సాక్షి, కడప: ప్రజా పంపిణీ వ్యవస్థ రోజురోజుకూ అధ్వానంగా తయూరవుతోంది. ప్రభుత్వం ప్రతినెల సరఫరా చేసే నిత్యావసర వస్తువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. తాజాగా నవంబరు నెలకు సంబంధించి కేవలం రెండే వస్తువులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే బియ్యం, చక్కెర జిల్లాలోని గోడౌన్లకు సరఫరా చేశారు. దాదాపు ఎనిమిది నెలలుగా జిల్లాలోని సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదు. ఒక నెలలో అందజేసిన సరుకులు మరో నెలకు వచ్చే సరికి తగ్గిపోతున్నాయి.
కవరుపై అమ్మహస్తం తొలగింపు
కాంగ్రెస్ నాయకత్వంలోని కిరణ్‌సర్కార్ అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి తొమ్మిది సరుకులను రూ.185లకే ఇచ్చేలా పథకం రూపొందించింది. అప్పటి నుంచి 2014 ప్రారంభం వరకు అందజేస్తూ వచ్చినా.... రాష్ర్టపతి పాలన ఆరంభం నుంచి సమస్య మొదలైంది. దాదాపు పది నెలలవుతున్నా పాలకులు సామాన్యుడికి తొమ్మిది సరుకులు అందించిన పాపాన పోలేదు. అమ్మహస్తం పేరుతో ఉన్న పథకాన్ని టీడీపీ సర్కార్ ఆర్బాటంగా ఎన్టీఆర్ ప్రజా పంపిణీ వ్యవస్థగా పేరు మార్చినా అమలులో మాత్రం అంతా ఆర్బాటమే కనిపిస్తోంది. లబ్ధిదారులకు అందించే రేషన్ కూపన్లపై ఎన్టీఆర్ బొమ్మతో కూడిన పథకాన్ని ముద్రించినా సరుకుల విషయంలో కోత పెడుతుండడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చక్కెర ప్యాకెట్‌పై అమ్మహస్తం పథకానికి సంబంధించిన అక్షరాలను తీసివేసి కవరు ముద్రించాల్సిరావడంతో ఆలస్యం జరుగుతోంది.
ఈసారికి ఇంతే!
ఎన్టీఆర్ ప్రజా పంపిణీవ్యవస్థగా పేరు మార్చినా ప్రజలకు మాత్రం సంపూర్ణంగా సరుకులు అందడం లేదు. నెలనెలకు సరుకుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. కొన్నిచోట్ల 10వ తేదీ దాటినా సరుకుల పంపిణీ జరగలేదు. అందుకు కారణం చక్కెర ప్యాకెట్లు జిల్లాకు ఆలస్యంగా రావడమే. అప్పటివరకు పంపిణీ చేయవద్దని అధికారులు ఆదేశించడంతో కొన్నిచోట్ల ఇప్పటికీ డీలర్లు సరుకులను పంపిణీ చేయలేదు. మరికొన్నిచోట్ల ఇప్పటికే తొలుత అందించిన బియ్యం మాత్రమే కార్డుదారులకు అందించారు. ప్రస్తుతం గోడౌన్లనుంచి డీలర్లకు చక్కెర ప్యాకెట్లను పంపిణీ చేశారు. దీంతో బియ్యానికి తోడు చక్కెరను కూడా పంపిణీ చేసేందుకు డీలర్లు సిద్ధమయ్యారు.
పామోలిన్, గోధుమలు, చింతపండు, కందిబేడలకు పంగనామాలు
జిల్లాలో 7,79,328 కార్డుదారులకు 1737 మంది డీలర్ల ద్వారా సరుకులను అందిస్తున్నారు. ఇటీవల కాలంలో పామోలిన్, కందిబేడలు, గోధుమలు, చింతపండు, కారంపొడి, పుసుపు తదితర సరుకులకు ప్రభుత్వం పంగనామాలు పెట్టింది. పామోలిన్ దాదాపు ఎనిమిది నెలలుగా పంపిణీకి నోచుకోక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సర్కారు వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఏదీ మార్పు?
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ మార్పులు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ఇంతవరకు ప్రజలకు అందించే నిత్యావసర సరుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీపై దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు.
తొమ్మిది కాదు రెండే!
Published Fri, Dec 12 2014 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM
Advertisement