గూడూరు, న్యూస్‌లైన్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఊహాగానాలేనని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి చెప్పారు. శుక్రవారం గూడూరు విచ్చేసిన ఆయన పార్టీ నాయకులతో స్థానిక సమస్యలపై చర్చించారు. సీఎం కొత్త పార్టీ పెడుతున్నారా అని ఈ సందర్భంగా ఆయన్ని విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కరుడుగట్టిన సమైక్యవాది అని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇటీవల రాష్ట్రంతో పాటు జిల్లాలోని పలు పట్టణాల్లో జై సమైక్యాంధ్ర నినాదంతో కూడిన ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. కొత్త పార్టీ పెట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగమే ఈ ఏర్పాట్లని.. ఎంపీ లగడపాటి బ్యానర్ల వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోందని మంత్రిని ప్రశ్నించగా ఇది అవాస్తవమన్నారు. తమకు అందిన సమాచారం మేరకు 18 ఉద్యోగ సంఘాలు త్వరలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముమ్మరం చేయనున్నట్లు తెలిసిందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా వారే ఈ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
లజ్జబండ సమస్య పరిష్కరించండి...
స్థానిక మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. రైతులు సాగు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న లజ్జబండ పూడికతీత పనులను త్వరితగతిన చేపట్టాలని ఆయన్ని కోరారు. కాలువలో నిత్యం తూడు, గుర్రపుడెక్క నిండిపోతుండటంతో కొద్ది వర్షాలు కురిసినా డ్రెయిన్‌లో నీరు ఎగదన్ని సమీప పొలాలన్నీ ముంపునకు గురవుతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇరిగేషన్, డ్రెయిన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కొల్లువారి వీధిలోని ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద లజ్జబండ డ్రెయిన్‌పై కాలిబాట వంతెన నిర్మించాలని రైతులు కోరగా, అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు.
కొత్త పార్టీ.. ఊహాగానాలే : మంత్రి కె.పార్థసారథి
Published Mon, Jan 20 2014 2:41 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement