదితర ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. సీఐఐ సదస్సు నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో విశాఖపట్నంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.