
కడప కల్చరల్ : యమా స్పీడుగా ద్విచక్ర వాహనాలు...వాటిపై యువకుల సర్కస్ విన్యాసాలు, కేకలు, కేరింతలు, వచ్చేపోయే వారిని ఆపి మరీ శుభాకాంక్షలు తెలిపిన యువత...జిల్లాలో అర్ధరాత్రి అంతటా సంబరాలు నెలకొన్నాయి. ఒక్కసారిగా ఇళ్లన్నీ మేల్కొన్నాయి. అన్ని వర్గాల ప్రజల్లోనూ కట్టలు తెగిన ఉత్సాహం, ఉద్వేగం, ఉల్లాసం....ఇవీ జిల్లాలో సోమవారం అర్దరాత్రి విశేషాలు.
నూతన సంవత్సరాన్ని మరుపురాని విధంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవాలని ప్రజలు రాత్రి 11 గంటల నుంచి ఉత్కంఠ భరితంగా ఎదురుచూశారు. అర్ధరాత్రి దగ్గర పడేకొద్దీ ప్రతిక్షణం వాచీలు, సెల్‌ఫోన్లలో సమయం చూసుకుంటూ గడిపారు. సరిగ్గా 12 గంటలకు దిక్కులు పిక్కటిట్టేల్లా అరుపులు, కేరింతలు...ఒకరినొకరు పట్టుకుని ఊపేసుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకున్నారు. రోడ్ల కూడళ్లలో యువకుల బృందాలు భారీ కేకులు కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు.. కేరింతలతో బైకులపై విన్యాసాలు చేస్తూ వీధుల్లో కలియతిరిగారు. ఈ సందర్బంగా పలు క్రైస్తవ ప్రార్థన మందిరాలు, చర్చిలలో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. విశ్వాసులు మారు మనసుపొంది కొత్త జీవితాన్ని ఆహ్వానించాలని క్రైస్తవ గురువులు సందేశమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment