
బాలికపై లైంగిక దాడి.. బీరువాలో బందీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం విషయం బయట పడుతుందని బాలిక గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. బాలిక చేతులు కట్టేసి ఊపిరాడకుండా బట్టలు కప్పి బీరువాలో కుక్కి పరారయ్యాడు. ఓ మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా తల్లిదండ్రులు తమ చిన్నారిని ప్రాణాలతో కాపాడుకోగలిగారు. నివ్వెరపోయే ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట దావుద్‌బస్తీకి చెందిన బాలిక(9) కుటుంబం, బీహార్‌కు చెందిన బబ్లూ(25) కుటుంబం పక్క పక్క గదుల్లో అద్దెకు ఉంటున్నారు. స్థానికంగా ఓ ఆటో సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తున్న బబ్లూ ఆ కుటుంబంతో చాలా చనువుగా ఉండేవాడు.
బబ్లూ భార్య ప్రసవం నిమిత్తం బీహార్‌కు వెళ్లటంతో అతడి కన్ను బాలికపై పడింది. బబ్లూ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చాక్లెట్‌లు ఇప్పిస్తానని చెప్పి బాలికను నాలుగో అంతస్తులోని తన గదికి తీసుకువెళ్లాడు. అనంతరం బాలికపై ఆత్యాచారం జరిపి చేతులు కట్టేసి బీరువాలో కుక్కి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం కుమార్తె కోసం గాలిస్తున్న బాలిక తల్లిదండ్రులతోనే ఏమీ తెలియనట్లు కొద్దిసేపు గడిపాడు. బాలికను బబ్లూ తీసుకెళుతుండగా చూసినట్లు ఓ మహిళ రాత్రి 7 గంటల సమయంలో వెల్లడించటంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. బబ్లూ గది తాళాన్ని పగులగొట్టిన బాలిక తల్లిదండ్రులు బీరువా నుంచి శబ్దాలు రావటంతో తెరచి చూశారు. బీరువాలో బాలికను చేతులు కట్టేసి ఉంచటంతో అపస్మారక స్థితికి చేరుకుంది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు నిందితుడు బబ్లూపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.