సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ నిర్మాణం విషయంలో ప్రజల అభ్యంతరాలు, ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా నిధుల మంజూరులో ముందడుగు వేయొద్దని ప్రముఖ సామాజికవేత్తలు, మేధావులు, నిపుణులు ప్రపంచ బ్యాంకును కోరారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు తాజాగా రాసిన లేఖపై మేధా పాట్కర్, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, గోల్డ్‌మేన్ పురస్కార గ్రహీత ప్రఫుల్ల సమంత్ర, శాస్త్రవేత్త బాబూరావుతోపాటు 46 మంది సంతకాలు చేశారు.
రాజధాని నిర్మాణం పేరిట రైతులను భయపెట్టి వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుందని ఆక్షేపించారు. ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు అమరావతిలో పర్యటించిన తర్వాత సమర్పించిన నివేదికను బ్యాంకు వెబ్‌సైట్‌లో పెట్టినట్లే పెట్టి వెనక్కి తీసుకోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. రాజధాని నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ, రైతులను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజలను సంప్రదించకుండానే విధివిధానాలు రూపొందించడం, ఆహార భద్రతకు ముప్పు, సారవంతమైన భూములు కోల్పోవడం.. తదితర అంశాల్లో లోతైన విచారణ అవసరమని తనిఖీ బృందం నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు.
రాజధాని నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన, పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి హాని కలిగించే అంశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక ద్వారా తేటతెల్లమైందని పేర్కొన్నారు. తనిఖీ బృందం నివేదికను బ్యాంకు డైరెక్టర్లు సమీక్షించకముందే పొరపాటున వెబ్‌సైట్‌లో పెట్టామని, తర్వాత ఉపసంహరించామని పత్రికా ప్రకటన విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment