‘మృత్యు’తాపం | Nine people died with sunstroke | Sakshi
Sakshi News home page

‘మృత్యు’తాపం

Published Sun, May 31 2015 5:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

Nine people died with sunstroke

వడదెబ్బకు 9 మంది  మృతి
 
 జిల్లాలో సూర్య ప్రతాపం కొనసాగుతోంది.. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతున్నాడు.. జనం విలవిలలాడిపోతున్నారు.. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు.. శనివారం తొమ్మిది మంది మృతి చెందారు.     - నెట్‌వర్క్
 
 సంబేపల్లె: ఎస్.సోమవరం గ్రామానికి చెందిన కోట రెడ్డెమ్మ (32) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందింది. శుక్రవారం గ్రామ సమీపాన ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తుండగా ఎండకు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. బాధితురాలిని బంధువులు  తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నా కోలుకోలేక తెల్లవారుజామున మృతి చెందింది.

 గాలివీడు: గోరాన్ చెరువు దాసరివాండ్లపల్లెకు చెందిన తాటిపర్తి తిమ్మక్క(60) శుక్రవారం రాత్రి వడదెబ్బకు గురై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి బేదులు(మోషన్స్) కావడంతో పండ్ల రసాలు, మజ్జిగ ఇచ్చామని చెల్లలు అచ్చమ్మ తెలిపింది. వైద్యంకోసం బయలుదేరే లోగానే పరిస్థితి విషమించి మృతి చెందినటుర్ల సోదరుడు చంద్రయ్య పేర్కొన్నారు.

 ఒంటిమిట్ట: కొత్తమాధవరం గ్రామంలోని బిట్టా యానాదమ్మ(70) శుక్రవారం వడదెబ్బ కారణంగా మృతి చెందింది.
 ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలలో ఇరువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. పాండురంగస్వామి ఆలయం వీధిలో నివాసం ఉంటున్న ఓటూరు కుల్లాయప్ప (65) శనివారం ఇంట్లో నిద్రిపోతుండగా నీళ్లు దప్పికవుతున్నాయని అంటూ పడిపోయాడు. వెంటనే అయనను పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న అతను కోలుకోలేక మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అలాగే సంజీవనగర్‌లో నివాసం ఉంటున్న పందిటి లక్ష్మినారాయణ (58) శుక్రవారం సాయంత్రం వడదెబ్బతో మృతి చెందాడు. అతను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మేకలు మేపుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఆ ప్రాంత వాసులు వెళ్లి చూడ గా మృతి చెంది ఉన్నాడు. అతనికి భార్య, కుమార్తె, నలుగురు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం అతని అంత్యక్రియలు నిర్వహించారు.

 పుల్లంపేట: రంగంపల్లె గొల్లపల్లెకు చెందిన గుర్రంకొండ వెంకటయ్య(60) ఉపాధి పనులకు కూలీగా వెళుతూ జీవనం సాగించే వాడు. ఈ క్రమంలో శుక్రవారం అనారోగ్యంగా వుండడంతో స్థానికంగా చికిత్స పొందాడు. శనివారం ఎండతీవ్రత అధికం కావడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు.

 బద్వేలు అర్బన్: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. శివానగర్‌కు చెందిన ఎస్.వెంకటేశ్వర్లు(55) ధాన్యం కొనుగోలు వ్యాపారం చేస్తుండే వాడు. శుక్రవారం ఇదే పనిపై తిరిగి వచ్చి రాత్రి తీవ్ర జ్వరంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే సురేంద్రనగర్‌కు చెందిన కె.రమణయ్య (46) వృత్తి రీత్యా టైలర్. శుక్రవారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement