![ఆ రూ.6.5 లక్షల కోట్లు కేంద్రానివే](/styles/webp/s3/article_images/2017/09/5/61486152288_625x300.jpg.webp?itok=NbVfT1AL)
ఆ రూ.6.5 లక్షల కోట్లు కేంద్రానివే
‘విశాఖ ఉత్సవ్’లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన రూ.10.50 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూల్లో రూ.6.50 లక్షల కోట్లు కేంద్రం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలవేనని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు రూ.2.25 లక్షల కోట్లు ప్యాకేజీగా ఇస్తుందన్నారు. మూడు రోజుల పాటు సాగరతీరంలో జరగనున్న విశాఖ ఉత్సవ్‌ను ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఉద్యమాలు చేయడం తగదన్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడడం, గణతంత్ర దినోత్సవం నాడు ఆందోళనలు చేపట్టడడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన లోటును పూడ్చే పనిలో కేంద్రం ఉందని, విభజన చట్టంలో ఉన్నవీ, లేనివి కూడా అమలు చేస్తుందని చెప్పారు. ఏటా విశాఖ ఉత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ చైతన్యం, వికాసానికి మారుపేరు విశాఖ అని, పోరాటం చేయగల స్ఫూర్తిమంతులు విశాఖ వాసులని కొనియాడారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సాగరతీరంలో మూడు కిలోమీటర్ల పొడవున పలు కార్యక్రమాలు, వేదికలను ఏర్పాటు చేశారు.