తణుకు అర్బన్: సర్కారు ఆస్పత్రుల్లో వైద్యులు ఎవరు.. సిబ్బంది ఎవరు.. ఏ వైద్యుడు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు.. ఎవరు లేరు.. ఏ రోగానికి ఎవరిని సంప్రదించాలి అనే వివరాలు ఇకపై సులభంగా తెలుసుకునే వీలు కలగనుంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు వైద్యవిధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, సిబ్బందికి డ్రెస్‌కోడ్‌తోపాటు విధి విధానాలను ప్రకటించారు. ఈ నెల 1 నుంచి ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యశాఖ అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు ఆకుపచ్చ రంగు, ఉద్యోగులకు నీలం రంగు, టెక్నికల్ స్టాఫ్‌కు ఎరుపు రంగు, ఫోర్త్ క్లాస్ సిబ్బందికి పసుపు రంగు, మినిస్టీరియల్ సిబ్బందికి గోల్డెన్ పసుపు రంగుల్లో నేమ్ బోర్డులను అందజేశారు.
మార్గదర్శకాలు ఇవే
♦ వైద్యుడి నుంచి సిబ్బంది వరకు యూనిఫాం వేసుకోవాల్సిందే. అంటే డ్రెస్ కోడ్ తప్పక పాటించాలి.
♦ తమ హోదా, పేరు తెలిపే నేమ్ బోర్డును డ్రెస్‌పై ఛాతీ ప్రదేశంలో అమర్చుకోవాలి.
♦ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాల్సిందే.
♦ వైద్యుడు అందుబాటులో ఉన్నారా లేరా అనేది ఇన్/అవుట్ బోర్డు ఆస్పత్రి ముఖద్వారంలో ఉండాలి.
♦ షిఫ్ట్‌ల ప్రకారం విధుల్లో ఉండే ఉద్యోగులు నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఉండాలి.
♦ క్లాస్ ఫోర్ ఉద్యోగులు షిఫ్ట్‌లు కాకపోతే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండాలి.
♦ కాల్ డ్యూటీ విధులు నిర్వర్తించే వైద్యులు, నర్సులకు ఉదయం ఒక గంట ఆలస్యమైనా అనుమతి ఉంటుంది.
♦ ఉదయం 9.15 గంటలు దాటిన తరువాత విధులకు హాజరైన వైద్యులు, సిబ్బందికి సగం రోజు ఆబ్సెంట్ వేస్తారు.
♦ వరుసగా మూడు ఆబ్సెంట్‌లకు ఒక సీఎల్ (క్యాజువల్ లీవ్) పోతుంది.
ప్రయోజనాలివే..
విధుల్లో ఉండాల్సి వైద్యులు తాపీగా రావడం, వచ్చి బయటకు వెళ్లడం వంటి కారణాలతో జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను రోగులు వైద్యసేవల కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. కొత్త మార్గదర్శకాల కారణంగా ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఏ సమయంలో రోగులు ఆస్పత్రికి వెళ్లినా వైద్యసేవలు అందుతాయి. వైద్యులు, ఉద్యోగులు యూనిఫాంలో ఉండి నేమ్‌బోర్డు ధరించడం వలన వారు ఎవరు అనే విషయం తెలుస్తుంది. ఇన్/అవుట్ బోర్డు ద్వారా ఏ డాక్టరు అందుబాటులో ఉన్నారనేది సులువుగా అర్ధమవుతుంది.
సీసీ కెమెరాలు కలెక్టరేట్‌కు అనుసంధానం
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలనే నిబంధన 80 శాతం మంది పాటించడంలేదనేది వైద్యాధికారుల ఆరోపణ. ఆయా ఆస్పత్రుల వైద్యాధికారులు సమయానికి రావాల్సి ఉందని హెచ్చరిస్తుంటే తమ సామాజిక వర్గాల నాయకులను వెంటబెట్టుకుని పోరాటం చేస్తున్నారని, ఈ కారణంగా వైద్యాధికారులు చూసీచూడనట్లు ఉండాల్సి వస్తోందనేది ప్రధాన విమర్శ. దీనికి చెక్ పెట్టేందుకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను కలెక్టరేట్‌కు అనుసంధానం చేయించారు. బయోమెట్రిక్ హాజరు వేసి జారుకునే వారి వివరాలు సేకరించేందుకు ఆస్పత్రుల సీసీ పుటేజీలను కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఎవరు ఏంటి అనేది తెలుసుకుని నేరుగా పనిష్మెంట్ ఇవ్వనున్నట్టు సమాచారం.
నిబంధనలు పాటించాల్సిందే
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యశాఖలో, వైద్యవిధాన పరిషత్‌లో అమలులోకి తెచ్చిన నూతన నిబంధనలను వైద్యులు, సిబ్బంది పాటించాల్సిందే. అందరూ యూనిఫాం ధరించాలి. నేమ్ బోర్డు కనిపించేలా అమర్చుకోవాలి. సమయపాలన తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్‌ఎస్, ఏలూరు
నిబంధనలు పాటించకపోతే చర్యలు
వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వైద్యశాఖలో వస్తున్న మార్పులను వైద్యులు, సిబ్బంది పాటించాలి. గతంలో మాదిరిగా వచ్చాం.. వెళ్లాం.. అంటే ఇక కుదరదు. డ్రెస్ కోడ్‌తోపాటు వైద్యసేవల్లో కూడా సమయపాలన అనుసరించాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌ఓ, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment