పింఛన్.. వచ్చెన్..! | new pensions | Sakshi
Sakshi News home page

పింఛన్.. వచ్చెన్..!

Published Thu, Mar 26 2015 2:51 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

పింఛన్.. వచ్చెన్..! - Sakshi

పింఛన్.. వచ్చెన్..!

రద్దుచేసిన నాలుగు వేల పింఛన్ల పునరుద్ధరణ
ఏప్రిల్ నుంచి పంపిణీకి చర్యలు
జన్మభూమిలో 45,974 దరఖాస్తులు
జిల్లాకు 17 వేల పింఛన్ల కేటాయింపు
ఎంపిక బాధ్యత  జన్మభూమి కమిటీలదే

 
విశాఖపట్నం: జిల్లాకు కొత్త పింఛన్లు రాబోతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి.. మంజూరుకానున్న పింఛన్లకు పొంతన లేదు.  అనర్హులంటూ తొలగించిన పింఛన్లలో మాత్రం మూడవవంతు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. పునరుద్ధరించనున్న పింఛన్లను  ఏప్రిల్-1వ తేదీ నుంచి పంపిణీ  చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల కోసం ఎంపిక బాధ్యతను మాత్రం మళ్లీ జన్మభూమి కమిటీలకే ఇవ్వనుండడం  వివాదస్పదమవుతోంది. వడపోతల అనంతరం జిల్లాలో జీవీఎంసీ పరిధిలో 56,127 పింఛన్లుండగా, రూరల్ ప్రాంతంలో 3,04,777 పింఛన్లున్నాయి. గతేడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.200 నుంచి రూ.1000, వికలాంగ పింఛన్లను రూ.500 నుంచి రూ.1500లకు పెంచారు. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలో ఉన్న పింఛన్ల కోసం రూ.5.96 కోట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పింఛన్ల కోసం 34.41 కోట్లు ప్రతి నెలా చెల్లిస్తున్నారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్స్ (సీఎస్‌పీ)లను తొలగించడంతో గతేడాది డిసెంబర్ నుంచి పంపిణీ చేయడం  పారంభించారు. జన్మభూమి కమిటీతో నిర్వహించిన సర్వేలో జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా పింఛన్లను తొలగించగా, ఆ తర్వాత విపక్షాలు.. ప్రజాసంఘాల పోరాటం..పింఛన్‌దారుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు దశల వారీగా సుమారు ఐదారువేల వరకు పునరుద్ధరించగలిగారు.

అయినప్పటికీ అర్హులైన మరో 15వేల మంది వరకు పింఛన్లు దక్కని పరిస్థితి ఏర్పడింది.  వీరిలో కూడా చాలా మంది అర్హులున్నారంటూ వారికి పింఛన్ పునరుద్ధరిం చాలని జన్మభూమి కమిటీలతో పాటు క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా సిఫార్సు చేశారు. ఈ విధంగా రోల్ బ్యాక్ పింఛన్లు  జిల్లాలో 6,800 వరకు ఉన్నాయి. వీటిలో   4వేల పింఛన్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. వీటిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాత పింఛన్లతో కలిపి మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరో పక్క గతేడాది అక్టోబర్, నవంబర్‌లలో రెండు విడతలుగా నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కొత్త పింఛన్ల కోసం  జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 34,654, అర్బన్‌లో 11,320 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రాథమికంగా 35 వేల మంది అర్హులున్నారని అప్‌లోడ్ చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం  కేవలం 17వేల పింఛన్లు మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో మూడో వంతు మందికి మాత్రమే మంజూరుచేస్తే మా పరిస్థితి ఏమిటని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల ఎంపిక బాధ్యతను మాత్రం మళ్లీ జన్మభూమి కమిటీలకే అప్పగించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన వారికే ఈ పింఛన్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో తామంతా ఉత్సహ విగ్రహాలుగా తయారయ్యాయమని, కనీస విద్యార్హతలు కూడా లేని వారు సిఫార్సు చేస్తే సంతకాలు చేయాల్సివస్తోందని గ్రామ, మండల స్థాయి అధికారులు అసంతృప్తితో ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement