జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు, వారి విధులు, నిధుల వ్యయం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చే ప్రక్రియలో భాగంగా కౌన్సిల్ ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు రాష్ట్ర పీఆర్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి ఈనెల 17వ తేదీన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ మేరకు 20 మందితో జిల్లా శిక్షణా కౌన్సిల్, 34 మందితో మండల కౌన్సిల్ ఏర్పాటైంది. జిల్లా స్థాయిలో చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్లుగా జెడ్పీ సీఈఓ, డీపీఓలు, మండల స్థాయిలో చైర్మన్‌గా ఎంపీడీఓలు, కన్వీనర్లుగా ఈఓపీఆర్‌డీలు వ్యవహరించనున్నారు. కలెక్టర్ జి.కిషన్ ఆమోదం మేరకు జిల్లా శిక్షణా కౌన్సిల్ కన్వీనర్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు జిల్లా కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా కౌన్సిల్‌లో నియమితులైన సభ్యులు మంగళవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆపార్డులో జరిగే ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి వెళ్లనున్నారు.
జిల్లా శిక్షణా కౌన్సిల్...
గ్రామ సర్పంచ్‌లకు మినహా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో జిల్లా శిక్షణా కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్య 20నుంచి 12మందికి పరిమితమైంది. ఈ కౌన్సిల్‌లో మొగుళ్లపల్లి మండలం గణేష్‌పల్లి సర్పంచ్ వేముల సౌందర్య, మరిపెడ మండలం బురహన్‌పురం సర్పంచ్ మచ్చ శ్రీనివాస్, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల సర్పంచ్ వి.సంగీత, తొర్రూరు పంచాయతీ సర్పంచ్ డి.రాజేష్‌నాయక్‌తోపాటు సర్పంచ్ కోటాలో స్టేషన్‌ఘన్‌పూర్, తాడ్వాయి ఎంపీడీఓలు ఎం.సంపత్‌కుమార్, ఎన్ .వసుమతి, జఫర్‌గఢ్, ములుగు ఈవోపీఆర్‌డీలు నారాయణరెడ్డి, డా.రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిగా మారి సంస్థకు చెందిన మురళీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గణేష్‌పల్లి సర్పంచ్ వేముల సౌందర్యకు సీఈఓ ఆంజనేయులు నియామకపు ఉత్తర్వులు అందజేశారు.
మండల శిక్షణా కౌన్సిల్...
మండల స్థాయి శిక్షణా కౌన్సిల్‌లో ఆయా మండలాల్లోని నలుగురు ఎంపీటీసీలు, నలుగురు సర్పంచ్‌లు, 10మంది వార్డు సభ్యులు, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ ఇంజినీరింగ్ ఏఈలు, నలుగురు పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయాధికారి, ఐసీడీఎస్ సీడీపీఓ, పశువైద్యాధికారి, పీహెచ్‌సీ డాక్టర్, స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎన్జీఓ, ప్రత్యేక ఆహ్వానితులుగా అనుభవం ఉన్న విషయ నిపుణుడు, మండల తహసీల్దార్ ఉంటారు. జిల్లా శిక్షణ కౌన్సిల్‌కు ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొంది వచ్చిన తర్వాత మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలిపారు.
నూతన ప్రజాప్రతినిధులకు ‘కౌన్సిల్’
Published Tue, Aug 27 2013 6:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement